మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-03-06T04:31:15+05:30 IST

మావోయిస్టులకు నగదు చేరవేస్తున్న నలుగురు సానుభూతి పరులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్‌
వివరాలు వెల్లడిస్తున్న ఏఎస్పీ

రూ3.34లక్షల నగదు స్వాధీనం

దుమ్ముగూడెం మార్చి 5: మావోయిస్టులకు నగదు చేరవేస్తున్న నలుగురు సానుభూతి పరులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ3.34 లక్షల నగదు, కారు, రెండు ద్విచక్రవాహనాలు, నాలుగు మొబైల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ రోహిత్‌రాజు శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం.....ఈనెలన ఎస్‌ఐ రవికుమార్‌ సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో కలిసి పెదబండిరేవు అడ్డరోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. భద్రాచలం నుంచి చర్ల వైపుగా ఒక కారు, రెండు ద్విచక్రవాహనాలపై వెళ్తున్న నలుగురు వ్యక్తులు అనుమా నాస్పదంగా కనిపించారు. వారిని పోలీసులు ఆపగా,  పారిపోయేందుకు ప్రయత్నించి దొరికిపోయారు. విచారణ జరపగా నిషేదిత మావోయిస్టు పార్టీకు సానుభూతి పరులుగా ఉంటున్నట్లు వారంతా అంగీకరించారు. మావోయిస్టులకు నగదు, విప్లవ సాహిత్యాన్ని చేరవేయడానికి చర్ల మండలం కొండెవాయికి వెళ్తున్నట్లు తెలిపారు. వీరిని చర్ల మండలం బోదనవెల్లికి చెందిన వర్సా రాజు, ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మాపురానికి చెందిన కొమరం నాగేశ్వరావు, హైదరాబాదుకు చెందిన గేదెల శ్రీనివాసరావుతోపాటు ఒక బాలనేరస్తుడిగా గుర్తించారు. హైదరాబాదుకు చెందిన కాంట్రాక్టరు ప్రభాకర్‌, హన్మకొండకు చెందిన కొమరం రాంమ్మూర్తి నుంచి నగదు సేకరించి తీసుకెళ్తున్నట్లు నిందితులు అంగీకరించారు. కాంట్రాక్టర్లు, వ్యాపా రస్తులెవరూ మావోయిస్టు పార్టీకి సహాయ, సహకారాలు అందించవద్దని ఏఎస్పీ కోరారు. నక్సల్స్‌ వల్ల ఆదివాసీ గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయని తెలిపారు. చందాల కోసం ఎవరైనా బెదిరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో సీఐ దోమల రమేష్‌, ఎస్‌ఐ రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T04:31:15+05:30 IST