ఆర్టీసీకి ఆయిల్‌ కష్టం

ABN , First Publish Date - 2022-02-23T05:46:40+05:30 IST

ఆర్టీసీకి ఆయిల్‌ కష్టం

ఆర్టీసీకి ఆయిల్‌ కష్టం
ఖమ్మం బైపాస్‌ రోడ్డులో డీజిల్‌ కోసం బస్సుల క్యూ

డీజిల్‌కోసం ప్రైవేటు బంకులవద్ద బస్సుల బారులు 

కంపెనీలు బల్క్‌ కొనుగోళ్ల ధరలు పెంచడమే కారణం

ఖమ్మం ఖానాపురం హవేలీ, ఫిబ్రవరి 22: ఆర్టీసీ ఏర్పడినప్పటినుంచి సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని పరిస్థితి ఇప్పుడు వింత పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సులకు వినియోగించే డీజిల్‌ను సంస్థ బల్క్‌లో వరంగల్‌, రాజమండ్రిలనుంచి కొనుగోలు చేసి డిపోల్లోనే ప్రత్యేకంగా బంక్‌లు ఏర్పాటు చేసుకుని బస్సులకు వినియోగించేవారు. అయితే తాజాగా ఆయిల్‌ కంపెనీలు బల్క్‌కొనుగోళ్ల ధరలు పెంచడంతో ప్రైవేటు బంకుల్లో లీటర్‌ డీజిల్‌ రూ.94.57లకు లభిస్తుండగా ఆర్టీసీకి సొంత డీలర్‌షిప్‌ లేకపోవడంతో రూ.98లకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ధరతో డీజిల్‌ వినియోగిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీకి రోజుకు రూ.80వేల అదనపు భారం పడనుంది. ఈ ధరల పెంపు మూడురోజుల క్రితమే అమల్లోకి వచ్చినా డిపోల్లోని బంకుల్లో ఉన్న నిల్వలను ఈ మూడురోజులు వినియోగించారు. మంగళవారం ఆ నిల్వలు నిండుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు బంకుల్లో డీజిల్‌ పోయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం డిపోలకు చెందిన ఆర్టీసీ బస్సులు డీజిల్‌ కోసం రోడెక్కాయి. ఒక్క ఖమ్మం డిపోకు చెందిన 350బస్సులు నగరంలోని బైపాస్‌ రోడ్డులో బస్టాండ్‌కు సమీపంలోని ఓ బంక్‌ వద్ద బారులుదీరాయి. ఒక్కో ఆర్టీసీ బస్సుకు రోజుకు అవి ప్రయాణించే దూరాన్ని బట్టి 100లీటర్ల వరకు డీజిల్‌ పడుతుంది. అదే హెయిర్‌(అద్దె) బస్సులకు 200లీటర్ల డీజిల్‌ కొట్టిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆర్టీసీ సంస్థకు సొంత డీలర్‌షిప్‌ లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. సొంత డీలర్‌షిప్‌ ఉంటే ఆర్టీసీకి డీజిల్‌ భారం తగ్గడంతోపాటు అదనపు ఆదాయం కూడా వస్తుందని చెబుతున్నారు. ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టిసారిస్తే బాగుంటుందని డ్రైవర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాము రోజంతా 500కిలోమీటర్లు బస్సు తిప్పి మళ్లీ డీజిల్‌ కోసం గంటకొద్దీ బంకుల వద్ద నిరీక్షించడం బాధాకరమన్నారు. ఈ విషయంపై ఖమ్మం ఆర్టీసీ డీఎం శంకర్రావును వివరణ కోరగా ఒక వారం రోజుల వరకు ప్రైవేటు బంకుల్లో డీజిల్‌ కొట్టించే పరిస్థితి ఉంటుందని వెల్లడించారు. 



Updated Date - 2022-02-23T05:46:40+05:30 IST