తెలంగాణలో బీజేపీ నెక్ట్స్ టార్గెట్ ఇదేనట..

ABN , First Publish Date - 2022-08-07T06:36:09+05:30 IST

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న బీజేపీ ఉమ్మడి ఖమ్మంజిల్లాపై కూడా దృష్టి పెట్టింది. ..

తెలంగాణలో బీజేపీ నెక్ట్స్  టార్గెట్ ఇదేనట..

ఖమ్మం (ఆంధ్రజ్యోతిప్రతినిధి): రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న బీజేపీ ఉమ్మడి ఖమ్మంజిల్లాపై కూడా దృష్టి పెట్టింది. పార్టీని విస్తరింపచేసేందుకు చేరికల కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. అందులో భాగంగా అక్టోబర్‌లో జిల్లాలో హోంశాఖ మంత్రి అమితషాను రప్పించి బహిరంగసభ ఏర్పాటుచేసి చేరికలను చేపట్టేందుకు బీజేపీ కార్యచరణ సిద్ధంచేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లానుంచి ఎన్నో కొన్నిసీట్లు సాధించాలన్న లక్ష్యంతో వివిధ పార్టీలోని మాజీనేతలకు, అధికారపార్టీ అసంతృప్తులకు వల విసురుతున్నారు. ఇప్పటికే జిల్లాలో మాజీ ప్రజాప్రతినిధి ఒకరు బీజేపీతో టచలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తన అనుచరులతో బీజేపీలో చేరతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ జాబితాలో జిల్లాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధుల పేర్లు ఉండడంతోపాటు మీడియాలో కూడా ప్రచారం జరుగుతుండం చర్చకు దారితీస్తోంది. అధికార టీఆర్‌ఎ్‌సలో ఉన్న అసంతృప్తులు కూడా టీఆర్‌ఎ్‌సను వీడితే బీజేపీవైపు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలుండగా గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కేవలం ఖమ్మంలో మాత్రమే గెలిచింది. వైరాలో స్వతంత్ర అభ్యర్థి గెలవగా,  ఎనిమిది చోట్ల కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తర్వాత పరిణామాల్లో వైరాలో స్వతంత్ర అభ్యర్థి రాములునాయక్‌తో పాటు కాంగ్రె్‌సనుంచి గెలిచిన పాలేరు, ఇల్లెందు, కొత్తగూడెం, పినపాక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, సత్తుపల్లి, అశ్వారావుపేట టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ నేపఽథ్యంలో  గత ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సనుంచి పోటీచేసి ఓడిపోయిన నాయకులకు ఈసారి టికెట్లు వస్తాయా లేదా అన్న విషయంపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌, టీడీపీ నుంచి గెలిచిన ప్రస్తుత ఎమ్మెల్యేలు టీఆర్‌ఎ్‌సలో ఉండడంతో తిరిగి తమకు టికెట్లు దక్కుతాయన్న ధీమాలో వారు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌ టికెట్లపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇందులో టికెట్లు ఎవరికి రాకున్నా వారు కాంగ్రెస్‌, బీజేపీ వైపు దృష్టిమళ్లించే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల తరుణంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి టికెట్‌ ఇవ్వలేదు. నామ నాగేశ్వరరావుకు టికెట్‌ ఇవ్వడంతో పొంగులేటి పోటీచేయలేకపోయారు. అయితే ఆయనకు తగిన పదవి కలిపిస్తామని సీఎం కేసీఆర్‌ అప్పట్లోనే ప్రకటించారు. అయితే రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీ వస్తుందని పొంగులేటి ఎదురుచూశారు. దీంతో ఆయన టీఆర్‌ఎ్‌సలో అసంతృప్తితోనే కొనసాగుతున్నారు. గత కొంతకాలంగా కాంగ్రె్‌సలోకి, బీజేపీలోకి వెళతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఆయన టీఆర్‌ఎ్‌సలో మౌనంగానే ఉంటూ తన అనుచరులను కలుస్తున్నారు. మళ్లీ ఇటీవల పొంగులేటి చూపు బీజేపీ వైపు అంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు జిల్లాకు చెందిన మాజీమంత్రి జలగం ప్రసాదరావు కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ జిల్లాలో టికెట్లు వచ్చే అవకాశం లేదని భావించే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, టికెట్లు రావని భావిస్తున్న మాజీ ప్రజాప్రతినిధులు బీజేపీకి దగ్గరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్రనేతలు జిల్లాలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, టీడీపీ తదితర నాయకులను సైతం ఫోనద్వారా బీజీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్టు తెలిసింది. అయితే క్షేత్రస్థాయిలో పలుకుబడి ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీనేతలు, మాజీప్రజాప్రతినిధులపైనే బీజేపీ వర్గాలు ప్రధానంగా దృష్టిపెట్టాయి. వలసల ద్వారా బలం పెంచుకుని రాబోయే ఎన్నికల్లో జిల్లాలో సత్తా చూపించేందుకు కార్యచరణ రూపొందించామని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పేర్కొన్నారు. ఇతరపార్టీల నేతలతో మంతనాలు చేస్తున్నామని, అక్టోబరులో అమితషా బహిరంగసభ జిల్లాలో ఉంటుందని, ఆ తర్వాతే జిల్లాలో బీజేపీ కార్యక్రమాలు మరింత వేగంగా ఉంటాయని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

Updated Date - 2022-08-07T06:36:09+05:30 IST