గుంతలమయంగా రోడ్లు

ABN , First Publish Date - 2022-03-06T04:45:43+05:30 IST

వైరా-జగ్గయ్యపేట, మధిర ఆర్‌అండ్‌బీ రోడ్డులో పలుచోట్ల పైపులైన్లు లీకవుతూ ప్రమాదకర రీతిలో గుంతలేర్పడ్డాయి.

గుంతలమయంగా రోడ్లు
సోమవరం-తాటిపూడి గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ నడిరోడ్డు అడుగుభాగం నుంచి నీరు లీకవుతూ ఏర్పడిన గుంత

రోడ్డు అడుగుభాగంలో లీకవుతున్న పైపులైన్లు 

 గుంతల్లో నీరు నిలిచి తరచూ ప్రమాదాలు

వైరా, మార్చి 5: వైరా-జగ్గయ్యపేట, మధిర ఆర్‌అండ్‌బీ రోడ్డులో పలుచోట్ల పైపులైన్లు లీకవుతూ ప్రమాదకర రీతిలో గుంతలేర్పడ్డాయి. ఆర్‌అండ్‌బీ రోడ్డులో నడిమధ్యలో అడుగుభాగాన నెలరోజుల నుంచి పైపులైన్లు లీకవుతూ గుంతలేర్పడి నీరు చేరి రాకపోకలకు తీవ్ర అసౌకర్యంగా తయారైంది. సోమవరం-తాటిపూడి గ్రామాల మధ్య వైరా రిజర్వాయర్‌ కుడికాల్వ నుంచి దాదాపు కిలోమీటర్‌ దూరం పంటల కోసం కొంతమంది రైతులు పైపులైన్‌ నిర్మించారు. తరచూ ఆపైపులైన్‌ ఆర్‌అండ్‌బీ రోడ్డు మధ్యలో అడుగుభాగంలో లీకవుతూ భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. ఆగుంతల్లో నీరు నిలిచి రోడ్డుపై తిరుగుతున్న వాహనచోదకులకు ఇబ్బందికరంగా మారాయి. ద్విచక్రవాహన చోదకులు గుంతల్లో ఏర్పడి ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతల్లో నిలిచిన నీరు పక్కన వెళ్లే వారిపై పడుతూ అసౌకర్యంగా తయారైంది. నెలరోజుల నుంచి ఇక్కడ ప్రమాదకర పరిస్థితులున్నా పట్టించుకొనే వారే కరువయ్యారు. ఇకపోతే సోమవరం గ్రామంలో పాఠశాల సమీపంలో రోడ్డు నడిమధ్యలో అడుగుభాగాన భగీరథ పైపులైన్‌ రెండునెలలుగా లీకవుతుంది. అక్కడ గుంత ఏర్పడి నీ రు నిలిచి ఇబ్బందికరంగా ఉంది. స్థానికులు ఒకట్రెండుసార్లు తమకు అం దుబాటులో ఉన్న కంకరను ఆగుంతలో పోసినప్పటికీ పైపులైన్‌ లీకుల వలన నీరు వచ్చిఉండటంతో మళ్ళీ గుంతగానే ఏర్పడుతుంది. వీటికితోడు సోమవరం, వైరా, తాటిపూడి, జింకలగూడెం, రెబ్బవరం, గొల్లపూడి, పాలడుగు మధ్య ఈ రోడ్డు మధ్య గుంతలమయంగా ఉండటంతో వాహనచోదకులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. వెంటనే ఆర్‌అండ్‌బీ అధికారులు తగు చర్యలు తీసుకొని మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


Updated Date - 2022-03-06T04:45:43+05:30 IST