10 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి
ABN , First Publish Date - 2022-06-28T05:28:33+05:30 IST
ప్రైవేట్ హెల్త్‌కేర్ సెంటర్లు పది రోజుల లోపు కాలుష్య నియంత్రణ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు.

- కలెక్టర్ శ్రీహర్ష
గద్వాల క్రైం, జూన్ 27 : ప్రైవేట్ హెల్త్‌కేర్ సెంటర్లు పది రోజుల లోపు కాలుష్య నియంత్రణ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. లేకుంటే హెల్త్ కేర్ సెంటర్ల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసి, ఆసుపత్రిలను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ చాంబర్లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 187 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయని తెలిపారు. నర్సింగ్‌హోమ్‌లు, క్లీనిక్‌లు, డెంటల్ ఆసుపత్రిలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, లాబొరేటరీలు, ఫిజియోథెరపీ, స్కానింగ్ కేంద్రాల నుంచి వ్యర్ధ పదార్ధాలను తరలించే సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. జిల్లాలో 19 వెటర్నరీ ఆసుపత్రులు కూడా కాలుష్య నియంత్రణ బోర్డుతో పాటు, బయో వేస్టేజ్ బోర్డు పరిధిలోకి వచ్చేలా రిజి స్ర్టేషన్ చేయించుకోవాలని సూచించారు. జిల్లాలోని 187 ప్రవేట్ ఆసుపత్రులలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా 95 రిజిస్ర్టేషన్ చేయించుకున్నాయని, బయోమెడికల్ వేస్టేజీ బోర్డులో 195 రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని చెప్పారు. మిగితావి పది రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో చందూనాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సిద్ధప్ప, అడిషనల్ ఎస్పీ రాములు, సూపరిండెంటెండ్ కిశోర్‌కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి దయానంద పాల్గొన్నారు.
పాలీసెట్‌కు ఏర్పాట్లు పూర్తి చేయాలి
ఈ నెల 30న జరిగే పాలీసెట్ ప్రవేశ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ చాంబర్లో పాలిసెట్-2022పై సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఐదు పరీక్షా కేంద్రాల్లో 1,882 మంది అభ్యర్ధులు పరీక్షలు రాస్తున్నారని, కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. తాగునీరు. రవాణా తదితర వసతులు కల్పించాలన్నారు. సమావేశంలో పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ రామ్మోహన్, ఏఏస్పీ రాములు నాయక్, డీఈవో సిరాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దు
‘ప్రజావాణి’కి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమ వారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 35 ఫిర్యాదులు వచ్చాయి.
కుమార్తెను అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలి : బాధితురాలి ఫిర్యాదు
తన కుమార్తెను అమ్మిన శ్యాంసుందర్, సుధారాణి, వెంకటరమణమ్మపై చర్యలు తీసుకోవాలని మల్దకల్ మండలం అమరవాయికి చెందిన పావని అలియాస్ చిట్టెమ్మ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిట్టెమ్మకు గద్వాలకు చెందిన చంద్రశేఖర్‌తో 2008లో వివాహమైంది. ఆమె కు ముగ్గురు కుమార్తెలున్నారు. మూడవ పాప పుట్టిన వెంటనే అత్త, అడబిడ్డ, ఆమె భర్త పాపను విజ యవాడలోని తమ బంధువులకు ఇస్తామని వేధించారు. ఎంత వేడుకున్నా వినకుండా పాపను ఇచ్చేశారు. ఆ తర్వాత పాపను ఇతరులకు అమ్ముకున్నట్టు తెలిసిందని చిట్టెమ్మ ఆరోపించారు. తన భర్త మరణించాడని, తన బిడ్డను కాపాడి, తనకు న్యాయం చేయాలని ఆమె కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.