సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా
ABN , First Publish Date - 2022-12-16T01:28:23+05:30 IST
మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటుతో మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయగలుగుతున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు.
అభ్యర్థులతో మాట్లాడుతున్న సీపీ విష్ణు ఎస్ వారియర్
సీసీ కెమెరాల పర్యవేక్షణతో మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట
భద్రాద్రి, ములుగు జిల్లాల అధికారుల పనితీరు భేష్
కొత్తగూడెం పర్యటనలో డీజీపీ మహేందర్‌రెడ్డి
పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద క్రీడామైదానం ప్రారంభం
కొత్తగూడెం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు రహిత రాష్ట్రంగా మార్చేందుకు సరిహద్దుల్లో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యంగా సీసీ కెమెరాల ఏర్పాటుతో మావోయిస్టు కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయగలుగుతున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ములుగు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన గురువారం కొత్తగూడెం వచ్చారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో హేమచంద్రాపురం చేరుకున్న డీజీపీకి భద్రాద్రి ఎస్పీ వినీత పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసు గౌరవవందనం స్వీకరించిన ఆయన కార్యాలయ ఆవరణలో నిర్మించిన క్రీడామైదానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ చర్యల అమల్లో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పోలీసుల కృషి అభినందనీయమన్నారు. ఈ రెండు జిల్లాల ప్రజలు పోలీసులకు అండగా ఉండటంతో మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణలో సఫలీకృతమవుతున్నారన్నారు. ప్రస్తుతం మావోయిస్టులకు ప్రజలనుంచి ఎలాంటి మద్దతు లేదని, శాంతిభద్రతలు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసుశాఖకు అందిస్తున్న సహకారం అమోఘమన్నారు. ఛత్తీ్‌సగఢ్ సరిహద్దుల్లో సీసీకెమెరాల ఏర్పాటుతో మావోయిస్టుల కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని, ఈ క్రమంలోనే రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారుతోందన్నారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని, అందువల్ల ఎన్నో పరిశ్రమలు వచ్చాయన్నారు. తెలంగాణ, ఛత్తీ్‌సగఢ్ సరిహద్దులోని పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజల సహకారం, సీఆర్పీఎఫ్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా నియంత్రించగలుగుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మారుమూల గ్రామాల ప్రజలకు అందించడంతో పాటు విద్యా, వైద్యం, రోడ్లు లాంటి కనీస సౌకర్యాలు దక్కేలా పోలీసులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయనవెంట డీజీపీ వెంట అడిషనల్ డీజీపీ గ్రేహౌండ్స్ శ్రీనివాసరెడ్డి, నార్త్‌జోన్ అడిషనల్ డీజీపీ నాగిరెడ్డి, సీఆర్పీఎఫ్ సౌత సెక్టార్ ఐజీ మహేషచంద్రలడ్డా, ఎస్ఐబీ ఆపరేషన చీఫ్ ప్రభాకర్‌రావు, భద్రాద్రి, ములుగు ఎస్పీలు వినీత, సంగ్రామ్‌సింగ్ పాటిల్, కొత్తగూడెం, ములుగు ఎఎస్డీలు సాయిమనోహర్, గౌస్ అలాం, అడిషనల్ ఎస్పీ శోభనకుమార్, రెండు జిల్లాల పోలీసు అధికారులున్నారు.
కొనసాగుతున్న దేహదారుఢ్య పరీక్షలు
ఏడోరోజు 1003మంది పోలీసు అభ్యర్థుల హాజరు
ఖమ్మం క్రైం, డిసెంబరు 15 : పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఖమ్మం పరేడ్ మైదానంలో జరుగుతున్న ఈ పరీక్షలకు ఏడోరోజైన గురువారమ మొత్తం 1,238 అభ్యర్థులకు గాను 1,003మంది హాజరయ్యారు. వీరిలో తుది పరీక్షకు 613మంది అర్హత సాధించారు. అభ్యర్థుల అనారోగ్య కారణాలను చూపుతూ వైద్యులు ధ్రువీకరించిన పత్రాలను పరిశీలించి అభ్యర్థులను వైద్యుల పరిశీలన అనంతరం సదరు అభ్యర్థులకు రిక్రూట్మెంట్ బోర్డు ఇతర తేదీల్లో హాజరయ్యేందుకు అనుమతించారు. పరీక్షల వద్ద ఏర్పాట్లను పోలీసుకమిషనర్ విష్ణు యస్ వారియర్ తెల్లవారుజామునే పరిశీలించారు.