సాగుసేవలకు ర్యాంకులు

ABN , First Publish Date - 2022-03-05T07:43:44+05:30 IST

సాగుసేవలకు ర్యాంకులు

సాగుసేవలకు ర్యాంకులు
పంటల సర్వే చేస్తున్న ఏఈవో (ఫైల్‌)

అధికారుల పనితీరు మెరుగుపరిచేలా కొత్త విధానం

ప్రధానంగా నాలుగు అంశాలపై విశ్లేషణ

ఏఈవోల నుంచి డీఏవోల వరకు గ్రేడ్‌లు

ఖమ్మం వ్యవసాయం, మార్చి 4: వ్యవసాయశాఖ పని తీరును మరింత మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అధికారుల పని తీరును బట్టి గ్రేడ్‌లు, ర్యాంకులను ప్రకటించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ప్రతివారం అధికారులు చేపట్టిన పనుల వివరాలను ప్రతి సోమవారం ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగానే అధికారుల పని తీరుపై విశ్లేషణ చేసి గ్రేడ్‌లను ప్రకటిస్తారు. జిల్లాలో సుమారు 7లక్షలకు పైగా సాగుభూమి ఉంది. లక్షా 50వేల మంది రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. జిల్లాలో 129 క్లస్టర్ల పరిధిలో పూర్తిస్థాయిలో 129ఏఈవోలు పని చేస్తున్నారు. 21మండలాల్లో ఏవోలు విధులు నిర్వహిస్తున్నారు. జనవరి 1నుంచి ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే గడిచిన నెలన్నర రోజుల్లో ప్రకటించిన గ్రేడ్‌లలో జిల్లా అధికారుల పనితీరు మాత్రం వెనుకబడినట్లే కనిపిస్తోంది.  

పనితీరుకు మార్కులు

ప్రధానంగా నాలుగు అంశాలలో వ్యవసాయశాఖ అధికారుల పని తీరును విశ్లేషించి ప్రభుత్వం గ్రేడ్‌లు, ర్యాంకుల విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో పంటల నమోదు, పీఎం కిసాన్‌ సమ్మాన్‌యోజన, రైతు బీమా, ఎరువులు, విత్తనాలలో క్వాలిటీ కంట్రోల్‌ను విశ్లేషించి గ్రేడింగ్‌ ర్యాంకులను ప్రకటిస్తారు. పంటల వివరాల నమోదుకు 40మార్కులు, పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజనకు 30మార్కులు, రైతు బీమాకు 20మార్కులు, క్వాలిటీ కంట్రోల్‌కు రూ.10మార్కులు మొత్తం 100 మార్కులను కేటాయించి ఈ మార్కుల ఆధారంగానే గ్రేడ్‌లను ప్రకటించే అవకాశం ఉంటుంది. అధికారుల పనితీరుతో పాటు రాష్ట్రస్థాయిలో జిల్లా ర్యాంకును కూడా వెల్లడిస్తారు.  

అన్ని స్థాయిల్లో పర్యవేక్షణ

వ్యవసాయ శాఖలో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారి వరకు పని తీరుతో గ్రేడింగ్‌ ర్యాంకులను కేటాయిస్తారు. ఏఈవోలను మొదలుకొని జిల్లా అధికారి వరకు క్షేత్ర స్థాయి పరిశీలన చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పంటల నమోదులో సర్వే నెంబర్‌, రైతులు సాగు చేేస పంటల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. శాంపిల్‌గా ఒక గ్రామంలో నాలుగైదు సర్వే నెంబర్లను కేటాయించి క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని రాష్ట్ర కమిషనరేట్‌ నుంచే ఆదేశాలను జారీ చేస్తారు. పీఎం కిసాన్‌ సమ్మాన్‌యోజన ఫథకం కింద అరుపలైన రైతులకు పెట్టుబడి సహాయం అందే విధంగా బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌, ఇతర వివరాలు, రిజిసే్ట్రషన చేసుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.  రైతుబీమా పథకం కింద ప్ర మాదవశాత్తు రైతు మరణించిన వారం రోజుల్లోనే బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించే విధంగా ఏఈవోలు పూర్తి వివరాలను ేసకరించి రైతు కుటుంబానికి సహాయాన్ని అందించాల్సి ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్‌ కింద రైతులు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు వాడే విధంగా చర్యలు తీసుకుంటూ లక్ష్యానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. పురుగుల మందుల వాడకంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇలా నాలుగు అంశాలపై దృష్టి సారించిన అధికారుల పని తీరునుబట్టి ప్రతివారం గ్రేడ్‌లు, ర్యాంకులను ప్రకటిస్తారు.

Updated Date - 2022-03-05T07:43:44+05:30 IST