పీహెచ్‌సీకే పరిమితం చేస్తారా?

ABN , First Publish Date - 2022-12-30T23:02:00+05:30 IST

వైరా.. పేరుకే నియోజకవర్గం. కానీ ఇప్పటికే ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉంది. అనారోగ్యానికి గురయితే ఇక్కడి ప్రజలకు ఖమ్మమే దిక్కు. రాష్ట్రీయ రహదారి ఈ ప్రాంతం మీదుగా వెళ్తుండటంతో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి

పీహెచ్‌సీకే పరిమితం చేస్తారా?
వైరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

వైరా, డిసెంబరు 30: వైరా.. పేరుకే నియోజకవర్గం. కానీ ఇప్పటికే ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉంది. అనారోగ్యానికి గురయితే ఇక్కడి ప్రజలకు ఖమ్మమే దిక్కు. రాష్ట్రీయ రహదారి ఈ ప్రాంతం మీదుగా వెళ్తుండటంతో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. క్షతగాత్రులను ఖమ్మం తరలించేలోపు జరగాల్సిన నష్టం జరుగుతోంది. పైగా ఖమ్మం పెద్దాసుపత్రిపై ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో బాధితులకు సకాలంలో వైద్యం అందడం లేదు. ఈనేపథ్యంలో వైరాలో ఏరియా ఆసుపత్రి, ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ప్రజల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలోని అన్ని ప్రాంతాలకు మధ్య కేంద్రంగా ఉన్న వైరాలో ఏరియా ఆసుపత్రి, ట్రామా సెంటర్‌ ఏర్పాటు చేయటం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించేందుకు అవకాశాలు న్నాయి. ఖమ్మంలో ఉన్న ఆసుపత్రిని నూతనంగా మంజూరైన మెడికల్‌ కాలేజీకి అనుసంధానం చేసిన దరిమిలా ఆ ఆసుపత్రి స్థానంలో ఏరియా ఆసుపత్రిని మరోచోట నెలకొల్పాల్సిన అవసరముంది.

వైరాలో ప్రతిపాదనలకే పరిమితమైన 30పడకల ఆసుపత్రి

వైరాలో ప్రస్తుతం పది పడకలస్థాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉంది. ఇక్కడ వైద్యసేవలు అంతంతమా త్రంగానే ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైరా పీహెచ్‌సీని 30 పడకల ఆసుపత్రిస్థాయికి పెంచేందుకుగానూ 2004 ఫిబ్రవరి 27న అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అయితే ఆతర్వాత అధికార మార్పిడి జరిగిన నేపథ్యంలో దాన్ని గురించి పట్టించుకొనేవారే కరువయ్యారు. 30పడకల ఆసుపత్రి నిర్మాణం పునాదిరాయికే పరిమితమైంది.

ప్రస్తుత తరుణంలో...

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్‌ కాలేజీకి అనుసంధానం చేయడంతో ఇప్పుడు వైరాలో ఏరియా ఆసుపత్రిని ఏర్పాటు చేసే అవకాశముంది. వైద్యఆరోగ్యశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా వైరాపైనే ఆసక్తి కనపరుస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే అధికార పార్టీలోని రాజకీయ ఆధిపత్యంలో ఏరియా ఆసుపత్రిని జిల్లాలోని వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేయించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో ఏరియా ఆసుపత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈ క్రమంలోనే వైరా ఎమ్మెల్యే రాములునాయక్‌ కూడా ఏరియా ఆసుపత్రిని వైరాలో ఏర్పాటు చేయాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులకు, ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌కు నివేదించారు.

ఖమ్మానికి సమీపంలో...

భౌగోళికంగా వైరాకు రోడ్డు రవాణా సౌకర్యం ఎంతో మెరుగ్గా ఉంది. సత్తుపల్లి, వేంసూరు నుంచి కానీ, ఎర్రుపాలెం, మధిర నుంచి కానీ, నేలకొండపల్లి, కూసుమంచి నుంచి కానీ, కారేపల్లి నుంచి కానీ వైరా అన్ని ప్రాంతాలకు సమానదూరంలో జిల్లాకు మధ్యలో ఉంది. నూతన జిల్లా కలెక్టరేట్‌ వెంకటాయపాలెం సమీపంలోనే ఏర్పాటు చేస్తుండటంతో వైరా అక్కడి నుంచి కేవలం 18కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది. ఖమ్మానికి 25కిలోమీటర్ల దూరంలో ఉంది. జాతీయ ప్రధాన రహదారిలో ఉన్న వైరాలో ఏరియా ఆసుపత్రి ఏర్పాటుచేయటం ద్వారా అన్ని ప్రాంతాలకు అనువైనదిగా ఉంది. గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి ఇక్కడ వైరాకు అనుసంధానంగా ఉంది. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలు కూడా సత్తుపల్లి, కల్లూరు, కొణిజర్ల, తల్లాడ, వైరాలోనే.

ట్రామా సెంటర్‌ ఏర్పాటు చేస్తే...

ఏరియా ఆసుపత్రితోపాటు ట్రామా సెంటర్‌ ఏర్పాటు చేస్తే అనేకమంది వైద్యనిపుణులు ఇక్కడ సేవలందించే అవకాశముంది. సిటీ స్కాన్‌, ఎక్స్‌రేతోపాటు శవపరీక్షలు చేసే వీలుంటుంది. జనరల్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్‌, న్యూరోసర్జన్‌, జనరల్‌ సర్జన్‌, పంటి, ముక్కు వైద్యనిపుణులు కూడా ఈ ట్రామా సెంటర్లో అందుబాటులో ఉంటారు.

ఏర్పాటుకు ఎంతో అనుకూలం...

ఏరియా ఆసుపత్రి, ట్రామా సెంటర్‌ ఏర్పాటుకు అనువైన వాతావరణం వైరాలో ఉంది. దాదాపు రూ.50కోట్ల విలువైన శిథిలావస్థలో ఉన్న ఎన్నెస్పీ క్వార్టర్ల స్థలాన్ని వీటి ఏర్పాటుకు వినియోగించుకోవచ్చు. జాతీయ ప్రధాన రహదారి పక్కనే వైరా రిజర్వాయర్‌ రోడ్డులో మూడున్నర ఎకరాల స్థలం ఉంది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న ఎన్నెస్పీ క్వార్టర్లను ప్రైవేట్‌ వ్యక్తులు దర్జాగా అనుభవిస్తున్నారు. ఒకవేళ ఈ స్థలమే కాకుండా వైరా రిజర్వాయర్‌ ఆనకట్ట పక్కన దాదాపు ఏడెనిమిది ఎకరాల భూమి కూడా అందుబాటులో ఉంది. వీటిలో ఆసుపత్రి ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం ఉంది. రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్‌ గడల శ్రీనివాసరావు వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందినవారే కావడంతో ఆయన ప్రత్యేక దృష్టిసారించి ఏరియా ఆసుపత్రి, ట్రామా సెంటర్‌ను వైరాలో ఏర్పాటు చేయించేలా చర్యలు తీసుకోవాలని ఈప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-12-30T23:02:02+05:30 IST