నిధులు గుల్ల.. పనులు డొల్ల

ABN , First Publish Date - 2022-10-12T04:46:41+05:30 IST

ప్రభుత్వ సొమ్మే కదా నాదేం పోయిందనునకున్నారో ఏమో.. పదికాలాల పాటు నాణ్యంగా ఉండాల్సిన నిర్మాణాలను అడ్డగోలుగా చేపట్టారు.

నిధులు గుల్ల.. పనులు డొల్ల
నాసిరకం డ్రెయినేజీని తవ్వేస్తున్న కూలీలు

నిర్మాణంలో సిమెంట్‌ పాళ్లు తక్కువ

అందులోనూ అష్టవంకరలు

ఎక్స్‌కవేటర్‌ తాకడంతోనే కూలిపోయిన స్లాబ్‌

హడావుడిగా తొలగించిన కాంట్రాక్టర్‌

అధికారులు పర్యవేక్షణ చేయకపోవడంపై అనుమానాలు

ఇదీ వైరా పురపాలకంలో పరిస్థితి

వైరా, అక్టోబరు 11: ప్రభుత్వ సొమ్మే కదా నాదేం పోయిందనునకున్నారో ఏమో.. పదికాలాల పాటు నాణ్యంగా ఉండాల్సిన నిర్మాణాలను అడ్డగోలుగా చేపట్టారు. ఫలితంగా అవి అనతికాలంలోనే కూలిపోతున్నాయి. నాలుక కరుచుకున్న కాంట్రాక్టర్‌ మరలా పనులు మొదలు పెట్టారు. పదినెలల కిందట వైరా మునిసిపల్‌ ఇంజనీరింగ్‌శాఖ పర్యవేక్షణలో మధిర-జగ్గయ్యపేట వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డుకు రెండువైపులా డ్రెయినేజీ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ డ్రెయినేజీ నిర్మాణం ఎత్తుపల్లాలుగా, అష్టవంకర్లతో అడ్డదిడ్డంగా సాగుతోంది. ఇక్కడ మునిసిపల్‌ ఏఈ, ఉన్నతాధి కారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందనే విమర్శలున్నాయి. కాంట్రాక్టర్‌ సదరు సిబ్బంది అన్నీతామే అయి ఈ నిర్మాణం చేస్తున్నారు. అయితే ఇటీవల 6, 9 వార్డుల పరిధిలో నిర్మించిన డ్రెయినేజీ మొత్తం నాసిరకంగా ఉంది. 

సిమెంట్‌ పాళ్లు తక్కువ

సిమెంట్‌ తక్కువగా వేసి ఇసుక, కంకరతో డ్రెయినేజీ శ్లాబ్‌లను నాసిరకంగా నిర్మించారు. రెండురోజుల కిందట కాంట్రాక్టర్‌కు చెందిన ఎక్స్‌కవేటర్‌ మట్టిని చదును చేసే సమయంలో డ్రెయినేజీ పైకి ఎక్కిన వెంటనే శ్లాబ్‌ మొత్తం కూలి పోయింది. దీంతో తాము చేసిన పని నాసిరకంగా ఉందని గమనించిన కాంట్రాక్టర్‌ సిబ్బంది మొక్కుబడిగా రెండు, మూడు చోట్ల డ్రెయినేజీ శ్లాబ్‌ను మంగళవారం హడావుడిగా తొలగించారు. ముఖ్యంగా ప్రధాన ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి వివిధ నివాసాలకు వెళ్లే అంతర్గత రోడ్లను అనుసంధానం చేస్తూ నిర్మించిన శ్లాబ్‌ మొత్తం కంకర, ఇసుకతో నాసిరకంగా ఉంది. సిమెంట్‌ శాతం తక్కువగా ఉన్న విషయం డ్రెయినేజీ శ్లాబ్‌ కూల్చివేత సమయంలో స్పష్టంగా బయటపడింది. ఇప్పటికే అనేకసార్లు ఈ డ్రెయినేజీల నిర్మాణ నాణ్యత, అస్తవ్యస్త పరిస్థితులపై ‘ఆంధ్రజ్యోతి’ పలు మార్లు కథనాలు ప్రచురించింది. అయినప్పటికీ సదరు ఇంజనీరింగ్‌శాఖ అధికారిణి మాత్రం ఈ నిర్మాణాలకు సం బంధించి ఎంబీ రికార్డు చేయటం తప్ప ఏమాత్రం పర్యవేక్షణ లేదనే విమర్శలు ప్రస్తుత సంఘటనతో స్పష్టమవుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ డ్రెయినేజీలు ఏమాత్రం లెవల్స్‌ లేకుండా నిర్మించటంతో వర్షపునీరు మొత్తం ఆర్‌అండ్‌బీ రోడ్డుపైనే ప్రవహిస్తోంది. డ్రెయినేజీ అడుగుభాగంలో కూడా లెవల్స్‌ సరిగా లేకపోవడంతో మురుగునీరు సవ్యంగా ముందుకు పారటం కూడా కానాకష్టంగానే ఉంది. ఈ మురుగునీరు అడుగున పేరుకు పోయి పారిశుధ్య సమస్య తలెత్తే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం డ్రెయినేజీపై ఒకట్రెండుచోట్ల తొలగిం చిన శ్లాబ్‌లే కాకుండా మిగిలిన శ్లాబ్‌ల పటిష్టతపై కూడా మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు పరీక్షించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2022-10-12T04:46:41+05:30 IST