ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దు

ABN , First Publish Date - 2022-09-27T05:18:38+05:30 IST

ప్రజల నుంచి ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు.

ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దు
దివ్యాంగురాలు ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

- ‘ప్రజావాణి’లో కలెక్టర్‌ వల్లూరు క్రాంతి

గద్వాల క్రైం, సెప్టెంబరు 26 : ప్రజల నుంచి ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి అన్నారు. కలెక్టరేట్‌ సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 72 ఫిర్యాదులు వచ్చాయి. అందులో ధరణికి సంబంధించివే అధికంగా ఉన్నాయి. మరికొన్ని ఆసరా పెన్షన్ల మంజూరుకు సంబంధించినవి ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సర్వే నెంబర్లను పరిశీలించి నివేదికను పంపించాలని సంబంధిత తహసీల్దార్లకు సూచించారు. గద్వాలకు చెందిన జయలక్ష్మి అనే దివ్యాంగురాలు తనకు ఇల్లు లేదని, పెన్సన్‌ రాలేదని ఫిర్యాదు చేయగా, పరిశీలించి సంబంధిత అధికారికి ఇచ్చారు. సదరం సర్టిఫికెట్‌ ఎవరైనా వస్తే అదేరోజు జారీ చేయాలని సంబంధిత అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, ఏవో యాదగిరి, అధికారి రాజు పాల్గొన్నారు. 


నేటి నుంచి వారోత్సవాలు

గద్వాల క్రైం : అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నుంచి వారోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం కలెక్టర్‌ వల్లూరు క్రాంతి విడుదల చేశారు. మాతా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి అక్టోబరు ఒకటో తేదీ వరకు వారోత్సవాలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో సంక్షేమాధికారి ముషాహిదాబేగం, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం నాయకులు మోహన్‌రావు, చక్రధర్‌, కృష్ణారెడ్డి, కలెక్టరేట్‌ ఏవో యాదగిరి, సూపరింటెండెంట్‌ రాజు తదితరులు పాల్గొన్నారు.

Read more