పీహెచ్‌సీల్లో 14 మంది వైద్యుల సరెండర్‌

ABN , First Publish Date - 2022-02-23T05:50:08+05:30 IST

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అసలే వైద్యుల కొరత ఉంటే వాటిని భర్తీ చేయాల్సిన ప్రభుత్వం.. ప్రత్యేక వైద్య నిపుణులను సరెండర్‌ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

పీహెచ్‌సీల్లో 14 మంది వైద్యుల సరెండర్‌

   వైద్య విధాన పరిషత్‌కు కేటాయింపునకు కౌన్సిలింగ్‌

పలు పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత

ఖమ్మంకలెక్టరేట్‌, ఫిబ్రవరి22: జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అసలే వైద్యుల కొరత ఉంటే వాటిని భర్తీ చేయాల్సిన ప్రభుత్వం.. ప్రత్యేక వైద్య నిపుణులను సరెండర్‌ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో వివిధ పీహెచ్‌సీల్లో విధులు నిర్వహిస్తున్న 14మంది వైద్యులను సరెండర్‌ చేయడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు సిద్ధం చేసింది.  గతంలో పీజీ చేసిన వైద్యులను పీహెచ్‌సీలకు కేటాయిం చవద్దని మొరపెట్టుకున్నా వినకుండా పీహెచ్‌సీలకు కేటాయించారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారిని సరేండర్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది.  ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉండాలి కానీ, వైద్యుల కొరతతో ఒక్కరితోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఏదైనా కారణాలతో ఆ వైద్యులు రాకుంటే రోగులకు వైద్యం అందడం కష్టంగానే మారుతోంది. ఇలాంటి సమయంలో ప్రత్యేక వైద్యులను సరెండర్‌ చేయడం సరైంది కాదనే  అభిప్రాయం వెల్లడవుతోంది. ప్రత్యేక వైద్యనిపుణులను వైద్య విధాన పరిషత్‌కు, డీఎంఈలకు కేటాయించాలని ప్రభుత్వం యోచిస్తున్నా... క్షేత్రస్థాయిలో వైద్యుల కొరత ప్రజలకు మరింత ఇబ్బందులు కలిగే ఆస్కారం కనిపిస్తోంది. 

సరెండర్‌ చేసిన వైద్యుల వివరాలు ఇలా..

డాక్టర్‌ బి.సురేష్‌నారాయణ(నేలకొండపల్లి), కె అనిల్‌ కుమార్‌ (మధిర), ఎన్‌ నివేదిత (చింతకాని), ఎండీ ఆర్షిదాబేగం(తిరుమలాయపాలెం), కెఎస్‌వీ చౌహాన్‌ (ఖమ్మం ప్రధాన ఆస్పత్రి), వేణుగోపాల్‌శ్రీనివాస్‌ (కూసుమంచి), కె సుజనగౌడ్‌ (పీపీయూనిట్‌ ఖమ్మం), ఆర్‌ అనిత (మధిర), పి మనోరమ (మధిర), ప్రేమలత (వేంసూరు),డి.శ్రీను (తల్లాడ), కె.రాజేష్‌ (నేలకొండపల్లి), జి శ్రీదేవి (పీపీ యూనిట్‌ ఖమ్మం) మొత్తం 14 మంది వైద్యులను సరెండర్‌ చేయాలంటూ ఉన్నతాధికారుల ను ంచి ఆదేశాలు వచ్చాయి. వీరిని వైద్యవిధాన పరిషత్‌కు, డీఎంఈకి పంపించేందుకు నేడో రేపో కౌన్సెలింగ్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. 


Read more