పాలమూరుకు రూ.100 కోట్లు

ABN , First Publish Date - 2022-10-08T04:37:17+05:30 IST

పాల మూరు పురపాలిక అభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవో నంబర్‌ 689ను విడుదల చేశారు. పాలమూరులో దెబ్బతిన్న రహదారులు, డ్రైనేజీల మరమ్మతుల కోసం ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు జీఓలో పేర్కొన్నారు.

పాలమూరుకు రూ.100 కోట్లు
పాల మూరు పురపాలిక

జీవో 689 విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

పురపాలికలో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీల మరమ్మతు కోసం

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్‌


మహబూబ్‌నగర్‌, అక్టోబరు 7: పాల మూరు పురపాలిక అభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవో నంబర్‌ 689ను విడుదల చేశారు. పాలమూరులో దెబ్బతిన్న రహదారులు, డ్రైనేజీల మరమ్మతుల కోసం ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు జీఓలో పేర్కొన్నారు. పురపాలికకు ఒకేసారి రూ.100 కోట్లు విడుదల చేయడం ఇదే మొదటిసారి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మహబూబ్‌నగర్‌ పట్టణంలోని పలు రహదారులు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు పాడయ్యాయి. జరిగిన నష్టంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఇదివరకే సీఎంకు నివేదించారు. దీనిపై స్పందించిన కేసీఆర్‌ దెబ్బతిన్న 326 పనుల పునరుద్ధరణ కోసం ఈ నిధులను విడుదల చేశారు. ప్రస్తుతం డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. డ్రైనేజీలు విస్తరించాలని, కల్వర్టుల పనులు చేపట్టాలని చాలా రోజులుగా స్థానిక ప్రజాప్రతినిధులు విన్నవిస్తున్నారు. ఎట్టకేలకు భారీగా నిధులు మంజూరు చేయడంతో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలను పునరుద్ధరించనున్నారు. పాలమూరుకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కృతజ్ఞతలు తెలుపుతూ, సీఎం నాయకత్వంలో పాలమూరును ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని అన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే పనులు చేపట్టనున్నామని తెలిపారు. మునిసిపాలిటీకి నిధులు మంజూరు కావడంపై పురపాలిక కౌన్సిల్‌ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-10-08T04:37:17+05:30 IST