కొత్తమేడేపల్లిలో మౌళిక వసతులు కల్పించాలి

ABN , First Publish Date - 2022-12-07T23:51:40+05:30 IST

కొత్తమేడేపల్లిలో మౌళిక సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌కు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు వివరాలను ఎంపీపీ ఆరెం వరలక్ష్మి విలేకరులకు తెలిపారు.

కొత్తమేడేపల్లిలో మౌళిక వసతులు కల్పించాలి
కొత్తమేడేపల్లి గ్రామం

ఏన్కూరు, డిసెంబరు 7: కొత్తమేడేపల్లిలో మౌళిక సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌కు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు వివరాలను ఎంపీపీ ఆరెం వరలక్ష్మి విలేకరులకు తెలిపారు. గ్రామానికి చెందిన బాలిక ఇటీవల అనారోగ్యంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని ఖమ్మం నుంచి బైక్‌పై స్వగ్రామానికి తీసుకువచ్చిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై స్పందించిన ఏన్కూరు ఎంపీపీ ఆరెం వరలక్ష్మి నవంబరు పదో తేదీన గ్రామంలో పర్యటించారు. సమస్యలను తెలుసుకుని నవంబరు 22న రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, గవర్నర్‌ తమిళిసై, మానవ హక్కుల కమిషన్‌, ఎస్సీ, ఎస్టీ కమిష న్‌కు లేఖలు రాశారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ స్పందించి కలెక్టర్‌ వీపీ గౌతమ్‌కు గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రతులను బుధవారం ఎంపీపీ విలేకరులకు అందించారు. 15 ఏళ్ల క్రితం ఏర్పడిన ఈగ్రామంలో 250 జనాభా నివసిస్తోంది. వీరికి ఓటు హక్కుతోపాటు, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఉన్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. నేటికి విద్యుత్‌ సౌకర్యం లేక చీకటిలోనే మగ్గుతున్నారు.సరైన రహదారి,వైద్య సౌకర్యం లేక ఏటా ఇద్దరు, ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ఉన్న బాలవెలుగు పాఠశాల కూడా ఆరునెలల నుండి మూతపడింది. దీంతో చిన్నారులు విద్యకు దూరమయ్యారు. గ్రామాన్ని ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వివిధ ప్రజాసంఘాల నాయకులు, అధికారులు సందర్శించి గ్రామ సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - 2022-12-07T23:51:41+05:30 IST