ఘంటసాల నుంచి ఎంతో నేర్చుకున్నా

ABN , First Publish Date - 2022-12-05T00:48:33+05:30 IST

తొలితరం అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఆయన పేరిట అవార్డు అందుకోవటం తన పూర్వజన్మ సుకృతమమని ప్రముఖ సినీ నేపథ్య గాయని, గానకోకిల పి.సుశీల అన్నారు.

ఘంటసాల నుంచి ఎంతో నేర్చుకున్నా
గానకోకిల సుశీలకు ఘంటసాల పురస్కారాన్ని అందిస్తున్న హీరో సుమన్‌, నిర్వాహకులు

4-ks-06.jpgకార్యక్రమానికి హాజరైన సంగీత అభిమానులు

ఆయన పేరిట అవార్డు అందుకోవడం అదృష్టం

50 ఏళ్ల తరువాత ఖమ్మం వచ్చా

సినీ నేపథ్య గాయని, .‘గాన కోకిల’ పి.సుశీల

ఘనంగా ఘంటసాల పురస్కార ప్రదానం

ఖమ్మం సాంస్కృతికం, డిసెంబరు 4: తొలితరం అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని, ఆయన పేరిట అవార్డు అందుకోవటం తన పూర్వజన్మ సుకృతమమని ప్రముఖ సినీ నేపథ్య గాయని, గానకోకిల పి.సుశీల అన్నారు. ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆదివారం రాత్రి ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో సుధాస్‌ ఎంటర్‌ టైనమెంట్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘భలేమంచి రోజు.. ఘంటసాల సంస్మరణ గీతాలు’ కార్యక్రమంలో ఆమెకు నిర్వాహకులు ఘంటసాల స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సభలో సుశీల మాట్లాడుతూ ఘంటసాలతో తనకు గల సంగీతానుబంధాన్ని గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు. తన పాటల ప్రతిభకు ఘంటసాల మరింత మెరుగులద్దారని, తామిద్దరిది ఒకే ఊరు కావటం తనకు ఎంతో గర్వకారణమన్నారు. తిరుమల వేంకటేశ్వరుని బంగారు వాకిలిలో పాటలు పాడే అవకాశం ఆయనకే దక్కిందన్నారు. అభిమానులు ఘంటసాలకు కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని, తనకు మాత్రం విగ్రహాల ఏర్పాటుపై ఆసక్తి లేదని, తన మరణానంతరం విగ్రహాలను ఏర్పాటు చేయొద్దన్నారు. తాను 1970లో దివిసీమ ఉప్పెన బాధితులకు విరాళాలు సేకరించేందుకు సినీ కళాకారులతో కలిసి ఖమ్మం వచ్చానని గుర్తు చేసుకున్న సుశీల 50 ఏళ్ల తర్వాత ఖమ్మం రావడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం సినీహీరో సుమన మాట్లాడుతూ ఘంటసాల లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, మద్రా్‌సలో ఉన్నప్పుడు తనకు ఘంటసాల కుటుంబంతో పరిచయం ఉందన్నారు. అలాగే సుశీలను చూసేందుకు తాము మద్రాసులో ఆమె ఇంటి చుట్టూ తిరిగేవారమని గుర్తు చేసుకున్నారు. ఘంటసాల పాటల కార్యక్రమానికి ఇంతమంది తరలిరావటం ఖమ్మం ప్రజల సంగీతాభిరుచికి నిదర్శనమన్నారు. ఖమ్మం కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ మాట్లాడుతూ తాను సుశీలకు అభిమానినని తెలుగువారైన పి. సుశీల పలు భాషల్లో పాడి.. కళాకారులకు ఎల్లలేవని నిరూపించారన్నారు. కార్యక్రమంలో ఐఏఎస్‌ అధికారులు రఘునందన్‌రావు, అరుణ్‌కుమార్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి రవి పాడి, జడ్జి మురళి, తదితరులు మాట్లాడారు. ఇక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ హెచ.అరుణ్‌ కుమార్‌ పాట పాడి అందరినీ అలరించారు.

పులకించిన ఖమ్మం...

ఘంటసాల సినీగీతాల ఆలాపనలతో ఆదివారం ఖమ్మంనగరం పులకించింది. అమర గాయకుడు ఘంటసాల శతజయంతి సందర్భంగా భక్తరామదాసు కళాక్షేత్రంలో ఘంటసాల అర్దశత గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ గాయకులు బీఏ నారాయణతోపాటు హైదరాబాద్‌, విజయనగరం, విజయవాడ, బెంగళూరు, ప్రాంతాలకు చెందిన గాయనీ గాయకులు, స్దానిక కళాకారులు పలు సినిమాల్లోని ఘంటసాల గీతాలను ఆలపించారు. బిఏ నారాయణ, పలువురు గాయకులు ఘంటసాల కంఠాన్ని అనుకరిస్తూ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. కాండూరి గాయత్రి అనే కళాకారిణి నృత్య రూపకం ఆకట్టుకుంది. కార్యక్రమంలో సుధాస్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ నిర్వాహకులు ఎస్‌ సుదర్శన, విజయసారధి , ఎస్‌ రవికుమార్‌, టి.వాసుదేవ్‌, కొండాలక్ష్మణ్‌, మహ్మద్‌ అజీజ్‌, మహ్మద్‌ జానసాబ్‌, ఎస్‌వీ రమణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-05T00:48:34+05:30 IST