రహదారి పైనే గృహ నిర్మాణ సామగ్రి
ABN , First Publish Date - 2022-12-16T23:30:17+05:30 IST
సత్తుపల్లి పట్టణంలో రోజురోజుకూ భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు ఖాళీ ప్లాట్లలో భవనాలు నిర్మించేందుకు ఉత్సాహం చూపుతుండగా, మరోవైపు వాహనదారులు, సమీప ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.
సత్తుపల్లిరూరల్, డిసెంబరు 16: సత్తుపల్లి పట్టణంలో రోజురోజుకూ భవన నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. ప్రజలు ఖాళీ ప్లాట్లలో భవనాలు నిర్మించేందుకు ఉత్సాహం చూపుతుండగా, మరోవైపు వాహనదారులు, సమీప ప్రజలకు ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. గృహ నిర్మాణాలకు సంబంధించి సామగ్రిని యజమానులు, కాంట్రాక్టర్లు రోడ్లపైనే రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. దీంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇదేంటని పలువురు ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం చెబుతున్నారు. రోజుల తరబడి రోడ్లపైనే నిల్వ ఉంచడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. మునిసిపల్ అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా ప్రజలు, వాహనదారులు నానా అవస్థలు పడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై మునిసిపల్ కమిషషనర్ కే.సుజాతను వివరణ కోరగా నిర్వహకులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామన్నారు. రోడ్లపై భవన నిర్మాణ వ్యర్థాలు నిల్వ ఉంచకుండా తమకు సమాచారం ఇవ్వాలన్నారు. తగిన రుసుము వసూలు చేసి డంపింగ్ యార్డుకు తరలిస్తామన్నారు.