‘విదేశీ’ వ్యవసాయ విజ్ఞాన మార్పిడికి.. ‘పైలెట్‌’గా ఖమ్మం డీసీసీబీ

ABN , First Publish Date - 2022-12-10T01:17:15+05:30 IST

నెదర్లాండ్‌కు చెందిన రాబో బ్యాంకు, అమెరికాకు చెందిన మాస్టర్‌కార్డ్‌, జర్మనీకి చెందిన బేయర్‌ కంపెనీ భాగస్వామ్యంతో అమల్లోకి రాబోతున్న ‘వ్యవసాయ విజ్ఞాన మార్పిడి’ కార్యక్రమానికి ఖమ్మం డీసీసీబీ ఎంపికైంది.

‘విదేశీ’ వ్యవసాయ విజ్ఞాన మార్పిడికి..  ‘పైలెట్‌’గా ఖమ్మం డీసీసీబీ
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నెదర్లాండ్‌ రాబో బ్యాంకు ప్రాజెక్టు సీనియర్‌ మేనేజర్‌ డిజోర్న్‌ వెల్లడి

9-CKN-2.jpeg.jpgపంటలను పరిశీలిస్తున్న రాబో బ్యాంక్‌ బృందం

జిల్లాలో పర్యటించిన నెదర్లాండ్‌ రాబో బ్యాంకు బృందం

మొబైల్‌ యాప్‌ ద్వారా రైతులకు సహకారం

ఆనలైన మార్కెటింగ్‌ ద్వారా అన్నదాతకు ప్రయోజనం

ఖమ్మం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): నెదర్లాండ్‌కు చెందిన రాబో బ్యాంకు, అమెరికాకు చెందిన మాస్టర్‌కార్డ్‌, జర్మనీకి చెందిన బేయర్‌ కంపెనీ భాగస్వామ్యంతో అమల్లోకి రాబోతున్న ‘వ్యవసాయ విజ్ఞాన మార్పిడి’ కార్యక్రమానికి ఖమ్మం డీసీసీబీ ఎంపికైంది. రాష్ట్రంలో ఖమ్మం, హైదరాబాదు, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో నాలుగు డీసీసీబీల పరిధిలో ఈపైలెట్‌ ప్రాజెక్టు తొలివిడతగా అమలుచేయబోతున్నారు. గత అక్టోబరు16న చేసిన రాష్ట్ర సహకార అభివృద్ధి బ్యాంకు (ట్యాప్కాబ్‌) ప్రతిపాదనలలో నాలుగు జిల్లాల డీసీసీబీలను ఎంపికచేశారు.

రైతులకు ఎంతో మేలు

అగ్రికల్చర్‌ ఎక్చ్సేంజ్‌ ప్రోగ్రాం (వ్యవసాయ విజ్ఞాన మార్పిడి)లో జిల్లా రైతులకు ఎంతో మేలు జరుగనుంది. వ్యవసాయపెట్టుబడులు, బీమా అమలు, మద్దతు ధర, దేశీయ మార్కెట్లకు రైతులు పంటలను ఎక్కువ ధరకు అమ్మేలా ఆనలైన మార్కెటింగ్‌ను అనుసంధానం చేయడం, రైతుల నికర ఆదాయం పెంచడంపై దృష్టిసారిస్తారు. రైతుల బ్యాకు రుణాలు సకాలంలో చెల్లించేలా చైతన్యపరచడం, బ్యాంకుల వ్యాపారం అభివృద్ధి చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ఈప్రక్రియలో భాగంగా శుక్రవారం నెదర్లాండ్‌ రాబో బ్యాంకు ప్రాజెక్టు బృందంతో కలిసి ఖమ్మం డీసీసీబీని సందర్శించింది. ఈబృందంలో నెదర్లాండ్‌ రాబో బ్యాంకు ప్రాజెక్టు సీనియర్‌ మేనేజర్‌ డిజోర్న్‌ , సెంట్రల్‌ మేనేజర్‌ మరియానా, ప్రాజెక్టు మేనేజర్‌ సిపోరా, రిటైర్డు నాబార్డు ఏజీఎం షరీఫ్‌ తదితరులు ఖమ్మం డీసీసీబీని సందర్శించి బ్యాంకు పనితీరు పరిశీలించారు. నెదర్లాండ్‌ బృందానికి ఖమ్మం డీసీసీబీ కార్యక్రమాలపై సీఈవో అట్లూరి వీరబాబు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన ద్వారా వ్యవసాయ పరిస్థితులు వివరించారు.

