సూర్యాపేట- ఖమ్మం హేవే పూర్తి

ABN , First Publish Date - 2022-09-27T05:56:51+05:30 IST

సూర్యాపేట- ఖమ్మం హేవే పూర్తి

సూర్యాపేట- ఖమ్మం హేవే పూర్తి
సూర్యాపేట-ఖమ్మం కొత్త రహదారిపై వాహనాల రాకపోకలు

వాహనాల రాకపోకలకు ట్రయల్‌రన

త్వరలో అధికారికంగా ప్రారంభం

ఖమ్మం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సూర్యాపేట -ఖమ్మం నాలుగులైన్ల జాతీయరహదారి పనులు పూర్తయ్యాయి. సూర్యాపేట- విశాఖపట్నం కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్న ఈ రహదారి పూర్తికావడంతో హైవే అథారిటీ అధికారులు వాహనాల రాకపోకలపై ట్రయల్‌రన నిర్విహిస్తున్నారు. ఈ రహదారితో సూర్యాపేట పట్టణంతో సంబంఽధం లేకుండానే హైదరాబాద్‌ నుంచి ఖమ్మం మీదుగా వాహనాల రాకపోకలు సులువు కానున్నాయి. ఈ జాతీయ రహదారిని త్వరలో అధికారికంగా ప్రారంభించనున్నారు. హైదరాబాద్‌ నుంచి ఖమ్మంమీదుగా దేవరపల్లి వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారి చేయాలని ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ హయాంలో, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో రోడ్లు భవనాలశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన తుమ్మల నాగేశ్వరరావు భావించారు. ఇందుకోసం ప్రత్యేక చొరవ తీసుకున్న ఆయన కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితినగడ్కరీకి ఈ రోడ్డు అవసరాన్ని పలుమార్లు వివరించి.. కేంద్రమంత్రి గడ్కరీతో ఉన్న పరిచయం, సాన్నిహిత్యంతో సూర్యాపేట-ఖమ్మం 365బీబీకి రూ.1566కోట్లతో 58కిలోమీటర్లకు నిధులు మంజూరయ్యాయి. ఆ తర్వాత కొంతకాలం పాటు మంత్రిగా ఉన్న తుమ్మల భూసేకరణ పనులను వేగంగా పూర్తిచేయుంచారు. ఆ తర్వాత ప్రారంభమైన ఇటీవల పనులు పూర్తయ్యాయి. త్వరలో నిర్మించబోతున్న ఖమ్మం-దేవరపల్లి రహదారి పనులు కూడా పూర్తయితే విశాఖ ప్రాంతంనుంచి వచ్చే వాహనాలు విజయవాడ వైపు వెళ్లకుండానే ఖమ్మంమీదుగానే నేరుగా హైదరాబాద్‌ వెళ్లనున్నాయి. ఈ క్రమంలో సుమారు 65 కి.మీ.దూరం తగ్గడంతోపాటు ప్రమాదాల నివారణ, ఇంధనపు ఖర్చు కూడా తగ్గనుంది. సూర్యాపేట జిల్లా టేకుమట్ల వరకు నాలుగు లైన్ల రహదారికి అనుసంధానమయ్యే ఈరోడ్డును పూర్తి చేసేందుకు ప్రస్తుత జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌, ఎంపీ నామ నాగేశ్వరరావు కూడా తమవంతు తోడ్పాటు అందించారు.


జిల్లాలో ఇది రెండో జాతీయ రహదారి..

