సమస్యలు పరిష్కరించకుంటే ఢిల్లీకి రావాలి
ABN , First Publish Date - 2022-10-08T05:17:02+05:30 IST
సమస్యలు పరిష్కరించకుంటే ఢిల్లీకి రావాలి
అధికారులను ఆదేశించిన జాతీయ మైనారిటీ కమిషన సభ్యురాలు
సగంమంది జిల్లా అధికారుల గైర్హాజరుపై షహజాదీ బేగం అసంతృప్తి
వాడీవేడిగా పీఎం 15సూత్రాల పథకం అమలుపై సమీక్ష
కొత్తగూడెం కలెక్టరేట్, అక్టోబరు 7: జిల్లాలో మైనారిటీల సమస్యలు పరిష్కరించకుంటే ఢిల్లీకి రావాల్సి ఉంటుందని, కమిషన దృష్టికి వస్తే తప్ప సమస్యలను పట్టించుకోరా అంటూ రెవెన్యూ అధికారులపై జాతీయ మైనారిటీ కమిషన సభ్యుర్యాలు షహజాదీబేగం ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశపు మందిరంలో మైనారిటీ, బ్యాంకు, పాలిటెక్నిక్, మహిళాశిశు సంక్షేమ, విద్యాశాఖ, రెవెన్యూ అధికారులతో మైనారిటీల సంక్షేమానికి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కొత్తగూడెం పట్టణ పరిధిలోని ఫ్యూనబస్తీలో ఆక్రమణకు గురైన మూడెకరాల షాదిఖానా భూ సమస్య పరిష్కరించకుంటే ఢిల్లీకి రావాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులపై మండిపడ్డారు. మైనారిటీ అధికారి, ఆర్డీవో భూ సమస్య పరిష్కరించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ప్రధానమంత్రి 15 సూత్రాల పథకాల అమలుకు జిల్లా కలెక్టర్ చైర్మనగా కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. కమిటీ ఏర్పాటు తదుపరి పథకాల అమలుపై నెలవారి సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రగతి సాధించాలన్నారు. ప్రతి మండలంలో మైనారిటీ జనాభా, విద్యార్ధుల సంఖ్య, షాదిముబారక్ ద్వారా ఆర్థిక సాయం అందించాలన్నారు. లబ్ధిదారుల జాబితా తహసీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉంచాలన్నారు. మైనార్టీలకు మంజూరు చేసిన ముద్ర, వ్యవసాయ తదితర రుణాలకు సంబందించిన జాబితా అందచేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. మసీదులకు, చర్చిలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం కోసం రిజిస్ట్రేషన్లు చేయాలని మైనారిటీల అధికారి సంజీవరావును ఆదేశించారు. జామా మసీదుకు కమిటీని ఏర్పాటు చేయాలని, జనాభా ప్రాతిపదికన అత్యధికులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. సమావేశానికి పూర్తిస్థాయిలో అధికారుల సమగ్ర సమాచారంతో విధిగా హాజరుకావాలని, కమిటీ చైర్మన కూడా సమావేశానికి రాకపోవడం శోచనీయం అన్నారు. ఇదే పరిస్థితి భవిష్యతులో ఉత్పన్నమైతే కమిషన సీరియ్‌సగా తీసుకోవాల్సి వసుందని హెచ్చరించారు. షాదిముబారక్ ఆర్థిక సాయం మంజూరుకు వచ్చే దరఖాస్తులను, పెండింగ్‌లో ఉన్న 197 దరఖాస్తులు సత్వరమే విచారణ నిర్వహించి పరిష్కరించాలన్నారు. అంగనవాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను సంబంధిత శాఖ అధికారిని అడిగి తెలుసుకొన్నారు. అనంతరం సభ్యుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, మైనారిటీ అధికారి సంజీవరావు, మహిళా శిశు సంక్షేమ అధికారి వరలక్ష్మి, డీఈవో సోమశేఖర్ శర్మ, డీఆర్‌వో అశోక్‌చక్రవర్తి, ఆర్డీవో స్వర్ణలత, మైనారిటీ నాయకులు యాకూబ్‌పాషా, రిజియా, అన్వర్, సాధిక్, యంఏ ఖురేషి, అరీ్‌షఖాన తదితరులు పాల్గొన్నారు.
సమావేశానికి సగం మంది జిల్లాస్థాయి అధికారులు డుమ్మా
కలెక్టరేట్ సమావేశపు మందిరంలో శుక్రవారం జరిగిన జాతీయ మైనారిటీ కమిషన సమీక్షా సమావేశానికి జిల్లాస్థాయి అధికారులు సగం మంది హాజరు కాలేదు. ప్రజాప్రతినిధులు మాత్రం ఎవరూ కానరాలేదు. దీంతో మైనారిటీల పట్ల వారికున్న చిత్తశుద్ధి తేటతెల్లమవుతోంది. ఈ సమావేశానికి సుమారు 20మంది జిల్లాస్థాయి అధికారులు హాజరుకావాల్సి ఉండగా కేవలం ఐదు శాఖల జిల్లా అధికారుల మాత్రమే హాజరు కావడం, కమిటీకి కలెక్టర్ చైర్మన అయి కూడా రాకపోవడం, జిల్లాలోని ఒక్క ప్రజాప్రతినిధి కానరాక పోవడం వారి చిత్తశుద్దిని చాటుతోంది. దీంతో కమిషన సభ్యురాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో కేవలం నలుగురికి మాత్రమే డబుల్‌బెడ్ రూం ఇళ్లు కేటాయించడంపై ఆమె విస్మయం వ్యక్తంచేశారు. ఎందుకింత వివక్ష చూపుతున్నారని అధికారులను ప్రశ్నించారు. పరిస్థితి పునరావృతం కావొద్దని, సమీక్షకు అన్ని శాఖల అధికారులు సంపూర్ణ నివేధికలతో హజరుకావాలని ఆదేశించడం గమనార్హం.
మైనార్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేయండి: యాకూబ్‌పాషా
జిల్లావ్యాప్తంగా నెలకొన్న మైనారిటీల సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని, ప్రధాన మంత్రి 15సూత్రాల పథకం జిల్లా సభ్యుడు ఎండీ యాకూబ్ పాషా జాతీయ మైనార్టీ కమిషన సభ్యురాలిని కోరారు. సమీక్షా సమావేశంలో జిల్లాలో నెలకొన్న సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. జిల్లాలో మైనారిటీ గురుకులాలకు పక్కా భవన నిర్మాణాలకు కేంద్ర మైనారిటీ సంక్షేమశాఖ ద్వారా నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, ప్రధాన మంత్రి 15సూత్రాల పథకం సమీక్ష సమావేశం ప్రతి మూడు నెలలకోసారి జరిగేలా చర్యలు తీసుకోవాలని, వక్ఫ్ పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేసి ఐదేళ్లయినా సమీక్షా సమావేశం నిర్వహించటం లేదని ఆమెకు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడేళ్లుగా మైనార్టీలకు రుణాలు ఇవ్వడంలేదని, కనీసం ముద్ర రుణాలైనా అందించేలా బ్యాంకులను ఆదేశించాలని ఆయన కోరారు.
