క్వార్ట్‌ ్జ గనులపై ఆగ్రహం

ABN , First Publish Date - 2022-02-08T04:48:21+05:30 IST

క్వార్ట్‌ ్జ గనులపై పాలమూరులో మరోసారి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. షాద్‌నగర్‌ ప్రాంతంలో గతంలో ఈ గనులలో పనిచేసి, అనారోగ్యాల బారిన పడిన, ప్రధానంగా సిల్కోసిస్‌ వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయున కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

క్వార్ట్‌  ్జ గనులపై ఆగ్రహం
ధన్వాడ మండలం గున్ముక్లలో మైనింగ్‌ చేసేందుకు గుర్తించిన గుట్ట ఇదే..

గున్ముక్లలో అనుమతివ్వవద్దనే డిమాండ్‌

తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న మూడు పంచాయతీల ప్రజలు

షాద్‌నగర్‌ ప్రాంతంలో క్వార్ట్‌  ్జ గనులు మిగిల్చిన విషాదాన్ని తల్చుకొని ఆందోళన

అలాంటి పరిస్థితి రానీయొద్దని వేడుకోలు

సిల్కోసిస్‌ వ్యాధితో అతలాకుతలమైన మహల్‌ ఎలికట్ట


మహబూబ్‌నగర్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): క్వార్ట్‌ ్జ గనులపై పాలమూరులో మరోసారి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. షాద్‌నగర్‌ ప్రాంతంలో గతంలో ఈ గనులలో పనిచేసి,  అనారోగ్యాల బారిన పడిన, ప్రధానంగా సిల్కోసిస్‌ వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయున కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ ఘటనలు మరుకవముందే తాజాగా నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముక్లలో దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో క్వార్ట్‌ ్జ గనుల ఏర్పాటుకు మైనింగ్‌శాఖ అనుమతులివ్వడంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. షాద్‌నగర్‌, బాలానగర్‌, కొందుర్గు మండలాల్లో గతంలో జరిగిన అనుభవాలు గుర్తుకు తెచ్చుకొని అలాంటి విషాద ఘట్టానికి గున్ముక్లను బలిచేయ వద్దని అంటున్నారు. మంగళవారం జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో ముక్తకంఠంతో గనుల తవ్వకాలకు అనుమతులు ఆపేయాలనే డిమాండ్‌ విస్తృతంగా వస్తోంది. 


గున్ముక్లలో నేడు ప్రజాభిప్రాయసేకరణ

నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముక్లలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్‌ 144లో 21.51 హెక్టార్లలో 20 ఏళ్లపాటు క్వార్ట్‌  ్జ మైనింగ్‌ నిర్వహించుకునేందుకు నిర్మలమూర్తి మినరల్స్‌ కంపెనీకి మైనింగ్‌ శాఖ అనుమతి ఇచ్చింది. దానిపై పర్యావరణ శాఖ మంగళవారం మైనింగ్‌ నిర్వహించే ప్రదేశం వద్ద ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించనుంది. ఈ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల పరిధిలోని గున్ముక్ల, యమునపల్లి, కౌసాన్‌పల్లి, మంత్రోనిపల్లి, గుడిగండ్ల, మందిపల్లి గ్రామాల ప్రజలు ఈ ప్రజాభిప్రాయసేకరణలో పాల్గొనాల్సి ఉంది. అయుతే ఇక్కడ మైనింగ్‌కు అనుమతి ఇవ్వొవద్దంటూ మూడు గ్రామ పంచాయతీలు ఇప్పటికే తీర్మానాలు చేశాయి. అనుమతులు రద్దు చేయాలని కోరుతు జనవరిలో ధన్వాడ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడంతో పాటు, వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా నారాయణపేట కలెక్టర్‌ కార్యాలయంలో కూడా వినతి పత్రం సమర్పించారు. ఇక్కడ క్వార్ట్‌  ్జ మైనింగ్‌ చేపడితే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందుని, ఈ గుట్ట ఆధారంగానే జాతీయ పక్షులు నెమళ్లు కూడా ఇక్కడ సంచరిస్తున్నాయని వాటి ఉనికి లేకుండా పోతుందని అంటున్నారు. అదేవిధంగా పరిసరాల్లోని ఐదు గ్రామాల పశువులకు, ఇతర పక్షి జాతులకు ఈ చిట్టడవే ఆధారమని, దీన్ని ధ్వంసం చేస్తే జీవన విధ్వంసానికి దారితీస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఈగుట్ట నుంచి వర్షాకాలంలో వాన నీరు దిగువకు వచ్చి చెరువుల్లోకి, కందకాల్లోకి చేరుతుందని, దీంతో పరిసర గ్రామాల్లో భూగర్భజలాలకు ఆదెరవుగా ఉందని, మైనింగ్‌ మొదలయితే ఈ వ్యవస్థ లేకుండా పోతుందని భావిస్తున్నారు. అన్నింటికీ మించి క్వార్ట్‌  ్జ తవ్వకాలు చేపడితే వచ్చే కాలుష్యంతో ఆ గ్రామాల్లో శ్వాసకోస సమస్యలు, ప్రధా నంగా ప్రమాదకరమైన సిల్కో సిస్‌ వ్యాధి సోకుతుందనే స్థాని కుల్లో ఆందోళన వ్యక్తమవు తోంది. గతంలో షాద్‌నగర్‌ ప్రాంతంలోని మహల్‌ ఎలికట్టె, రంగంపల్లి, ఎలికట్టె, హాజీపూర్‌, దొంతికుంట తండా, కిషన్‌నగర్‌, పీర్లగూడం తదితర గ్రామాలకు చెందిన సుమారు 400 మంది సిల్కోసిస్‌ వ్యాధితో చనిపోతే ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయ ని, ఇప్పటికీ కోలుకోలేక పోయా యని, అలాంటి పరిస్థితి గున్ముక్లలో రావద్దనే ఉద్దేశంతోనే ఈ మైనింగ్‌ వద్దని స్థానికులు అంటున్నారు. 


