పునాదులకే పరిమితం
ABN , First Publish Date - 2022-08-25T05:53:11+05:30 IST
కొత్తగూడెం పట్టణంలో నిర్మాణ దశలోనే ఇంటిగ్రేటేడ్ (సమీకృత) మార్కెట్ పనులు నిలిచిపోయాయి
నిర్మాణ దశలోనే ఆగిన సమీకృత మార్కెట్ పనులు
కొత్తగూడెం టౌన్, ఆగస్టు 24: కొత్తగూడెం పట్టణంలో నిర్మాణ దశలోనే ఇంటిగ్రేటేడ్ (సమీకృత) మార్కెట్ పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. పట్టణంలోని రైతుబజారు సమీపంలో నిర్మాణం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పునాదులకే పరిమితమైంది. ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం రూ. 4. 50కోట్ల నిధులను మంజూరు చేసింది. నిర్మాణ పనులకు సంబంధించి మార్చిలో రైతుబజారు సమీపంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరారవు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన జరిగిన ఆరు నెలలు అవుతున్నా.. పునాదులు, బేస్మెంట్ లెవల్లోనే మార్కెట్ పనులు నత్తనడకన నడుస్తోన్నాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం సమీపంలో ఉన్న రైతుబజారును పూర్తిగా తొలగించారు. రైతుబజారులో సుమారు 130మంది రైతులు కొత్తగూడెం, జూలూరుపాడు, చంద్రుగొండ, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి తదితర ప్రాంతాల నుంచి కూరగాయలు, ఆకుకూరలు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. మార్కెట్ నిర్మాణం కోసం రైతులందరికి సమీపంలో తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంకల్పించినప్పటికి పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. రైతుబజారులో కూరగాయలు అమ్ముకునే రైతులకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి అయితే అందులో గదులను కేటాయించే విధంగా అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు పలువురు రైతులు తెలిపారు. కొత్తగూడెం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పూర్తి అయితే వినియోగదారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వెజ్,నాన్వెజ్ ఒకే ప్రదేశంలో లభించే అవకాశాలు ఉన్నాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను వేగవంతం చేసి ప్రజలకు మార్కెట్ సేవలను అందుబాటులో తేవాలని ప్రజలు కోరుతున్నారు.