లక్ష్యం సరే.. సంకల్పమేదీ?

ABN , First Publish Date - 2022-07-05T06:31:23+05:30 IST

లక్ష్యం సరే.. సంకల్పమేదీ?

లక్ష్యం సరే.. సంకల్పమేదీ?

ఈ ఏడాది హరితహారం ఎనలేని నిర్లక్ష్యం 

వానాకాలం మొదలైనా అధికారిక ప్రకటన కరువు

ఖమ్మం జిల్లాలో 50లక్షల మొక్కలు నాటాలని నిర్ణయం

ఇప్పటికే శాఖల వారీగా నిర్దేశాలు ఖరారు

నర్సరీల్లో 94లక్షల మొక్కలు అందుబాటులో

ఖమ్మం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఇప్పటికి ఏడు విడతలు జరిగింది. ఏడేళ్లుగా ప్రతీ వానాకాలం ఈ హరితహారాన్ని నిరాటంకంగా నిర్వహిస్తూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వానాకాలానికి నెల, రెండు నెలల ముందుగానే ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం, నిధులు కేటాయించడం, ప్రత్యేక కార్యాచరణ ప్రకటించడం చేసి.. కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేది. అలాంటి ప్రతిష్టాత్మక హరితహారం కార్యక్రమం రానురాను అపహాస్యంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షల కొద్ది మొక్కల నాటాలన్న లక్ష్యం కాస్త నీరుగారిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఈ ఏడాది ఉన్నతస్థాయి మొదలు క్షేత్రస్థాయి వరకు వేళ్లూనుకున్న నిర్లక్ష్యం కారణంగా వర్షాకాలం ప్రారంభమైనా నేటికీ హరితహారం నిర్వహణపై ఓ స్పష్టత లేకపోవడంపట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో వర్షాకాలం ప్రారంభ సమయం వచ్చిందంటే చాలు హరితహారం నిర్వహణపై పెద్ద ఎత్తున ప్రచారం చేసిన అధికారులు, నాయకులు ఈ సారి మౌనంగా ఉన్నారు. అందరూ మొక్కలు నాటేలా అవగాహన కల్పించడంతోపాటు ఇంటింటికి మొక్కలు పంపిణీ చేసిమరీ నాటించేవారు. కానీ ఈ ఏడాది అలాంటి చర్యలేం కనిపించడం లేదు. వర్షాలు పడుతున్నా అధికారికంగా హరితహారం కార్యక్రమం నిర్వహించడంపై ప్రకటన చేయకపోవడంపై హరితలక్ష్యం నిరుగారే అవకాశం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 


ఖమ్మం జిల్లాలో 50లక్షలు లక్ష్యం.. 

జిల్లాలో ఈ ఏడాది ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా 50లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేశారు అధికారులు. దానికిగాను గతంలోనే సమావేశాలు ఏర్పాటు చేసి శాఖల వారీగా లక్ష్యాలను సైతం నిర్ధేశించారు. దానికి సంబంధించి సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. హరితహారంలో భాగంగా నిర్దేశించిన 32లక్షల మొక్కలను పలు శాఖల ద్వారా నాటించడంతోపాటు 18లక్షల మొక్కలను ఇళ్లకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. డీఆర్‌డీఏ ద్వారా అత్యధికంగా 17లక్షలు, అటవీ శాఖ ద్వారా 7లక్షలు, హార్టికల్చర్‌ ద్వారా 3లక్షలు, వ్యవసాయశాఖ ద్వారా 4.5లక్షలు, మైనింగ్‌కు లక్ష, ఇండసీ్ట్రస్‌కు 50వేలు, ఎక్సైజ్‌ శాఖ లక్ష, విద్యాశాఖకు 50వేలు, విద్యుత శాఖకు 2.20 లక్షలు, నీటిపారుదల శాఖకు 2లక్షలున్నాయి. వాటితోపాటు ఖమ్మం మునిసిపల్‌ కార్పొరేషన్‌లో లక్ష మొక్కలు నాటాలని, మూడు లక్షల మొక్కలు, మధిర మునిసిపాలిటీలో 43వేలు నాటాలని, 2.50లక్షలు పంపిణీ, వైరా మునిసిపాలిటీలో 43వేలు నాటడం, లక్ష మొక్కలు పంపిణీ, సత్తుపల్లి మునిసిపాలిటీలో 44వేలు నాటాలని, 2.50లక్షలు పంపిణీ చేయాలని లక్ష్యాలను నిర్ధేశించారు. కాగా ప్రస్తుతం జిల్లాలో 589 నర్సరీల్లో 94.77లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రస్తుతం అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో డీఆర్‌డీఏ ద్వారా అనధికారికంగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్టు తెలుస్తోంది. అయితే కేవలం ఆ ఒక్క శాఖ ద్వారా మాత్రమే ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలుస్తుండగా మిగిలిన శాఖల వారు అధికారిక తేదీల కోసం వేచి చూస్తున్నట్టు తెలుస్తోంది. 