ప్రస్తుతం జిల్లాలో విజయవాడ -జగదల్‌పూర్‌ జాతీయ రహదారి పనులు పూర్తయి రాకపోకలు జరుగుతుండగా సూర్యాపేట-ఖమ్మం రెండో జాతీయ రహదారి. రోడ్లు భవనాలశాఖ మంత్రిగా మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకుని విజయవాడ - జగదల్‌పూర్‌ రహదారికి నిఽధులు మంజూరు చేయించి పనులు పూర్తిచేయించారు. తుమ్మల కృషితో ఖమ్మం-దేరవపల్లి కూడా మంజూరవగా ప్యాకేజీ 1,2,3 టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఏపీ వైపు పనులు నడుస్తున్నాయి. ప్యాకేజీ1కి సుమారు రూ.1,200కోట్లతో 34కి.మీ, ప్యాకేజీ2కు రూ.900కోట్లతో 29.5కిలోమీటర్లు ప్యాకేజీ3కింద సుమారు 1,200కోట్లతో 42.5కి.మీ. పనులు ప్రారంభంకానున్నాయి. పూర్తి గ్రీనఫీల్డ్‌ రహదారిగా ఈరహదారి మంజూరైంది. తుమ్మల హయాంలో దీంతోపాటు కోదాడ-ఖమ్మం, భద్రాచలం-ఏటూరునాగారం, ఖమ్మం-కురవి, ఖమ్మం-వరంగల్‌, కొత్తగూడెం-ఇల్లెందువైపుగా హైదరాబాదుకు జాతీయ రహదారులకు ప్రతిపాదనలు వెళ్లగా ఖమ్మం-కోదాడకి తుమ్మల 32కి.మీపాటు సుమారు రూ.1,300కోట్లు మంజూరుచేయించారు. ఈ పనులు జరుగుతున్నాయి. ఖమ్మం-కురవి పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కాగా జిల్లాలో నాగ్‌పూర్‌-అమరావతికి సంబంధించి కూడా భూసేకరణ పనులు జరుగుతున్నాయి. ఖమ్మం-వరంగల్‌ వైపుగా భూసేకరణ పూర్తికాగా ఖమ్మంనుంచి ఎర్రుపాలెం వైపుగా భూసేకరణ జరుగుతుంది. ఈ పనులుకూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. జిల్లాలో పెద్దఎత్తున నిర్మాణం అవుతున్న  జాతీయ రహదారుల కారణంగా భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. గతంలో ఎకరం రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఉంటే ఇప్పుడు రూ.50లక్షలనుంచి రూ.కోటి, రూ.2కోట్లపైగా పలుకుతున్నాయి. జాతీయ రహదారుల కారణంగా రవాణా వ్యవస్థ పెరిగి పర్యాటకంగా కూడా జిల్లాకు గుర్తింపు రానుంది.


జాతీయ రహదారులతో జిల్లా అభివృద్ధి మరింత వేగం

తుమ్మల నాగేశ్వరరావు, మాజీమంత్రి 

జిల్లాలో పూర్తవుతున్న జాతీయ రహదారుల ప్రక్రియతో ఉమ్మడి జిల్లా అఅభివృద్ధి మరింత వేగమవుతుంది. ఖమ్మం-సూర్యాపేట జాతీయ రహదారికి ఎంతో శ్రమించాం. ఈ రహదారి పనులు పూర్తయినందున ఖమ్మం మీదుగా హైదరాబాద్‌, విశాఖ ప్రాంతాలకు రాకపోకలకు సమయం తగ్గడంతోపాటు దూరం కూడా తగ్గుతుంది. హైదరాబాదు-విశాఖ రవాణా కారిడార్‌కు ఖమ్మం కేంద్రంగా మారనుంది. అటు ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలోనూ రోడ్లుభవనాలమంత్రిగా పనిచేయడం ద్వారా జిల్లాలో జాతీయ రహదారుల మంజూరుకు అవకాశం దొరికింది. జిల్లాలో గతంలో ఒక్క సెంటీమీటరు కూడా జాతీయ రహదారి లేదని, గతంలో తాను తీసుకున్న చొరవతో విజయవాడ-జగదల్‌పూర్‌ జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. అలాగే హైదరాబాదు- బీజాపూర్‌ వయా ఏటూరునాగారం మీదుగా గోదావరిపై వారధితో పాటు జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. ఖమ్మం-కోదాడ, భద్రాచలం - ఏటూరు నాగారం, ఖమ్మం- వరంగల్‌, ఖమ్మం- కురవి, కొత్తగూడెం-హైదరాబాద్‌ వైపు కూడా జాతీయ రహదారులకు ప్రతిపాదనలు చేయించడంతో పాటు కొన్ని రహదారులకు నిధులు మంజూరు చేయించా. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేంద్రమంత్రి గడ్కరీ, ఖమ్మం జిల్లాలో పనిచేసిన కలెక్టర్‌ గిరిధర్‌, కేంద్ర ఉపరితలశాఖలోని కీలకఅధికారుల సహకారం వల్లే సాధ్యమైంది. ఈ రహదారులన్నీ పూర్తయితే రాష్ట్రంలోనే జాతీయ రహదారులు అధికంగా వెళ్లే జిల్లాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గుర్తింపు లభించనుంది. పొరుగురాష్ట్రాలకు జిల్లా జాతీయ రహదారులు అనుసంధానమై జాతీయ రవాణా రోడ్డు మార్గానికి ఖమ్మం రహదారులు కీలకం కానున్నాయి. తద్వారా జిల్లా అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించేందుకు అవకాశం ఉంటుంది. 

Updated Date - 2022-09-27T05:56:51+05:30 IST