రోడ్డున పడ్డ సిల్కోసిస్‌ వ్యాధి బాధిత కుటుంబాలు

 షాద్‌నగర్‌ ప్రాంతంలోని మహల్‌ ఎలికట్ట వద్ద 1970 ప్రాంతంలో పలుగురాళ్లను చూర్ణం చేసే క్వారీతో పాటు కార్ఖానాను నిర్వహించారు. ఈ గనిలో, కార్ఖానాలోనూ మహల్‌ ఎలికట్టె,  రంగంపల్లి, ఎలికట్టె, హాజీపూర్‌, దొంతికుంట తండా, కిషన్‌నగర్‌, పీర్లగూడం గ్రామాలకు చెందినవారు కూలీలుగా పనిచేసేవారు. అప్పట్లో ఎలాంటి కాలుష్య నివారణ చర్యలు చేపట్టకపోవడంతో అక్కడి దుమ్ము, ధూళి పీల్చడం ద్వారా సిల్కోసిస్‌ వ్యాధి బారిన పడ్డారు. ఒక్క మహల్‌ ఎలికట్టె గ్రామంలోనే దాదాపు 200 మంది ఈ వ్యాధిబారిన పడి చనిపోగా, మిగిలిన గ్రామాలకు చెందిన వారూ దాదాపు ఇంతే సంఖ్యలో ఈ వ్యాధితో చనిపోయారని చెబుతున్నారు. చాలామంది వృద్ధాప్యంలోనూ వ్యాధితో పోరాడుతూ చికిత్స చేయించుకోలేక చనిపోయారని అంటున్నారు. అప్పట్లో మైనింగ్‌ నిర్వహించిన కంపెనీపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తే బిచాణా ఎత్తేసినా, తర్వాత కోర్టుల తీర్పులతో కొందరికి పరిహారం దక్కగా వందలాది మంది ఎలాంటి పరిహారం కోసం ఇప్పటికీ ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ గ్రామంలో క్వార్ట్‌ ్జ పరిశ్రమ ద్వారా అధిక సంఖ్యలో భర్తలు చనిపోగా, భార్యలు, పిల్లలే మిగిలారు. ఈ అంశాలపై స్వచ్ఛంద సంస్థలు, సామాజికవేత్తలు వారి తరఫున పోరాడిన పరిస్థితులు ఉన్నాయి. మహల్‌ ఎలికట్టె గ్రామాన్ని సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించినప్పుడు ఆ గ్రామంలో పరిశ్రమ మిగిల్చిన విషాదాన్ని తల్చుకొని పలువురు వృద్ధులు కంటతడి పెట్టారు. చారాణ వేతనం కోసం వెళితే జీవితాలే లేకుండా పోయాయని వాపోయారు. ఆ గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో ఈ సిల్కోసిస్‌ బాధితులున్నారు. 


అనాథలా బతికా..

