అవినీతి గద్దలు

ABN , First Publish Date - 2022-12-15T22:58:54+05:30 IST

అలంపూర్‌ చౌరస్తాలో కబ్జాగద్దలు పడ్డాయి. కనిపించిన భూమిని కబ్జా చేసేందుకు పక్కా వ్యూహలు రచించి గద్దలవలే భూములను తన్నుకుపోతున్నారు.

  అవినీతి గద్దలు
అలంపూర్‌కు వెళ్లే మార్గంలో సీలింగ్‌ ల్యాండ్‌లో నిర్మించిన షెడ్డు

- అలంపూర్‌ చౌరస్తాలో సీలింగ్‌ ల్యాండు కబ్జాకు వ్యూహం

- యంత్రాంగాన్ని ఏమార్చి.. కూల్చిన చోటే నిర్మాణాలు

- చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

అలంపూర్‌ చౌరస్తా, డిసెంబరు 15 : అలంపూర్‌ చౌరస్తాలో కబ్జాగద్దలు పడ్డాయి. కనిపించిన భూమిని కబ్జా చేసేందుకు పక్కా వ్యూహలు రచించి గద్దలవలే భూములను తన్నుకుపోతున్నారు. అలంపూర్‌ చౌరస్తా జిల్లాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడ వంద పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే గురుకుల పాఠశాలతో పాటు పలు ప్రైవేట్‌ విద్యా సంస్థలు, రైల్వే స్టేషన్‌ ఉండటం, మరిన్ని ప్రభుత్వ కార్యాలయాలు రానుండటంతో ఇక్కడ భూముల ధరలకు రెక్కాలొచ్చాయి. ఇక్కడ ఏపీతో పాటు వివిధ ప్రాంతాల వాసులు ఇక్కడ స్థలాలు కొనాలని ఆసక్తి చూపుతుంటారు. ఇలాంటి విలువైన ప్రాంతంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. సంరక్షించాల్సిన అధికార యంత్రాంగం ఉదాసీనంగా ఉండటంతో స్థానికంగా ఉండే కొందరు నాయకుల సహకారంతో ఖాళీ స్థలాలను, సీలింగ్‌ భూములను, భూదాన్‌ భూములను కబ్జా చేస్తున్నారు.

సుమారు 40 ఏళ్ల క్రితం అలంపూర్‌ వైపు వెళ్లే ప్రధాన మార్గానికి ఇరువైపుల ఉండే సర్వే నెం 250/సీ లో వ్యవసాయ ఆవసరాల నిమిత్తం కొంతమంది లబ్ధ్దిదారులకు అప్పటి ప్రభుత్వం సీలింగ్‌ చేస్తూ జారీ చేసింది. 2017లో అలంపూర్‌ చౌరస్తాలో ఉండే కొందరు రియల్టర్లు, ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరులు కొందరు అధికార పార్టీ నాయకులు కలిసి, ఒకరిద్దరు విలేఖర్లను ముందుంచి ఐదు ఎకరాల సీలింగ్‌ ల్యాండ్‌ను ప్లాట్లుగా మార్చి కబ్జాకు తెరలేపారు. ఈ తంతాంగాన్ని అప్పట్లోనే ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకురావడంతో అప్పటి కలెక్టర్‌ రజత్‌కుమార్‌ షైని చర్యలు తీసుకుని, కట్టాడాలను కూల్చివేసి ఆ భూమిని ప్రభుత్వ పరం చేశారు.

ఆ కలెక్టర్‌ బదిలీ అయిన వెంటనే మళ్లీ పొజిషన్‌లోకి వచ్చేందుకు ప్రయత్నాలు జరిపారు. సాధారణంగానే 2017నాటికి నేటికి భూమి ధరలు రెట్టింపు అయ్యాయి. దీంతో అలంపూర్‌ చౌరస్తాలో ప్రస్తుతం సెంటు అయిదు లక్షల నుంచి సుమారు కోటి రూపాయల వరకు పలుకుతోంది. పలుకుబడిగల వ్యాపారులు రెండ్రోజుల క్రితం పునాదులు వేసి మరి భారీ కట్టాడాలు చేపట్టి రెవెన్యూ అధికారులకే సవాల్‌ విసురుతున్నారు. అలంపూర్‌ వెళ్లే రోడ్డు వెంటే నిర్మాణాలు జరుగుతున్నా ఎవరు పట్టించుకోకపోవడం వెనక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అరోపణలు వినిపిస్తున్నాయి. క్రమేణా సీలింగ్‌ ల్యాండ్‌ అంతట రోడ్డుకిరువైపుల నిర్మాణాలు చేపట్టి కబ్జా చేసేందుకు వ్యుహాలు రచిస్తున్నారు.

Updated Date - 2022-12-15T22:58:56+05:30 IST