జలగల్లా.. జేబులు గుల్లా

ABN , First Publish Date - 2022-04-25T03:56:23+05:30 IST

పీల్చే గాలి తర్వాత మనిషికి అత్యంత ముఖ్యమైనది తాగునీరు. ఒకప్పుడంటే కొళాయి నీరో, తాగునీటి బావి నీరో తాగేవారు.

జలగల్లా.. జేబులు గుల్లా

జనరల్‌ పేరిట మినరల్‌ వ్యాపారం

వేసవి వేళ అడ్డగోలుగా దందా

జబ్బులు ‘కొని’ తెచ్చుకుంటున్న ప్రజలు

ఉమ్మడి జిల్లాలో ఎనిమిది ప్లాంట్లకే బీఐఎస్‌, ఐఎస్‌ఐ క్వాలిటీ గుర్తింపు

టైడ్‌ లైసెన్స్‌తో పది వేలకు పైగా వాటర్‌ ప్లాంట్ల నిర్వహణ

శాఖల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణం

దాడులు చేస్తాం: కిరణ్‌కుమార్‌, ఉమ్మడి జిల్లా ఫుడ్‌ఇన్‌స్పెక్టర్‌

ఖమ్మంసంక్షేమవిభాగం, ఏప్రిల్‌ 24: పీల్చే గాలి తర్వాత మనిషికి అత్యంత ముఖ్యమైనది తాగునీరు. ఒకప్పుడంటే కొళాయి నీరో, తాగునీటి బావి నీరో తాగేవారు. కాలానుగుణంగా ప్రజల జీవన విధానంలో మార్పు వచ్చింది. ఫలితంగా ఇప్పుడు నగరం నుంచి మొదలు మారమూల గ్రామం వరకు అందరూ మినరల్‌ వాటరే తాగుతున్నారు. డిమాండ్‌ నానాటికీ పెరుగుతుండటంతో తాగునీటి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ ఉండటంతో వ్యాపారులు జనరల్‌ వాటర్‌, ప్యూరిపైడ్‌ వాటర్‌నే మినరల్‌ వాటర్‌గా పేర్లు మార్చి వాటర్‌ క్యాన్‌ రూ.20పై ధరకు విక్రయిస్తున్నారు. సాధారణ నీళ్లల్లో రసాయనాలు కలిపి మినరల్‌వాటర్‌గా అమ్ముతున్నట్టు ఆరోపణలున్నాయి. ఎప్‌ఎస్‌ఎస్‌ఐ లైసెన్స్‌లు లేకుండానే ప్యూరిఫైడ్‌ పేరుతో అమ్మకాలు జరుపుతుండటం విస్మయం కలిగిస్తోంది.

అధికారులకు తెలిసి కూడా ఇలా..

మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెపుతోంది. మిషన్‌ భగీరథ పేరుతో గతంలో గ్రామాలు, పట్టణాల్లో ఉండే రక్షిత తాగునీటి సరఫరా వ్యవస్థ నామ రూపాల్లేకుండా పోయింది. దీంతో ప్రజలు తప్పనిసరి పరిస్థితిల్లో ప్రజలు మినరల్‌ వాటర్‌ తాగేందుకు అలవాటు పడ్డారు. ఇదే అదునుగా ప్రజల అవసరాన్ని వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులు క్యాష్‌ చేసుకుంటున్నారు. నానాటికీ డిమాండ్‌ ఎక్కువవుతుండటంతో నీళ్లల్లో రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారు. వాటినే మినరల్‌ వాటర్‌ అనుకుని ప్రజలు తాగుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే జబ్బులను ‘కొని’ తెచ్చుకుంటున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరో పణలున్నాయి. 

ఉమ్మడి జిల్లాలో ఎనిమిది ప్లాంట్లకే బీఐఎస్‌ గుర్తింపు

నాణ్యమైన వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే బీఐఎస్‌(బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్‌) నిబంధనలు కచ్చితంగా ఉండాలి. ఇలా వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణం చేయాలంటే కనీసం రూ.20లక్షల వరకు ఖర్చవవుతుంది. బీఐఎస్‌ వాటర్‌ప్లాంట్‌లో కెమిస్ట్రీ విద్యార్హత కలిగిన శాస్త్రవేత్త పర్యవేక్షణలో వాటర్‌ ప్లాంట్‌ నిర్వహించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఐఎస్‌ నిబంధనల మేరకు ఖమ్మంలో ఐదు, కొత్తగూడెంలో 2, భద్రాచలంలో ఒక ప్లాంట్‌ మొత్తం ఎనిమిది వాటర్‌ ప్లాంట్లు మాత్రమే పనిచేస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో 10వేలకు పైగా ట్రైడ్‌ లైసెన్స్‌ వాటర్‌ ప్లాంట్లు

