ప్రతీ పథకంలో కేంద్రం వాటా

ABN , First Publish Date - 2022-09-14T04:28:02+05:30 IST

తెలంగాణలో అమలవుతున్న ప్రతీ సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు.

ప్రతీ పథకంలో కేంద్రం వాటా
ఎక్లాస్‌పూర్‌లో జెండా ఊపి బైక్‌ ర్యాలీని ప్రారంభిస్తున్న మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి

- సొమ్ము కేంద్రానిది.. సోకు టీఆర్‌ఎస్‌ది 

- ప్రజలకు వివరించేందుకే బీజేపీ భరోసా ర్యాలీ

- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి

నారాయణపేట రూరల్‌, సెప్టెంబరు 13 : తెలంగాణలో అమలవుతున్న ప్రతీ సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట మండలంలోని ఎక్లాస్‌పూర్‌ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రజాగోస, బీజేపీ భరోసా బైక్‌ ర్యాలీని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. కేంద్రం వాటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదన్నారు. పేదలకు ఇళ్లు, రోడ్లు, బియ్యం, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రుణాలు, ఉపాధి హామీ, హరితహారం ఇలా అన్నీ పథకాల్లో కేంద్రం డబ్బులు ఉన్నాయన్నారు. కానీ వాటిపై కేసీఆర్‌ బొమ్మపెట్టుకుని సొమ్ము ఒకరిది సోకు ఒకరిదిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. వాస్తవాలను ప్రజలకు వివరించేందుకే బీజేపీ భరోసా యాత్ర చేపట్టిందన్నారు. కుటుంబ పాలనతో అవినీతిలో కూరుకుపోయిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూకటి వేళ్ళతో పెకళించి డబుల్‌ ఇంజన్‌ బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురావాలన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌, కె.శ్రీనివాస్‌, విజయ్‌కుమార్‌, గోవర్ధన్‌గౌడ్‌, సత్యయాదవ్‌, ప్రభాకర్‌వర్ధన్‌, సిద్ధి వెంకట్రాములు, రఘువీర్‌యాదవ్‌, మండలాధ్యక్షుడు సాయిబన్న, ఎల్‌.అశోక్‌, శ్రీనివాస్‌, రఘురామయ్యగౌడ్‌, రాము, కౌన్సిలర్‌లు, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-14T04:28:02+05:30 IST