బీపీ పెరుగుతోంది..

ABN , First Publish Date - 2022-05-23T05:07:30+05:30 IST

మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల్లు, తగ్గిన శారీరక శ్రమ కారణంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది.

బీపీ పెరుగుతోంది..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 29,691 మంది రక్తపోటు బాధితులు

షుగర్‌ బాధితులు 17,259 మంది  

పట్టణ ప్రాంతాల్లో అధికంగా నమోదు

శారీరక శ్రమ లేకపోవడం, రసాయనాలు కలిగిన ఆహార పదార్థాలు తినడమే కారణం

ఎన్‌సీడీ సర్వేలో గుర్తింపు 

బాధితులకు ఎన్‌సీడీ క్లీనిక్‌ల ద్వారా వైద్య సేవలు


మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్ల్లు, తగ్గిన శారీరక శ్రమ కారణంగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో బీపీ, షుగర్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం చేపడుతున్న ఎన్‌సీడీ(నాన్‌ కమ్యూనికబుల్‌ డిసీజెస్‌) అసంక్రమిక వ్యాధుల సర్వేలో జిల్లాలో బీపీ(రక్తపోటు) బాధితులు 29,691 మంది ఉన్నట్లు తేలింది. ప్రధానంగా పట్టణాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలు గతంలోనివి కాగా, ఈ ఏడాది జనవరి నుంచి చేపట్టిన సర్వే ఇంకా కొనసాగుతోంది. అది పూర్తయ్యే నాటికి వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

- మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం)


ప్రస్తుత సమాజంలో మనిషి యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డాడు. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పు, శారీరక, మానసిక ఒత్తిడుల కారణంగా అనేక రకాల రోగాల బారిన పడుతున్నారు. కొన్ని రోగాలు సర్జరీలతో నయం అవుతుండగా, మరికొన్ని రోగాలు దీర్ఘకాలంగా ఉంటాయి. అలాంటి దీర్ఘకాలిక రోగాల్లో బీపీ, షుగర్‌లను ప్రధానంగా చెప్పొచ్చు. ఇవి వచ్చాయంటే మనిషి చచ్చే వరకు వదిలివెళ్లవు. అందుకే ఈ దీర్ఘకాలిక వ్యాధులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా ఎన్‌సీడీ(నాన్‌ కమ్యూని కబుల్‌ డిసీజేస్‌) అసంక్రమిత వ్యాధుల సర్వే నిర్వహిస్తోంది. ఈ సర్వేలో జిల్లాలో బీపీ, షుగర్‌ బాధితులను గుర్తించి, వారికి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది.


జిల్లాలో 29,691 మందికి బీపీ..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో బీపీ(రక్తపోటు) బాధితులు 29,691 మంది ఉన్నారు. గత ఏడాది ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు అసంక్రమిక వ్యాధులపై చేసిన సర్వేలో ఈ విషయం తెలిసింది. దీంతో పాటు షుగర్‌ వ్యాధిగ్రస్తులు కూడా 17,259 మంది ఉన్నట్లు నిర్ధారించారు. వీరంతా ప్రస్తుతం మందులు వాడుతున్నారు. ఈ లెక్కల ప్రకారం జిల్లాలోని 25 పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీ, సీహెచ్‌సీలలకు గాను మహబూబ్‌నగర్‌, జడ్చర్ల పట్టణాల్లో బీపీ, షుగర్‌ బాధితులు అత్యధికంగా ఉన్నారు. ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి, పట్టణంలోని ఐదు యూపీహెచ్‌సీల పరిధిలో గల గ్రామీణ ప్రాంతాలను మినహాయిస్తే 5,400 మంది బాధితులు ఉండగా, జడ్చర్ల పట్టణంలో 2,234 మంది ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఆహార నియమాలు పాటించకపోవడం, రసాయనాలు కలిగిన పదార్థాల వాడకం, శారీరక శ్రమ లేకపోవడం వలన పట్టణవాసులు అధికంగా బీపీ, షుగర్‌ బారిన పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమను కలిగి ఉండడం, రసాయనాలు లేని ఆహార పదార్థాల వాడకం వలన బీపీ, షుగర్‌ వ్యాధులు తక్కువ శాతం ఉన్నాయి.


కొత్తగా 5,924 బీపీ కేసుల గుర్తింపు..

జిల్లాలో ప్రస్తుతం 4,29,629 మంది జనాభా ఉన్నారు. ఈ జనాభా ప్రాతిపదికన 2022 జనవరి నుంచి అసంక్రమిక వ్యాధుల సర్వే కొనసాగుతోంది. ఈ లెక్కన 30 ఏళ్లు పైబడిన 1,19,145 మందికి పరీక్షలు చేయగా, బీపీ బాధితులు 5,924 మంది, షుగర్‌ బాధితులు 3,493 మందిని కొత్తగా గుర్తించారు. సర్వే ఇప్పటి వరకు 60 శాతం మాత్రమే పూర్తయ్యింది. సర్వే పూర్తయిన తర్వాత కొత్తగా బీపీ, షుగర్‌ బాధితులు ఎంతమంది ఉన్నారనే విషయం కచ్చితంగా తెలియనుంది.


ఎన్‌సీడీ క్లీనిక్‌ల ద్వారా వైద్య సేవలు..

అసంక్రమిక వ్యాధులకు(బీపీ, షుగర్‌) జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రులలో ఎన్‌సీడీ క్లినిక్‌లను ఏర్పాటు చేశారు. పీహెచ్‌సీలో ఒక స్టాఫు నర్సు, సీహెచ్‌సీలలో ఇద్దరు స్టాఫు నర్సులు, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో నలుగురు స్టాఫు నర్సులను నియమించారు. ఇదివరకు గుర్తించిన ప్రకారం 29,691 మందికి ఎన్‌సీడీ క్లినిక్‌ల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. బీపీ, షుగర్‌ బాధితుల వ్యాధి తీవ్రతను బట్టి మూడు రకాల మందులను అందజేస్తున్నారు.


నెల రోజుల్లో సర్వే పూర్తి

ఎన్‌సీడీ సర్వేను ఈ నెల రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు గుర్తించిన బీపీ, షుగర్‌ రోగులకు ప్రత్యేకంగా కిట్ల రూపంలో మందులను పంపిణీ చేయనున్నాం. ఈ కిట్లు ప్రభుత్వం నుంచి ఈ నెలాఖరు వరకు రానున్నాయి. నెలకు సరిపోయే మందులు ఈ కిట్‌లో ఉంటాయి. మందులు ఎలా వాడాలి?, ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎక్స్‌ర్‌సైజులు ఎలా చేయాలో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారు. 

- డా. సంధ్య కిరణ్మయి, ఎన్‌సీడీ ప్రోగ్రాం ఆఫీసర్‌.

Updated Date - 2022-05-23T05:07:30+05:30 IST