ఫ ప్రస్తుతం గ్రామంలో కరెంటు హెల్పర్‌గా పని చేస్తున్న యాదయ్య తన చిన్నవయసులో తల్లిదండ్రులు ఎల్లయ్య, పోషమ్మ సిల్కోసిస్‌తో బాధపడ్డారని చెప్పారు. అనంతగిరి ఆస్పత్రికి బంధువులు తీసుకెళ్లారని, అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోతే, తాను అనాథలా బతికానని వాపోయారు.


భర్త చనిపోయాడు

ఫ ప్రస్తుతం వృద్ధాప్యంతో బతుకుబండి నడిపిస్తోన్న కుక్కల సత్యమ్మ బోరున విలపించింది. బక్కెట్‌ రాళ్లపిండి కొడితే చారాణా ఇచ్చేవారని, ఆ పనికోసం వెళ్లి, తాము గుట్టల బీమారి(సిల్కోసిస్‌) బారిన పడ్డామని, తన భర్త పోషయ్యను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లినా దక్కలేదని తెలిపింది. 20 ఏళ్లకింద చనిపోయాడని, అప్పటి నుంచి తాను దమ్ము రోగంతో జీవచ్చవంలా బతుకుతున్నానని భావోద్వేగానికి లోనైంది.


ఇప్పటికీ న్యాయం జరుగలే..

ఫ మరో వృద్ధురాలు అల్లాడ చంద్రమ్మ మాట్లాడుతూ 20 ఏళ్ల కిందట ఈ గుట్టల బీమారే తన భర్త నారాయణని బలిగొందని, ఒంటిరెక్కతో నలుగురు పిల్లల్ని పెంచి పోషించానని వాపోయారు. కోర్టులో కేసు గెలిచామని, పరిహారం వస్తుందని చెబుతున్నారే తప్ప ఇప్పటికీ తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  


ప్రజల జీవనానికి ఆటంకం 

 ఇక్కడ మైనింగ్‌ చేయడం వల్ల ప్రజాజీవనానికి ఆటంకం కలుగుతుంది. ప్రజలకు కలిగే ఎలాంటి ఇబ్బందినైనా సహించేదిలేదు. 20 ఏళ్లపాటు గుట్టని తవ్వేందుకు అనుమతిస్తే మా గ్రామ ఉనికే లేకుండా పోతుంది. ఈ ఈవిషయమై ప్రజల పక్షాన పోరాడుతాం. 

 - సుధీర్‌కుమార్‌, ఎంపీటీసీ సభ్యుడు, గున్ముక్ల 

అడ్డుకుంటాం 

గున్ముక్ల గ్రామంలోని సర్వేనెంబర్‌ 144లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న క్వార్జ్ట్‌ క్వారీని అడ్డుకుంటాం. ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం అనుమతు లివ్వడం సరికాదు. దీన్ని అడ్డుకు నేందుకు ఎంతవరకైనా ఉద్యమిస్తాం. ప్రజాభిప్రాయసేకరణలోనూ మా డిమాండ్‌ తెలియజేస్తాం.

- ప్రవీణ్‌రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు

మైనింగ్‌తో జీవనహననం జరుగుతుంది

గున్ముక్లలో క్వార్ట్‌ ్జ మైనింగ్‌కి అనుమతులు ఇవ్వొద్దు. ప్రజాభిప్రాయసేకరణ ఉపసంహరిం చుకోవాలి. మైనింగ్‌తో జీవనహననమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. గున్ముక్లలో ప్రతిపాదిస్తున్న క్వారీ ప్రాంతంలో జాతీయపక్షి నెమళ్లు ఉంటాయి. వాటితో పాటు ఇతర పశుపక్ష్యాదులకు, వర్షం వస్తే దిగువన ఉన్న పొలాలకు ఉపయోగపడే నీటి వనరులక కల్పనకు ఈ గుట్ట ఆలవాలం. అలాంటి చోట మైనింగ్‌ అనుమతించవద్దు.  విదేశాలకు ఎగుమతులు చేసేందుకు ఇక్కడి ప్రకృతి సహజ ఖనిజ వనరులు ధ్వంసం చేయడం తగదు. షాద్‌నగర్‌, బాలానగర్‌, కొందుర్గు మండలాల్లో ఇలాంటి మైనింగ్‌ 300 పైచిలుకు మంది చనిపోతే ఇప్పటికీ ఆకుటుంబాలకు దిక్కులేని పరిస్థితే ఉంది. గున్ముక్లలో మైనింగ్‌ ప్రయత్నాలను అడ్డుకునేందుకు అందరూ సిద్ధం కావాలి. 

- రాఘవాచారి, పాలమూరు అధ్యయనవేదిక కన్వీనర్‌















Updated Date - 2022-02-08T04:48:21+05:30 IST