ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-09-10T06:58:37+05:30 IST

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం
పాల్వంచ పట్టణంలోని ప్రధాని రహదారిపై ప్రవహిస్తున్న వాననీరు

టేకులపల్లిలో పిడుగు పాటుకు యువరైతు మృతి 

నిమజ్జన వేడుకలకు ఆటంకం

ఖమ్మం / కొత్తగూడెం (ఆంధ్రజ్యోతి), సెప్టెంబరు9: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం భారీ వర్షం పడింది. మూడురోజులుగా అడపాదడపా వానలు పడుతుండగా.. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎడతెరిపిలేకుండా వాన పడుతుండటంతో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాల్వంచ పట్టణం, కొత్తగూడెం పట్టణంలో భారీ వర్షానికి రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల చెరువులు అలుగులు పోస్తుండగా, వాగులు, కాల్వలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని పలు ఇళ్లలోకి వరదనీరు  చేరింది. లక్ష్మీదేవిపల్లి, టేకులపల్లి, సుజాతనగర్‌, ఆళ్లపల్లి, గుండాల మండలాల్లో భారీ వర్షం పడింది. కొత్తగూడెం పట్టణంలోని రైల్వేలైన అండర్‌ బ్రిడ్జి కింద వరదనీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక పాల్వంచలోని కిన్నెరసాని రిజర్వాయర్‌కు వరదనీరు వచ్చి చేరుతోంది. మొత్తం 407అడుగులకు గాను 405 అడుగులకు నీటిమట్టం చేరింది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తి 9,900క్యూసెక్కులనీటి వదులుతున్నారు. మొర్రేడు, గోధుమవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వర్షంతో పత్తి, మిర్చి పంటలకు జీవం వచ్చినట్లయ్యింది. మరోవైపు ఎడతెరిపి లేని వర్షం కారణంగా గణేష్‌ నిమజ్జన వేడుకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షం కారణంగా సింగరేణి ఓసీల్లో నీరు నిలవడంతో సుమారు 15వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 


పిడుగు పాటుకు యువరైతు మృతి

టేకులపల్లి: పత్తిచేనులో పాటు చేస్తుండగా పిడుగుపడి ఓ యువరైతు మృతిచెందిన సంఘటన టేకులపల్లి మండలంలో శుక్రవారం జరిగింది మండలంలోని పెట్రాంచెల్కస్టేజీ గ్రామానికి చెందిన ఇస్లావత వసంతరావు (22) గ్రామ సమీపంలోని తమ పత్తిచేనులో పాటు చేస్తుండగా వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో అతడు చెట్టుకిందకు వెళ్లగా అదే సమయంలో చెట్టుపై పిడుగు పడింది. దీంతో ఆ చెట్టు కింద ఉన్న వసంతరావు అక్కడికక్కడే మృతి చెందాడు. అవివాహితుడైన వసంతరావుకు తల్లిదండ్రులు, ఓ సోదరుడున్నారు.

Updated Date - 2022-09-10T06:58:37+05:30 IST