యాప్‌ మార్కెట్‌ ధరల అప్‌డేట్‌

సాగులో రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు, కావల్సిన ఎరువులు, పురుగుమందులు, పనిముట్లను పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా యాప్‌ ద్వారా అందజేస్తామని నెదర్లాండ్‌ రాబో బ్యాంకు ప్రాజెక్టు సీనియర్‌ మేనేజర్‌ డిజోర్న్‌ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు ఆనలైన మార్కెట్లను పరిచయంచేసి వాటి ద్వారా ఎక్కువరే ట్లకు పంట ఉత్పత్తులు అమ్ముకునేలా చూస్తామన్నారు. దశలవారీగా రైతులకు సహకారం అందిస్తామని తెలిపారు. అగ్రికల్చర్‌ ఎక్సేంజ్‌ ప్లాట్‌ఫామ్‌ కింద రైతులకు క్షేత్రస్థాయిలో అవసరాలు తీర్చడం, వాటిని అందుబాటులోకి తేవడం, రైతులను రిజిస్టర్‌ చేయడం, వారికి అవసరమైన ధరలకు కావాల్సిన పనిముట్లను అందిస్తామన్నారు. మొబైల్‌ యాప్‌ అప్లికేషన ద్వారా ఎనిమిది రాష్ట్రాలకు చెందిన180మార్కెట్‌ధరలకు ప్రతిరోజు రైతులకు అప్‌డేట్‌ చేస్తామన్నారు. వ్యవసాయాన్ని డిజిటలైజేషన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్లు జనగం కోటేశ్వరరావు, చావా వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నాగులవంచలో విదేశీ అధికారుల సందడి

చింతకాని డిసెంబరు 9: ‘వ్యవసాయ విజ్ఞాన మార్పిడి’లో పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపికైన నాగులవంచ ప్రాథమిక సహకార కేంద్రాన్ని రాబో బ్యాంక్‌ బృందం శుక్రవారం సందర్శించింది. ఈ సందర్భంగా సీనియర్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ బీయాన మాట్లాడుతూ భారతదేశ ప్రాథమిక సహకార వ్యవస్థ పనితీరు బాగుందని, రైతుల ఆర్థికాభివృద్ధికి సహకార వ్యవస్థ అందిస్తున్న సేవలు అద్భుతంగా ఉన్నాయని అన్నారు. సంఘం ద్వారా రైతులకు అందుతున్న సేవలు, సంఘ కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. పీఏసీఎస్‌లో నూతనంగా నిర్మించిన గోడౌనను పరిశీలించారు. సంధర్బంగా పాలకవర్గం, రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాబో బ్యాంక్‌ సీఈవో మెరియానా, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ సీపోరా, జిల్లా సహకార అధికారి విజయకుమారి, డీసీసీబీ సీఈవో వీరబాబు, సొసైటీ చైర్మన నల్లమోతు శేషగిరిరావు, రైతుబంధు మండల కన్వీనర్‌ కిలారు మనోహర్‌బాబు, ఏఈవో గోగుల హరికృష్ణ, ఎంపీపీ పూర్ణయ్య, జడ్పీటీసీ సభ్యుడు కిషోర్‌, సర్పంచలు ఆలస్యం నాగమణి, కాండ్ర పిచ్చయ్య, సీఈవోలు యాలమూడి శ్రీనివాసరావు, ఇప్పా శ్రీనివాసరావు, ముత్తయ్య, రైతుబంధు జిల్లా సభ్యులు మంకెన రమేష్‌, పెంట్యాల పుల్లయ్య, వంకాయలపాటి లచ్చయ్య, అధికారులు తదితరలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-10T01:17:16+05:30 IST