బంకర్‌లో భయంగా

ABN , First Publish Date - 2022-03-06T05:11:46+05:30 IST

‘ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో బిక్కుబిక్కు మంటూ గడిపాం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బంకర్లలో గడిపాం. తిండి, నీళ్లు లేకుండా అలమటించాం.

బంకర్‌లో భయంగా

ఉక్రెయిన్‌పై రష్యా దాడితో వణికిపోయాం

కళ్ల ముందు యుద్ధం జరగడంతో ఉక్కిరిబిక్కిరయ్యాం

రాత్రివేళ కర్ఫ్యూతో ఇబ్బందులు

రుమేనియా వరకు తిరిగొస్తామన్న నమ్మకం లేదు

ఇండియన్‌ ఎంబసీ అధికారులు బ్రెడ్డు, జామ్‌ ఇచ్చారు

ఇంకా చాలా మంది సరిహద్దులోనే ఉన్నారు

‘ఆంధ్రజ్యోతి’తో ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన విద్యార్థులు


 ‘ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో బిక్కుబిక్కు మంటూ గడిపాం. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బంకర్లలో గడిపాం. తిండి, నీళ్లు లేకుండా అలమటించాం. కేంద్ర ప్రభుత్వం చొరవతో బతుకు జీవుడా అంటూ ఇళ్లకు చేరుకున్నాం’ అని అంటున్నారు ఉక్రెయిన్‌లో చదువుకునేందుకు వెళ్లిన ఉమ్మడి జిల్లాలోని విద్యార్థులు. క్షేమంగా ఇళ్లకు చేరుకున్న విద్యార్థులను ‘ఆంధ్రజ్యోతి’ శనివారం పలకరించింది. యుద్ధం నేపథ్యంలో ఉక్రేయిన్‌లో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇండియాకు రావడానికి పడ్డ కష్టాలను పంచుకున్నారు. వివరాలు వారి మాటల్లోనే..

- జడ్చర్ల/నారాయణపేట /గద్వాల/పెద్దమందడి/నాగర్‌కర్నూల్‌ టౌన్‌


బస్సు అద్దెకు తీసుకుని వెళ్లాం

నేను ఉక్రెయిన్‌ రాష్ట్రం ఒడెస్సాలోని యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదువుతున్నా. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి చేస్తున్న సమయంలో యూనివర్సిటీలోనే ఉన్నాం. యుద్ధ వాతావరణంతో బిక్కుబిక్కుమంటూ గడిపాం. ఒడెస్సా నుంచి సుమారు 50 మంది విద్యార్థులం ఒక ప్రైవేట్‌ బస్సును అద్దెకు చేసుకుని, గత నెల 26న రుమేనియాకు బయల్దేరాం. 20 గంటల పాటు బస్సు ప్రయాణం చేసిన అనంతరం 27న రుమేనియా దేశ బార్డర్‌కు చేరుకున్నాం. బార్డర్‌కు చేరుకున్న మమ్మల్ని ఇండియా, రుమేనియాల ఎంబస్సీ అధికారులు రుమేనియాలోని బుకారెస్ట్‌ ప్రాంతానికి తరలించారు. అక్కడే నాలుగు రోజుల పాటు ఉన్నాం. ఈ నెల 2న బుకారెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కి, 3న ఢిల్లీకి చేరుకున్నాం. అదే రోజు రాత్రికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు, ఆ తర్వాత అర్ధరాత్రి జడ్చర్లలోని ఇంటికి చేరుకున్నా.

- యోజిత, జడ్చర్ల


బంకర్లలో దాక్కున్నాం

యుద్ధంతో భయాందోనకు గురయ్యా. నేను కీవ్‌ యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నా. మా హాస్టల్‌కు 200 మీటర్ల దూరంలో బాంబ్‌ బ్లాస్ట్‌లు జరిగాయి. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటూ బంకర్లలో వారం రోజుల పాట ఉన్నాం. ఆ తర్వాత ఇండియన్‌ ఎంబసీ చొరవతో పోలాండ్‌ నుంచి సురక్షితంగా ఇంటికి చేరుకున్నా.

- అభిషేక్‌, నారాయణపేట


10 కిలో మీటర్లు నడిచాం

నేను ఉక్రెయిన్‌ దేశం చెర్నవిసిటీలోని బుకోవియన్‌ స్టేట్‌ మెడికల్‌ యూనివర్సిటీలో వైద్య విద్యను చదువుతున్నా. ఉక్రెయిన్‌ రాజధానికి 600 కిలో మీటర్ల దూరంలో ఉంటాను. యుద్ధంతో తిరిగొచ్చేందుకు ఎయిర్‌పోర్టు వరకు ప్రయాణించాం. మేం ఎయిర్‌ పోర్టుకు రావడానికి గంట ముందే రష్యా సైనికులు దానిని స్వాధీనం చేసుకున్నారు. దాంతో అక్కడి నుంచి తిరిగి యూనివర్సిటీకి వెళ్లాం. నాలుగు రోజుల పాటు బంకర్లలో భయం భయంగా గడిపాం. తినడానికి తిండిలేక, తాగడానికి నీళ్లు లేక నరకయాతన అనుభవించాం. ఇండియా విమానాలను ఏర్పాటు చేయడంతో యూనివర్సిటీ నుంచి రుమేనియా దేశ సరిహద్దుకు చేరుకున్నాం. సరిహద్దు దగ్గర దాదాపు 10 కిలో మీటర్లు నడిచి వెళ్లాక ఇండియన్‌ ఎంబసీ వాళ్లు మాకు విడిది ఏర్పాటు చేశారు. తినడానికి బ్రెడ్‌, జామ్‌ వంటివి ఇచ్చారు. అప్పటి వరకు మాకు భయం పోలేదు.

 - రాహుల్‌, గట్టు, జోగుళాంబ గద్వాల జిల్లా


చాలా మంది సరిహద్దుల్లోనే ఉన్నారు

 నేను ఉక్రెయిన్‌లోని జఫ్రోజియాలో ఎంబీబీఎస్‌ ఐదో సంవత్సరం చదువుతున్నా. కీవ్‌ నగరానికి దూరంగా ఉండ టంతో అక్కడ యుద్ధ ప్రభావం అంతగా లేదు. జఫ్రోజియాలో సుమారు భార తీయ విద్యార్థులం రెండు రైళ్లలో ఫిబ్రవరి 28న హంగేరి సరిహద్దుకు బయల్దేరాం. అక్కడి నుంచి బుడాపెస్ట్‌ చేరుకున్నాం. నాకు ఫ్లైట్‌ టికెట్‌ త్వరగా దొరికింది. ఇంకా చాలా మంది సరిహద్దుల్లోనే ఉండి పోయారు.

- కొండ అభిలాష్‌రెడ్డి మనిగిళ్ల, వనపర్తి


మూడు రోజులు రుమేనియా శిబిరంలో

నేను ఉక్రెయిన్‌ దేశంలోని విని స్టా నేషనల్‌ మెడికల్‌ యూని వర్సిటీలో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్నా. యు ద్ధం మొదలైన రోజు నుంచి యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు. 520 కిలో మీటర్లు బస్సులో ప్రయాణించి, రుమేనియా సరిహద్దుకు చేరుకున్నా. అక్కడ రోజులు ఉన్నా. తర్వాత విమానంలో వచ్చాను.

- వెంకటసాయి రాంరెడ్డి, నాగర్‌కర్నూల్‌

Updated Date - 2022-03-06T05:11:46+05:30 IST