కేసీఆర్‌.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

ABN , First Publish Date - 2022-06-07T05:30:00+05:30 IST

కేసీఆర్‌.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

కేసీఆర్‌.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలి
నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిల

నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యాడు

ఒకేసారి 1.91లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన ఇవ్వాలి

వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

సీఎల్పీ నేత భట్టి స్వగ్రామంలో నిరుద్యోగ నిరాహారదీక్ష

వైరా, జూన 7: మాటలతో మోసం చేసిన కేసీఆర్‌.. నిరుద్యోగులు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైఎ్‌సఆర్‌టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె మంగళవారం సీఎల్పీనేత మల్లు భట్టి విక్రమార్క స్వగ్రామమైన వైరా మండలం స్నానాలలక్ష్మీపురంలో నిరుద్యోగ నిరాహార దీక్షను నిర్వహించారు. తొలుత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆమె ప్రసంగిస్తూ కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 3లక్షలకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉండగా.. వాటిలో ప్రస్తుతం 1.91లక్షల ఉద్యోగాలు వెలుగులో ఉన్నాయన్నారు. వీటికి కాకుండా కేవలం 10వేల నుంచి 15వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన ఇవ్వడాన్ని తప్పుపట్టారు. ఏకకాలంలో 1.91లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉత్తమాటలు కాదు ఉద్యోగాలు ఇవ్వాలని అనే నినాదంతో ఉన్న ప్లకార్డును షర్మిల ప్రదర్శిస్తూ దీక్షలో కూర్చోన్నారు. ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిన కేసీఆర్‌ వెంటనే సీఎం పదవికి రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్‌ వారి ఆత్మహత్యలకు కారకుడయ్యారని, ఆయన నయవంచకుడు, నరహంతకుడు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగులకు, తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య అంతా మోసమని, విద్యార్థులకు స్కాలర్‌షి్‌పలు, ఫీజు రియింబర్స్‌మెంట్‌ ఇవ్వడం లేదని, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు కూలీపనులకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  చివరకు పోడు పట్టాలు అడిగిన మహిళలను జైలుకు పంపించి పాచిపోయిన భోజనం పెట్టి వారిని చిత్రహింసలకు గురిచేశారని, పోలీసువాళ్లను పనోళ్లుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. గండగలపాడులో పక్షవాతంతో ఏడేళ్లుగా మంచానికే పరిమితమైన వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ దీక్షకు టీఆర్‌ఎ్‌సకు చెందిన స్నానాల లక్ష్మీపురం సర్పంచ అమ్మిక రామారావు, కాంగ్రె్‌సకు చెందిన ఉపసర్పంచ మల్లు రామకృష్ణ సంఘీభావం తెలిపి దీక్షలో పాల్గొన్నారు. అనంతరం పాదయాత్రలో ఆమెతో కలిసి నడిచారు. పార్టీ నాయకులు రామునాయక్‌, గడిపల్లి కవిత, లక్కినేని సుధీర్‌, నంబూరు ఓంకార్‌ కార్తీక్‌, నీలం రమేష్‌, పిట్టా రామిరెడ్డి, సత్యవతి, సంజీవ, చైతన్యరెడ్డి, లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


నేటి పాదయాత్ర ఇలా.. 

మంగళవారం ఉదయం గండగలపాడునుంచి స్నానాలలక్ష్మీపురం చేరుకున్న షర్మిల అక్కడ నిరుద్యోగ నిరాహార దీక్ష చేసిన.. రాత్రికి అక్కడే బస చేశారు. బుధవారం వైరామండలం సిరిపురం, పూసలపాడు, గౌండ్లపాలెం,నారపనేనిపల్లి, విప్పలమడక లింగన్నపాలెం, గరికపాడు గ్రామాల మీదుగా పాదయాత్ర నిర్వహించి గరికపాడులో రాత్రి బస చేస్తారు. 

Read more