TRS పార్టీలో సన్‌స్ట్రోక్‌కు గురైన నేతలు.. ఆ ఎమ్మెల్యేల కథ కంచికేనా..!?

ABN , First Publish Date - 2022-01-14T17:02:04+05:30 IST

ఆ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తుపై కారుమబ్బులు కమ్ముకుంటున్నాయా? దీనిపై...

TRS పార్టీలో సన్‌స్ట్రోక్‌కు గురైన నేతలు.. ఆ ఎమ్మెల్యేల కథ కంచికేనా..!?

గులాబీ పార్టీలో సన్ స్ట్రోక్ తగులుతున్న నేతలెవరు? పుత్ర రత్నాలు చేస్తున్న తప్పుడు పనులు కొంత మంది ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారుతోందా? దాంతో వారి గ్రాఫ్ పడిపోతోందా? తనయుల భాగోతాలతో ఆ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తుపై కారుమబ్బులు కమ్ముకుంటున్నాయా? దీనిపై కారు పార్టీలో ప్రస్తుతం ఊపందుకున్న కహానీలు ఎలా ఉన్నాయి? అనే మరిన్ని విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో తెలుసుకుందాం..


గులాబీ పార్టీకి కొత్త తలనొప్పులు 

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్న వేళ... గులాబీ పార్టీని కొత్త తలనొప్పులు వేధిస్తున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేల తనయులు చేస్తున్న పనులు... అటు సదరు ఎమ్మెల్యేలకు, ఇటు పార్టీకి ఇబ్బందులు కొనితెస్తున్నాయి. నిత్యం ప్రజల్లో ఉండే వారిని ఎన్నికల్లో గెలిపించుకుంటామని పార్టీ అధినేత కేసీఆర్ చెబుతుంటే... మరోవైపు పలువురు సన్ స్ట్రోక్‌లతో విలవిల్లాడుతున్నారు. తనయులు తెస్తున్న మచ్చతో రానున్న  ఎన్నికల్లో అసలు సీటు వస్తుందో రాదో అనే ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. 


కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ కుటుంబం సూసైడ్ చేసుకున్న ఘటనలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవ పేరు సూసైడ్ నోట్‌లో ఉండటం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది. ఈ అంశంపై విపక్షాలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. దీంతో ఈ వ్యవహారం ఎమ్మెల్యే వనమాతో పాటు  టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. 


ఖమ్మం జిల్లా రాఘవపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్‌కు రాజకీయంగా నష్టం చేకూర్చే అవకాశం ఉందన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. చివరకు వనమా సైతం తన కుమారున్ని నియోజకవర్గంలో ఉంచనని చెప్పుకోవాల్సి వచ్చింది. దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లుగా తెలుస్తోంది. జిల్లా నాయకుల నుంచి వివరాలు తెలుసుకుంది. జిల్లా నాయకులు కూడా రాఘవపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు టాక్. అటు ప్రతి పక్షాల నుంచి విమర్శలు పెరగడం, సొంత పార్టీ నేతలు కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరడంతో రాఘవపై సస్పెన్షన్ వేటు వేశారు గులాబీ పెద్దలు. 


కొత్తగూడెంలో మూడు రోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు... 45 సంవత్సరాల వనమా రాజకీయ జీవితంలో కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తున్నాయని జిల్లా నేతలు చెబుతున్నారు. ఓవైపు ఆరోగ్యం సహకరించక పోగా, మరోవైపు కొడుకు ఎపిసోడ్‌తో వచ్చే ఎన్నికల్లో వనమాను పక్కకు పెట్టాలని హైకమాండ్‌ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వనమాకు రాజకీయ వారసుడు అవుతాడనుకున్న ఆయన కొడుకు రాఘవ నిర్వాకం... అసలుకే ఎసరు తెచ్చి పెట్టిందనే చర్చ కారు పార్టీలో జోరుగా జరుగుతోంది. 


వచ్చే ఎన్నికల్లో తెరమీదకు రానున్న వారసులు

ఇక టీఆర్ఎస్ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల నాటికి తమ వారసులను తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనేక నియోజకవర్గాల్లో తనయుల వ్యవహారాలు తండ్రులకు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఓవైపు ప్రతిపక్షాల నుంచి ఎదురుదాడి, మరోవైపు పుత్రరత్నాలు చేస్తున్న పనులు వారి ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయి. వారసుల ఆగడాలు, స్వీయ తప్పిదాలు వారి రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్నాయి. 


తండ్రుల పేరు చెప్పి తనయులు చేస్తున్న ఆగడాలు

ఒక వనమా వెంకటేశ్వరరావుకే కాదు... టీఆర్ఎస్‌లో చాలా మంది నేతలకు తనయుల వ్యవహారం తలనొప్పిగా మారిందన్న టాక్ వినిపిస్తోంది. కొందరి భాగోతాలు రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారుతుంటే... మరికొందరి వ్యవహారాలు నియోజకవర్గ స్థాయిలో చిలువలు పలువలు అవుతున్నాయి. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తనయుడు జీవన్ లాల్ వ్యవహార శైలి ఆ నియోజకవర్గంలో నెగిటివ్ చర్చకు దారితీస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది నేతలకు వారసుల పోటు తప్పడం లేదట. 


 వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టే యోచనలో హైకమాండ్‌

మొత్తంమీద, నియోజకవర్గాల్లో తండ్రుల పేరు చెప్పి తనయులు చేస్తున్న ఆగడాలను టీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వారందరికీ వచ్చే ఎన్నికల్లో చెక్ పెట్టే యోచనలో హైకమాండ్‌ ఉన్నట్లు పార్టీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది. అదే జరిగితే.. గులాబీ పార్టీలో సన్‌స్ట్రోక్‌కు గురైన నేతల కథ కంచికేనా? చూద్దాం ఏం జరుగుతుందో... 

Read more