భూసేకరణకు వెళ్లిన అధికారులను అడ్డుకున్న రైతులు

ABN , First Publish Date - 2022-04-05T05:32:39+05:30 IST

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పునరావాసం కోసం స్థల సేకరణకు వెళ్లిన అధికారులకు రైతుల నుంచి ప్రతిఘటన ఎదురైంది.

భూసేకరణకు వెళ్లిన అధికారులను అడ్డుకున్న రైతులు
రైతులను లాక్కెళుతున్న పోలీసులు

- తక్కువ ధరకు తమ భూములను ఇవ్వబోమంటూ రైతుల ఆందోళన

- రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు


కొల్లాపూర్‌, ఏప్రిల్‌ 4: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోయిన బాధితులకు పునరావాసం కోసం స్థల సేకరణకు వెళ్లిన అధికారులకు రైతుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం పరిధిలోని ఎల్లూరు సమీపంలో పాలమూరు రంగారెడ్డి టన్నెల్‌ పక్కన 33ఎకరాల భూమిని భూసేకరణకై వెళ్లిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. దీంతో అధికారులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పొలాలను చదును చేయడానికి వచ్చిన జేసీబీ, డ్రోజర్లను అడ్డుకొని రైతులు ఆందోళనకు దిగారు. తమ తాత ముత్తాతల కాలం నుంచి భూములనే నమ్ముకొని బతుకుతున్నామని, ప్రభుత్వం పునరావాసం పేరుతో ఎకరాకు లక్షా 70వేల రివార్డు ప్రకటించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములకు ఎకరాకు 20లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లిస్తేనే ప్రభుత్వానికి భూములు అప్పజెప్తామని గతంలో ఎంజీఎల్‌ఐ, మిషన్‌ భగీరథ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు తాము భూములిచ్చామని, ఉన్న భూములను కూడా లాక్కొంటే తమకు జీవనోపాధి ఎలా అని రైతులు అధికారులతో మొరపెట్టుకున్నారు. దీంతో పోలీసులు రైతులను బలవంతంగా అదుపులోకి తీసుకొని కొల్లాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో భూసేకరణ పనులను యథావిధిగా కొనసాగించారు.Read more