పురుగుల మందు తాగిన విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-12-09T23:33:38+05:30 IST

పురుగులమందు తాగిన ఓ విద్యార్థి పన్నెండు రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో శుక్రవారం జరిగింది.

పురుగుల మందు తాగిన విద్యార్థి మృతి
విద్యార్థుల ఆందోళన

గుండాల, డిసెంబరు 9: పురుగులమందు తాగిన ఓ విద్యార్థి పన్నెండు రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో శుక్రవారం జరిగింది. మండలంలోని మల్లెలవారిగుంపు గ్రామానికి చెందిన జిగట ప్రవీణ్‌(14) గుండాల ఎస్టీ హాస్టల్‌లో ఉంటూ స్థానిక హైస్కూల్‌లో 9వ తరగతి చ దువుతున్నాడు. గత నెల 28వ తేదీన తన గ్రామంలోని చేను వద్ద పురుగులమందు తాగి ఇంటికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు గమనించి ఇప్పటివరకు పలు ఆసుపత్రులకు తీసుకెళ్లి వైద్యం అందించారు. చివరికి ఖమ్మం ఆసుపత్రిలో వైద్యం పొందుతూ మృతిచెందాడు. అయితే ఆరోజున హోమ్‌వర్క్‌ రాయలేదని ఓ ఉపాధ్యాయుడు దండించడంతో పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఘటన జరిగిన రోజున తోటి విద్యార్థులు తెలిపిన విషయం తెలిసిందే. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రవీణ్‌ కొంత కాలంగా పన్ను నొప్పితో బాధపడుతున్నాడని, ఆ నొప్పిని భరించలేక 28న పురుగుల మందు తాగాడని కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని చెబుతున్నారు. ఇల్లెందులో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు.

విద్యార్థి సంఘాల ఆందోళన

పురుగుల మందుతాగి మృతిచెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆందోళన చేశారు. ర్యాలీ నిర్వహించి తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి రాజేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే షాహిద్‌ మాట్లాడుతూ.. విద్యార్థి మృతిపట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, బాధిత కుటుంబానికి ఒక ఉద్యోగం, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు, ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు రణదీప్‌, నాసిర్‌, రోహిత్‌, గుగులోత్‌ భాస్కర్‌, కృష్ణసాగర్‌, అరవింద్‌, రాజేష్‌, శ్రీనివాస్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:33:39+05:30 IST