ఆహార కల్తీ నివారణశాఖ, నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయతీల ప్రభుత్వశాఖల మధ్య సమన్వయ లోపాన్ని వాటర్‌ప్లాంట్‌ నిర్వాహకులు క్యాష్‌ చేసుకుంటున్నారు. వాటర్‌ ప్లాంట్‌ అనుమతికి బీఐఎస్‌ అనుమతి లేకుండా ఆహార కల్తీ  నివారణ శాఖ వ్యాపార లైసెన్స్‌లు లేకుండానే కేవలం నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయతీల ద్వారా ట్రైడ్‌ లైసెన్స్‌లు తీసుకొని రూ.20లక్షలతో నిర్మించాల్సిన వాటర్‌ ప్లాంట్‌లను కేవలం రూ. రెండు లక్షలతో కొద్దిపాటి ఫిల్టర్లు, కెమికల్స్‌ తీసుకొచ్చి వాటితో మినరల్‌ వాటర్‌ విక్రయిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 10 వేలకు పైగా ఇటువంటి వాటర్‌ప్లాంట్స్‌, ప్యూరీపైడ్‌ వాటర్‌ ప్లాంట్లుగా చెలామణి అవుతున్నాయి. బీఐఎస్‌ నిబంధనల మేరకు ఒక వాటర్‌ క్యాన్‌ వాటర్‌ తయారు చేయాలంటే రూ.20వరకు వ్యయం జరుగుతుంది. కానీ కేవలం రూ. మూడు వ్యయంతో సాధారణ వాటర్‌ ప్లాంట్‌ నుంచి తాగునీరు పార్శిల్‌ చేసి రూ.20కు అమ్మకాలు జరుపుతున్నారని విమర్శలు ఉన్నాయి.  ఇక వాటర్‌ప్లాంట్స్‌లో కొంత వ్యాపార అనుభవం కలిగిన వారు ఏకంగా తప్పుడు ఐఎస్‌ఐ ముద్రలను వేసి మరి అమ్మకాలు చేస్తున్నారు.

తగ్గుతున్న నాణ్యతా ప్రమాణాల వాటర్‌ ప్లాంట్లు

2018లో ఖమ్మం జిల్లాలో 35, భద్రాద్రి జిల్లాలో 14 బీఎస్‌ఐ, ఐఎస్‌ఐ నాణ్యత కలిగిన ప్లాంట్ల ద్వారా మినరల్‌ వాటర్‌ అమ్మకాలు జరిగాయి. కానీ సాధారణ వాటర్‌ ప్లాంట్ల సంఖ్య ఎక్కువగా కావడం, వాటిని అడ్డుకునే వ్యవస్థలు పనిచేయకపోవడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాటర్‌ప్లాంట్‌ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో ఐఎస్‌ఐ వాటర్‌ ధరకు సమానంగా ప్యూరిపైడ్‌ వాటర్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. దీంతో నాణ్యతా ప్రమాణాలు పాటించే తాగునీటి కంపెనీలు సైతం ఐఎస్‌ఐ ప్రమాణాలు తగ్గించి సాధారణ వాటర్‌ ప్లాంట్స్‌గా మారాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఐఎస్‌, ఐఎస్‌ఐ ప్రమాణాలతో ఉండాల్సిన 49 వాటర్‌ ప్లాంట్స్‌ ఇప్పుడు ఎనిమిదికి చేరాయి.

నో సీల్‌.. నో లేబెల్‌..

మినరల్‌ వాటర్‌ క్యాన్‌లకు తప్పనిసరిగా కంపెనీ సీల్‌తో పాటుగా వాటర్‌ క్యాన్‌లో ఏ మేరకు టీడీఎప్‌ ఉందానే విషయాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. బహిరంగంగానే ఎటువంటి సీల్‌, లేబుల్స్‌ లేకుండానే వాటర్‌ అమ్మకాలు జరుగుతున్నా అడిగే అధికారులే కరవయ్యారు. ఏకంగా జిల్లా ఉన్నతాధికారుల కార్యాలయాలకు సీల్‌, లేబుల్‌ లేని నీరు సరఫరా అవుతున్నా పట్టించుకునే వారు లేరు. ఇక సామాన్య ప్రజల సంగతి  ఆ దేవుడికే తెలియాలి.

దాడులు చేస్తాం...

ఆర్‌ కిరణ్‌కుమార్‌, గెజిటెడ్‌ పుడ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఉమ్మడి జిల్లా

ఉమ్మడి జిల్లాలో వాటర్‌ప్లాంట్స్‌ పెరిగాయి. వాటిలో ఎనిమిది వాటర్‌ప్లాంట్స్‌కు మాత్రమే బీఎస్‌ఐ అనుమతి ఉంది. బీఎస్‌ఐ వాటర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి రూ.20లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వాటర్‌ ప్లాంట్‌లో కెమిస్టు సాంకేతిక అనుభవం కలిగిన ఉద్యోగి సైతం ఉండాలి. కానీ ప్యూరిపైడ్‌ పేరుతో తాగునీటి అమ్మకాలు చేస్తున్నారు. ప్రజల్ని మాత్రం మినరల్‌ వాటర్‌గా నమ్మిస్తున్నారు. అనుమతి లేని వాటర్‌ప్లాంట్స్‌పై స్థానికంగా ఉండే రెవెన్యూ డివిజనల్‌ అధికారుల సహకారంతో దాడులు చేస్తాం. కేసులు నమోదు చేస్తాం. ప్రత్యేక డ్రైవ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రజలు తాగునీటి కల్తీపై ఫిర్యాదులు చేస్తే తప్పకుండా ఆయా వాటర్‌ప్లాంట్స్‌ పరిశీలించి సీజ్‌ చేస్తాం.


Read more