అకాలవర్షం
ABN , First Publish Date - 2022-01-13T05:52:19+05:30 IST
అకాలవర్షంతో ఖమ్మం జిల్లా రైతులకు అనుకోని నష్టం వాటిల్లింది. బుధవారం ఉదయం నుంచి తీవ్ర చలిగాలులు వీస్తూ.. ఆకాశం మేఘా
ఖమ్మం జిల్లాలో పలు పంటలకు నష్టం
పడిపోయిన మొక్కజొన్న.. కల్లాల్లో తడిచిన మిర్చి, ధాన్యం
ఖమ్మం, జనవరి 12 (ఆంధ్రజ్యోతిప్రతినిధి) : అకాలవర్షంతో ఖమ్మం జిల్లా రైతులకు అనుకోని నష్టం వాటిల్లింది. బుధవారం ఉదయం నుంచి తీవ్ర చలిగాలులు వీస్తూ.. ఆకాశం మేఘావృతమై ఉండగా.. మధ్యాహ్న సమయంలో పలు మండలాల్లో వర్షం పడింది. ముఖ్యంగా కూసుమంచి, నేలకొండపల్లి, ఖమ్మంరూరల్, కొణిజర్ల, చింతకాని, ముదిగొండ, వైరా, తిరుమలాయపాలెం, రఘునాధపాలెం తదితర మండలాల్లో పంటలకు నష్టం కలిగింది. వానకు గాలి కూడా తోడవడంతో కొన్నిచోట్ల మొక్కజొన్న నేలకొరగగా, కొన్ని చోట్ల కల్లాలపై ఆరబెట్టిన మిర్చి, ధాన్యం తడిసింది. జిల్లాలో యాసంగి పంటగా వేల ఎకరాల్లో మొక్కజొన్న వేయగా.. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మొక్కజొన్న నేలకొరిగింది. అలాగే అంతంత మాత్రంగా కాసిన మిర్చిని వ్యయప్రయాసలకోర్చి కోసి.. కల్లాల్లో ఆరబోసుకోగా అవీ అకాలవర్షానికి తడిచాయి. దీంతో రైతులు వాటిని కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అలాగే పలుచోట్ల కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిచింది. ఇక ఖమ్మం నగరంలోని ప్రధాన రహదారి సహా.. పలు అంతర్గత రోడ్లు జలమయమయ్యాయి. వ్యవసాయమార్కెట్‌లోని పత్తియార్డులో నీరు చేరడంతో పంటను తీసుకొచ్చిన రైతులు ఇబ్బందులు పడ్డారు. యార్డులోపల కాకుండా ఆవరణలో వేసిన కొన్ని పత్తిబస్తాలు వర్షానికి తడిశాయి.