ఆశావహుల దారెటు

ABN , First Publish Date - 2022-11-20T22:48:11+05:30 IST

అధికారంలో ఉన్న పార్టీకి సాధారణ ఎన్నికల్లో కొంత వ్యతిరేకత ఉండటం సహజం. ఆ పార్టీ తాము వీక్‌గా ఉండటమో లేదా తమ ప్రతినిధిపై వ్యతిరేకత ఉండటం వంటి కారణాలతో నియోజకవర్గాల్లో సిట్గింగులకు కాకుండా వేరే వ్యక్తులకు సీట్లు కేటాయిస్తుంది.

ఆశావహుల దారెటు

సిట్టింగులకే సీట్లు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌

అలంపూర్‌, గద్వాలలో టీఆర్‌ఎస్‌ ఆశావహుల్లో ఆందోళన

ముఖ్య నాయకులతో లాబీయింగ్‌ ఫలిస్తుందా అనే చర్చ

కొద్ది రోజులపాటు వేచి చూసి.. జంపింగ్‌ కోసం ఆలోచనలు

వ్యతిరేకత ఉంటే కచ్చితంగా మార్పు ఉంటుందనే ధీమా..

గద్వాల/వనపర్తి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్న పార్టీకి సాధారణ ఎన్నికల్లో కొంత వ్యతిరేకత ఉండటం సహజం. ఆ పార్టీ తాము వీక్‌గా ఉండటమో లేదా తమ ప్రతినిధిపై వ్యతిరేకత ఉండటం వంటి కారణాలతో నియోజకవర్గాల్లో సిట్గింగులకు కాకుండా వేరే వ్యక్తులకు సీట్లు కేటాయిస్తుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇప్పటికే రెండుసార్లు భారీ మెజారిటీతో అధికారంలో కొనసాగుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం గత ఎన్నికల్లో సిట్టింగులకు సీట్లు ఇస్తామని ప్రకటించినట్లుగానే.. వచ్చే ఎన్నికల్లో కూడా సిట్గింగులకే సీట్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ఇటీవల జరిగిన పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో ప్రకటించారు. గత ఎన్నికల సమయంలో కూడా ఇలాగే ప్రకటించినప్పటికీ.. కొన్ని స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చి, గెలిపించుకుంది. అయితే గతంలో కంటే ఈసారి పార్టీ నుంచి పోటీ చేస్తామని భావిస్తున్న నాయకుల సంఖ్య అధికంగా ఉంది. ఇతర పార్టీల నుంచి వలసలు వచ్చినవారితో పాటు సొంత పార్టీలోనే ఏళ్లుగా టికెట్‌ను ఆశిస్తున్నవారు కూడా ఉన్నారు. ఇప్పటికే కొందరు ఆశావహులు పార్టీ కార్యక్రమాల్లో తరచూ పాల్గొనడం, సొంత కేడర్‌ను తయారు చేసుకోవడం వంటి పనుల్లో బిజీగా ఉండగా, తాజాగా సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో వారిలో కొంత కలవరం మొదలైంది. సిట్టింగులకే సీట్లు ఇస్తే.. తమ పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా వారిలో ఉత్పన్నమవుతున్నాయి. ముందస్తుగా సిట్టింగులకు టికెట్లు అని ప్రకటించడం ద్వారా కొంత ఆందోళనలో ఉన్న సిట్టింగులను కాపాడుకునే ప్రయత్నం చేసినట్లుగా కొందరు భావిస్తుండగా, స్థాన, ఆర్థిక, అంగబలం ఉన్న సిట్గింగులు అయితేనే వచ్చే ఎన్నికల్లో మూడోసారి విజయకేతం ఎగురవేయడం ఖాయమనే అభిప్రాయం పార్టీ పెద్దల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సీఎం కేసీఆర్‌ నిర్ణయం మాత్రం కొంతమందికి అసంతృప్తి మిగిల్చిందని చెప్పొచ్చు.

ఆశావహుల ఓవర్‌ లోడ్‌..

