నియోజకవర్గాల్లోనే ఉండాలి

ABN , First Publish Date - 2022-11-15T23:41:35+05:30 IST

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యనేతలంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని, ఇకపై హైదరాబాదులో కాకుండా నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రజలకు సమయం కేటాయించాలని సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

నియోజకవర్గాల్లోనే ఉండాలి
సమావేశంలో మాట్లాడుతున్న నేతలు

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలి

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలకు కేసీఆర్‌ దిశానిర్దేశం

ఖమ్మం, నవంబరు 15(ఆంధ్రజ్యోతిప్రతినిధి): మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యనేతలంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా పనిచేయాలని, ఇకపై హైదరాబాదులో కాకుండా నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రజలకు సమయం కేటాయించాలని సీఎం కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన పార్టీ రాష్ట్రస్థాయి నేతల సమావేశంలో ఆయన వచ్చేఎన్నికలే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహా లు, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గాల్లో బాధ్యతలు తీసుకుని పార్టీని మరింత బలోపేతం చేయడంతోపాటు విజయమేలక్ష్యంగా పక్కా కార్యాచరణతో పనిచేయాలని సూచించారు. అనంతరం మంత్రి పువ్వాడ అధ్యక్షతన ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సీఎం ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే ఎన్నికల్లో పదికి పది స్థానాలను కైవసం చేసుకునేలా పార్టీని బలోపేతం చేసేలా నియోజకవర్గాల వారీగా కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించారు. పార్టీపట్ల, ప్రభుత్వం పట్ల జిల్లా ప్రజల్లో ఆదరణ ఉందని, క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషిచేద్దామని, అర్హులందరికీ పథకాలు మరింత పారదర్శకంగా అందేలా చూద్దామన్నారు. 18న సత్తుపల్లిలో జరిగే రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి అభినందన సభ గురించి చర్చించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, టీఆర్‌ఎస్‌ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరే్‌షరెడ్డితో పాటు ఉమ్మడిజిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T23:41:36+05:30 IST