పన్నుల వసూలుపై కసరత్తు

ABN , First Publish Date - 2022-01-18T05:13:23+05:30 IST

పన్నుల వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు కసరత్తు మొదలు పెట్టారు.

పన్నుల వసూలుపై కసరత్తు
జిల్లా పంచాయతీ కార్యాలయం

- లక్ష్యం రూ.2.51 కోట్లు

- 10వ తేదీ వరకు రూ. 99 లక్షల వసూలు

- మిగిలింది 70 రోజుల సమయం

- వెనుకబడిన గద్వాల మండలం

గద్వాల, జనవరి 17 : పన్నుల వసూళ్లపై పంచాయతీ కార్యదర్శులు కసరత్తు మొదలు పెట్టారు. గత ఏడాది మాదిరిగానే 100 శాతం వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి సిద్ధం అయ్యారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో వసూళ్లు పుంజుకోగా మరికొన్ని మండలాలు వెనుకబడ్డాయి. అయితే మార్చి 31 నాటికి మిగిలింది 70 రోజులు మాత్రమే. ఇంటి పన్నుల వసూలుపై దృష్టి పెడితే తప్ప లక్ష్యం చేరే పరిస్థితి లేదు. జోగుళాంబ జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇంటి పన్నులు, ఇతర పన్నుల మొత్తం రూ. 2.51 కోట్ల వసూలు లక్ష్యం కాగా, జనవరి 10 నాటికి రూ.99 లక్షలను మాత్రమే వసూలు చేశారు. దాదాపు 40.21 శాతం వసూళ్లు పూర్తయ్యింది. ఇప్పుడిప్పుడే పంట డబ్బులు, రైతు బంధు రైతుల చేతికి అందుతున్నది. పంచాయతీ కార్యదర్శులు దృష్టి పెడితే వంద శాతం లక్ష్యం నెరవేరే అవకాశముంది.


గద్వాల మండలంలో 19 శాతం

పన్నుల వసూళ్లలో గద్వాల మండలం పూర్తిగా వెనకబడినది. రూ.21 లక్షలకు గాను నాలుగు లక్షల రూపా యలు మాత్రమే వసూలయ్యాయి. జిల్లాలో సగటు వసూళ్ల శాతం 38 శాతం ఉండగా, గద్వాలలో 19 శాతం మాత్రమే ఉంది. అదే విధంగా అయిజలో 23 శాతం, ఉండెల్లిలో 28 శాతం, గట్టు మండలంలో 31 శాతం వసూళ్లు పూర్తయ్యాయి. ఈ మండలాలు జిల్లా సగటు కంటే తక్కువగా వసూల య్యాయి. గద్వాలలో ఎంపీడీవో, ఎంపీవోలు ఇతర మండలా లకు డిప్యూటేషన్‌లో ఉండడం కూడా అందుకు కారణమని తెలుస్తోంది. జిల్లా పంచాయితీ అధికారి కూడా ఈ మండలాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


26 మంది కార్యదర్శుల బదిలీ

ఇటీవల జిల్లా నుంచి 26 మంది కార్యదర్శులు ఇతర జిల్లాలకు బదిలీ అయ్యారు. వారి స్థానంలో ఎవరూ చేరలేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఔట్‌సోర్సింగ్‌ కార్యదర్శులను తీసుకో వాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఆయా గ్రామాలకు ఇతర పంచాయతీ కార్యదర్శులను ఇన్‌చార్జీలుగా నియమించాల్సి ఉంటుంది. ఆయా గ్రామాల్లో పన్నుల వసూళ్లపై ప్రభావం పడనునున్నది. ఇన్‌చార్జీలు రెండు గ్రామాల్లో పన్నులను వసూలు చేసేందుకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. 


100 శాతం పన్నులు వసూలు చేస్తాం 

శ్యామ్‌సుందర్‌ జిల్లా పంచాయతీ అధికారి : గత ఏడాది కరోనా సమయంలోనే 100 శాతం వసూళ్లు చేశాం. ఈ ఏడాది కూడ లక్ష్యం మేరకు వసూళ్లు పూర్తి చేస్తాం. ఇప్పటికే ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహిం చాం. ప్రతీ రోజు లక్ష్యాన్ని నిర్దేశించి పన్నులు వసూలు చేయిస్తున్నాం.


Updated Date - 2022-01-18T05:13:23+05:30 IST