నవ్వాడని గోడకేసి కొట్టాడు!

ABN , First Publish Date - 2022-07-05T05:17:20+05:30 IST

క్రమశిక్షణ పేరుతో ఓ అధ్యాపకుడు చేసిన పని ఓ విద్యార్థి ప్రాణాలపైకి తెచ్చింది.

నవ్వాడని గోడకేసి కొట్టాడు!
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి కార్తీక్‌

 విద్యార్థిని కొట్టిన లెక్చరర్‌.. మెదడులో గడ్డకట్టిన రక్తం

 వైద్యుల పర్యవేక్షణలో విద్యార్థి.. ఆందోళనలో తల్లిదండ్రులు

 భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఘటన


పాల్వంచ, జూలై 4: క్రమశిక్షణ పేరుతో ఓ అధ్యాపకుడు చేసిన పని ఓ విద్యార్థి ప్రాణాలపైకి తెచ్చింది. అల్లరిచేస్తున్నాడని, పరీక్ష సమయంలో నవ్వాడని విచక్షణ కోల్పోయిన లెక్చరర్‌ విద్యార్థిని గోడకేసి కొట్టడంతో.. మెదడులో రక్తం గడ్డకట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని గురుకుల కళాశాలలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి పంచాయతీలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో కేలూరి కార్తీక్‌ అనే విద్యార్థి ఇంటర్‌ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. నీట్‌ శిక్షణలో భాగంగా కళాశాలలో ప్రతీ ఆదివారం విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు వారాంతపు పరీక్షలు నిర్వహిస్తుంటారు. అలా ఆదివారం వారాంతపు పరీక్ష సమయంలో విద్యార్థి కార్తీక్‌ నవ్వాడన్న కోపంతో పార్ట్‌టైం ఫిజిక్స్‌ లెక్చరర్‌ రాంబాబు అతడిని గోడకేసి కొట్టడంతో కార్తీక్‌ తలకు గాయమైంది. వెంటనే కళాశాల యజమాన్యం అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు స్కానింగ్‌ అవసరమని సూచించారు. దీంతో వారు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి స్కానింగ్‌ చేయించగా అక్కడి వైద్యులు విద్యార్థి మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలిపారు. మూడు రోజులు పరిశీలనలో ఉంచాలని సూచిండంతో అదే ఆసుపత్రిలో అతడికి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆ ఆసుపత్రిలో  తమ బిడ్డకు వైద్యం చేయించే స్థోమత తమకు లేదని విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా ఈ ఘటనకు బాధ్యుడైన పార్ట్‌టైమ్‌ లెక్చరర్‌ను విధులనుంచి తొలగించినట్లు వైస్‌ ప్రిన్సిపాల్‌ కృష్ణ తెలిపారు. అయితే ఈ ఘటనపై సీడీపీవో కనకదుర్గ  ఫిర్యాదు మేరకు సదరు అధ్యాపకుడిపై రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాస్‌ కేసు నమోదుచేశారు.


Read more