గతంలో నామమాత్రంగా నిర్వహణపై ఆరోపణలు

ఏడో విడత హరితహారంలోనూ శాఖలవారీగా లక్ష్యాలను నిర్ధేశించి మొక్కలు నాటడం మొదలుకుని పంపిణీ వరకు అన్నీ సక్రమంగా చేయడం వాటి పరిరక్షించాల్సిన బాధ్యతలను సంబంధిత శాఖలకు అప్పగించారు. అయితే రాను రాను హారితహారం లక్ష్యంపై సంబంధిత అధికారుల మొదలు స్థానిక నేతల వరకు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగానే మొక్కలు నాటే కార్యక్రమాలను ఇష్టారీతిన నిర్వహించడం, నాటిన మొక్కలకు రక్షణ కరువవడం లాంటి ఎన్నో అంశాలు పునరావృతమవుతూ వస్తూనే ఉన్నాయి. అంతేకాదు శాఖలవారీగా నాటిన మొక్కల విషయం పక్కనపెడితే పురపాలకాలు, నగరపాలకంలో పంపిణీ చేసే లక్ష్యం నిరవేరడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతేడాది చాలా పురపాలకాల్లో ఇళ్లకు మొక్కలు పంపిణీ చేయకుండానే చేసినట్టు లెక్కలు చూపారన్న ఆరోపణలున్నాయి. ఖమ్మం కార్పొరేషన్‌లో చాలా డివిజన్లలో అసలు మొక్కలు పంపిణీ చేయకపోవడం గమనార్హం. కాగా ఈ ఏడాది అయినా మొక్కలు పంపిణీ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడటంతోపాటు, జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని ప్రజలు కోరుతున్నారు. 


భద్రాద్రి జిల్లాలోనూ అదే పరిస్థితి 

ఈ ఏడాది లక్ష్యం 96లక్షల మొక్కలు 

కొత్తగూడెం కలెక్టరేట్‌, : హరిత తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ఈ ఏడాది జిల్లాలో 95లక్షల62మొక్కలు నాటాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ మేరకు నర్సరీల్లో మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది. వాస్తవానికి ఇప్పటికే హరితహారం కార్యక్రమం ముమ్మరంగా జరగాల్సి ఉన్నా, ఈ ఏడాది మాత్రం మందకొడిగా సాగుతోంది. ఇప్పటికే శాఖల వారీగా నిర్ధేశించిన మొక్కలు నాటే కార్యక్రమానికి గుంతలు తీయడం కూడా ప్రారంభం కాలేదు. 2016 -17 సంవత్సరం నుంచి 2021-22 వరకు ఏడేళ్లలో ఇప్పటి వరకు 9కోట్ల 3లక్షల మొక్కలకు గాను లక్ష్యాన్ని మించి 9.79కోట్ల మొక్కలు నాటితే 79శాతం మొక్కలు బతికాయి.  క్షేత్రస్థాయిలో ఇంకా తక్కువ శాతం మొక్కలు బతికినట్టు తెలుస్తోంది. అంతే కాదు రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలు ఏడాది కాగానే విద్యుత తీగలకు తగులుతున్నాయని నరికివేసి వాటి స్థానంలో కొత్త ఏడాది లక్ష్యం ప్రకారం మొక్కలు నాటిన సంఘటనలు అనేకం జిల్లాలో చోటు చేసుకొన్నాయి. ఈ ఏడాది అటవీశాఖ 20లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం నిర్ధేశించగా, మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖలు కలిపి మొత్తం 95లక్షల 62వేల మొక్కలు నాటే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం హరతహరం మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కానీ గుంతలు తీయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కలెక్టర్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హరితహారంపై మునిసిపల్‌ కమిషనర్లు, ఎంపీడీవోలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించి హరితహారం పనులను ముమ్మరం చేయాలని ఆదేశాలిచ్చారు. 



Updated Date - 2022-07-05T06:31:23+05:30 IST