చప్టా నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారుచేయండి

ABN , First Publish Date - 2022-03-05T05:39:13+05:30 IST

కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ ఆదేశాలతో శుక్రవారం జడ్పీ సీఈవో, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ (ఇన్‌చార్జ్‌) అయిన వీవీ.అప్పారావు వైరా మునిసిపాలిటీకి కేటాయించిన డంపింగ్‌యార్డు స్థలాన్ని పరిశీలించారు.

చప్టా నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారుచేయండి

 ఇంజనీరింగ్‌ అధికారులకు జడ్పీ సీఈవో అప్పారావు ఆదేశం

 డంపింగ్‌యార్డు స్థలం పరిశీలన 

వైరా, మార్చి 4: కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌ ఆదేశాలతో శుక్రవారం జడ్పీ సీఈవో, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ (ఇన్‌చార్జ్‌) అయిన వీవీ.అప్పారావు వైరా మునిసిపాలిటీకి కేటాయించిన డంపింగ్‌యార్డు స్థలాన్ని పరిశీలించారు. వైరా రిజర్వాయర్‌ అలుగుల ముందుభాగంలో తల్లాడ మండలం కొడవటిమెట్ట రెవెన్యూ పరిధిలో మూడెకరాల స్థలాన్ని వైరా మునిసిపాలిటీ డంపింగ్‌యార్డు కోసం కేటాయిస్తూ ఇటీవల కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో డంపింగ్‌యార్డు స్థల స్వరూపాన్ని అప్పారావు పరిశీలించారు. రిజర్వాయర్‌ అలుగుల్లోనుంచి చెత్తాచెదారంతో మునిసిపాలిటీ వాహనాలు డంపింగ్‌యార్డుకు వెళ్లాల్సి ఉంది. అయితే సరైన రహదారి సౌకర్యం లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. వర్షాకాలంలో రిజర్వాయర్‌కు వరదలు వచ్చి అలుగుల ద్వారా నీరు పొంగి ప్రవహించిన సమయంలో ఇప్పుడు ఏర్పాటుచేయనున్న డంపింగ్‌యార్డుకు వాహనాలు వెళ్లటానికి వీలులేదు. దాంతో అలుగుల ముందుభాగంలో రెండు చప్టాలు నిర్మించాల్సిన విషయం అప్పారావు దృష్టికి వచ్చింది. అలాగే డంపింగ్‌యార్డుకు అవసరమైన కాంపౌండ్‌వాల్‌ నిర్మాణం తదితర అంశాలను చర్చించారు. వెంటనే చప్టాలు ఇతర నిర్మాణాలకు సంబంధించి అవసరమైన నిధులకుగానూ ప్రతిపాదనలు తయారుచేయాలని మునిసిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఇంకా పలు సమస్యల గురించి పరిశీలించారు. మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ సూతకాని జైపాల్‌, ముళ్లపాటి సీతరాములు, కమిషనర్‌ ఎన్‌.వెంకటపతిరాజు పాల్గొన్నారు.


Updated Date - 2022-03-05T05:39:13+05:30 IST