వనపర్తి, గద్వాల జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశావహులు అసలు లేరు. ఉదాహరణకు వనపర్తి నియోజకవర్గంలో ప్రస్తుతం వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇక్కడ పార్టీ నుంచి మరొకరు టికెట్‌ ఆశించే పరిస్థితి లేదు. అలాగే దేవరకద్ర నియోజకవర్గంలో కూడా ప్రస్తుత ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మినహా మరో వ్యక్తి టికెట్‌ ఆశించే అవకాశం లేదు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అశావహులు భారీగానే ఉన్నారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓటమి చెందగా, కాంగ్రెస్‌ నుంచి బీరం హర్షవర్ధన్‌రెడ్డి గెలుపొందారు. తర్వాత ఆయన కూడా టీఆర్‌ఎస్‌లో చేరడంతో ప్రస్తుతం ఇక్కడ ఇద్దరూ టికెట్‌ ఆశిస్తున్నవారు ఉన్నట్లు లెక్క. ఇప్పటికే మార్నింగ్‌ వాక్‌, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించుకుంటూ నియోజకవర్గంలో మళ్లీ గెలుపొందేందుకు జూపల్లి కృష్ణారావు దూకుడుగా ఉండగా, ఇటీవల జరిగిన ఎమ్మెల్యేలకు ఎర ఘటనలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డికి పార్టీ నుంచి బలం పెరిగింది. ఈ నేపథ్యంలో జూపల్లికి పార్టీ అవకాశం ఇస్తుందా? లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక గద్వాల నియోజకవర్గానికి సంబంధించి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా, సిట్టింగు కాబట్టి ఆయనకే టికెట్‌ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నుంచి పోటీ చేయడానికి జడ్పీ చైర్‌పర్సన్‌ సరితాతిరుపతయ్య కూడా ఆసక్తిగా ఉన్నారు. సిట్టింగులకు సీటు ఇస్తే.. సరితా తిరుపతయ్య పార్టీలో ఉండి పని చేసుకోవడమో లేదా ఇతర పార్టీల్లోకి జంప్‌ అయ్యి, అదృష్టాన్ని పరీక్షించుకోవడమో చేయాల్సి ఉంటుంది. ఇక అలంపూర్‌ నియోజకవర్గం నుంచి ఆశావహులు భారీగానే ఉన్నారు. సిట్టింగులకు సీట్లు ఇస్తే ఈ నియోజకవర్గం టికెట్‌ డాక్టర్‌ వీఎన్‌ అబ్రహాంకే దక్కుతుంది. ఆశావహుల్లో ప్రధానంగా మాజీ ఎంపీ, ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మాజీ జడ్పీచైర్మన్‌ బండారి భాస్కర్‌ కూడా టికెట్‌ ఆశిస్తున్నారు. అలాగే రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచంద్‌ కూడా ఇటీవల కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తాను ఇక్కడి నుంచి టికెట్‌ ఆశిస్తున్నట్లు కొంతమంది అభిప్రాయప డుతున్నారు.

ముఖ్య నాయకులపై ఆశలు..

ప్రస్తుతం పలు నియోజకవర్గాల్లో టికెట్‌ ఆశిస్తున్న వారిలో కొందరు నేరుగా సీఎం కేసీఆర్‌తో కాంటాక్టు ఉన్నవారు కాగా, మరికొందరు పార్టీలోని ముఖ్య నాయకులపైన ఆశలు పెట్టుకున్నారు. వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ తమకు టికెట్‌ వచ్చేలా కృషి చేయాలని కోరుకుంటున్నారు. అయితే పార్టీలో సీఎం కేసీఆర్‌దే అంతిమ నిర్ణయం కాబట్టి.. ఆశావహుల్లో ఎవరిని ప్రోత్సహిస్తారో ఇప్పటికిప్పుడు తెలియదు. అయితే గత ఎన్నికల్లో సిట్టింగులకు సీట్లు అని ప్రకటించినప్పటికీ, చివరిలో కొన్ని మార్పులు చేశారు. దీంతో ఈసారి కూడా అలాగే చేస్తే తమకు అవకాశం వస్తుందనే ధీమా కూడా ఆశావహుల్లో ఉంది. ఒకవేళ చివరి వరకు తమకు టికెట్లు రాకపోతే ఇందులో కొంతమంది ఆశావహులైనా పార్టీ మారి.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా పావులు కదుపుతోంది. పలు ఉప ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంతోపాటు ఓటు బ్యాంకు పెరిగిందనే ధీమాతో ఉంది. టీఆర్‌ఎస్‌లో ఆశావహులుగా ఉన్నవారిని లాగేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు వారు పార్టీ మారే అవకాశం లేకపోయినప్పటికీ, భవిష్యత్‌లో వారికి కాంగ్రెస్‌, బీజేపీ టికెట్లు వచ్చే అవకాశం ఉంది. అలంపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు, గద్వాల నియోజకవర్గంలో బీజేపీకి ఇప్పటికే స్ర్టాంగ్‌ లీడర్లు ఉన్నారు. అలంపూర్‌లో బీజేపీకి, గద్వాలలో కాంగ్రెస్‌కు ఆర్థిక, అంగ, స్థాన బలం లేని నాయకులు ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రమే ఏదో ఒక పార్టీ నుంచి ఒకరు టికెట్‌ పొందేందుకు వీలుంది. అయితే ఇప్పటికే ఆయా పార్టీల్లో ఉన్న వారిలో కూడా టికెట్‌ ఆశించేవారు ఉన్నారు. వారిని కాదని కొత్తవారికి అవకాశం ఇస్తే టీఆర్‌ఎస్‌ ఆశావహులకు టికెట్‌ దక్కుతుంది.

Updated Date - 2022-11-20T22:48:13+05:30 IST