నీరు వృథా.. పట్టదా ప్రజల వ్యధ

ABN , First Publish Date - 2022-10-09T04:35:33+05:30 IST

ఓ పక్క తాగునీటి ప్రజలు అల్లాడుతుంటే ఇటు అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా వారం నుంచి తాగునీరు వృథాగా పోతోంది.

నీరు వృథా.. పట్టదా ప్రజల వ్యధ
ఎన్టీఆర్‌ నగర్‌లో వృథాగా పోతున్న మిషన్‌ భగీరథ నీరు

మిషన్‌ భగీరథ పైపులైన్ల నిర్మాణంతో ఇబ్బందులు

వేంసూరు రోడ్‌లో వారం నుంచి ఇదే తీరు

నిర్లిప్తంగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులు

సత్తుపల్లిరూరల్‌, అక్టోబర్‌ 8: ఓ పక్క తాగునీటి ప్రజలు అల్లాడుతుంటే ఇటు అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా వారం నుంచి తాగునీరు వృథాగా పోతోంది. మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరాలో భాగంగా సత్తుపల్లి పట్టణంలో లలితకుమారి ఆసుపత్రి వీధి నుంచి వేంసూరు రోడ్‌ మీదుగా నూతనంగా మిషన్‌ భగీరథ పైపులైన్లు వేశారు. అయితే వారం క్రితం లలితకుమారి ఆసుపత్రి వీధిలో ఓ వైపు గోతులు తవ్వగా మరోవైపు వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. తీసిన గుంతలను సైతం చదును చేయకపోవడంతో ప్రజలు నడవాలంటేనే ఇబ్బందులు పడ్డారు. ఇక పురవీధులలో వెళ్లే వాహనాలు చుట్టూ తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడగా, ఇప్పుడు వేంసూరు రోడ్డులో నిర్మించిన పైపులైన్‌ లీకవుతోంది. వారం నుంచి ఇదే తంతు సాగుతున్నా అటువైపు ఎవరూ తిరిగి చూడటం లేదు.

పొదుపు చేయాలని చెప్పాల్సిన వారే..

ప్రజలు నీటిని వృధా చేయోద్దని పొదుపు చేయాలని చెప్పాల్సిన అధికారులే ఇలా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్‌ నగర్‌లోని రామబాణం మిల్క్‌సెంటర్‌ ఎదుట మిషన్‌ భగీరథ పైపులైన్‌ను నూతనంగా నిర్మించగా అక్కడ ఏర్పాటు చేసిన సంప్‌ లీకవుతోంది. తాగునీరు వృథాగా పోతుండగా మరమ్మతులు చేయాల్సి ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు చూసుకుంటూ అటుఇటు తిరుగుతున్నారే కానీ సంపునకు మరమ్మతులు చేయడం లేదు. ఇదే విషయమై సంబంధిత అధికారికి ఫోన్‌లో సంప్రదించగా స్పందించలేదు.

Read more