తొలి అడుగుపడింది

ABN , First Publish Date - 2022-08-07T06:41:42+05:30 IST

తొలి అడుగుపడింది

తొలి అడుగుపడింది

ఖమ్మం వైద్య కళాశాల ఏర్పాటుకు జీవో విడుదల

100ఎంబీబీఎస్‌ సీట్ల కేటాయింపు

నిర్మాణానికి తొలివిడతలో రూ.166కోట్లు

పాత కలెక్టరేట్‌ భవనంలో ఏర్పాటుకు ప్రతిపాదన 

వైద్యవిధాన పరిషత నుంచి వైద్య, విద్య డైరెక్టర్‌ పరిధిలోకి జిల్లా ఆసుపత్రి

ఖమ్మం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): దశాబ్ధంన్నర జిల్లా ప్రజల మెడికల్‌ కాలేజీ కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. ఖమ్మంజిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది. జిల్లాకు మెడికల్‌ కళాశాలను మంజూరు చేస్తున్నట్టు మార్చి7న అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఉత్తర్వులు విడుదల చేసింది. ఖమ్మం మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత పరిపాలన నియంత్రణ నుంచి మెడికల్‌ ఎడ్యుకేషన డైరెక్టర్‌కు బదిలీ చేస్తున్నట్టు కూడా ఈ ఉత్తర్వుల్లో వెల్లడించారు. కళాశాల భవన నిర్మాణం పనులు రోడ్లు భవనాలశాఖ, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి భవనాలను అప్‌గ్రేడ్‌ చేయడం, పరికరాలు ఫర్నిచర్‌ సేకరణ తదితర పనులను టీఎ్‌సఎంఎ్‌సఐడీసీకి అప్పగిస్తున్న ట్టు కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటుతో జిల్లా ప్రజలకు కార్పొరేట్‌ వైద్యసేవలు మరింత దగ్గర కానున్నాయి. ప్రస్తుతం అత్యవసర పరిస్థితుల్లో రోగులను హైదరాబాద్‌ వంటి నగరాలకు పంపిస్తున్నారు. ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే ఆ పరిస్థితులు ఉండవు. స్థానికంగానే ఖరీదైన వైద్యం ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఉంది. జిల్లా లో మెడికల్‌ కళాశాల కోసం ఇప్పటికే (ప్రస్తుతం నిర్వహిస్తున్న) కలెక్టరేట్‌ భవనాన్ని పరిశీలించారు.ప్రస్తుత జిల్లా ఆసుపత్రికి అనుసంధానంగా కలెక్టరేట్‌ భవనం, ఆర్‌అండ్‌బీ కార్యాలయం స్థలాన్ని అధికారులు సర్వే చేయించారు. మొత్తం 30ఎకరాల స్థలం అవసరం ఉండడంతో వీటిని మెడికల్‌ కళాశాలకు ఇవ్వడానికి సూత్రప్రాయంగా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. ఈ నేపథ్యంలోనే నూతన కలెక్టరేట్‌ నిర్మాణం పనులను మరింత వేగిరం చేస్తున్నారు. వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం తొలివిడతగా రూ.166కోట్లను కేటాయిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. 


వచ్చే విద్యాసంవత్సరం నుంచి మెడికల్‌ కాలేజీ ప్రారంభం 

మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు త్వరగా నిధులు మంజూరుచేయించి వచ్చే విద్యాసంవత్సరం నుంచే కాలేజీ ప్రారంభానికి కృషిచేస్తానని, శనివారం ఇందుకు సంబంధించిన జీవో విడుదల కావడంతో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ హర్షం వ్యక్తంచేశారు. 


మెడికల్‌ కళాశాల ఏర్పాటైతే..

ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో రోగుల రద్దీ ఉంటుంది. 550 పడకలు, నిత్యం 2వేలకు పైగా రోగులరాక కొనసాగుతోంది. మాతాశిశు కేంద్రంలో ప్రతి నిత్యం 600మంది గర్భిణులు, బాలింతలు రోజుకు 30వరకు కాన్పులు జరుగుతున్నాయి. వీటితోపాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఛత్తీ్‌సగఢ్‌, ఆంధ్రా, తిరువూరు, మహబూబాబాద్‌, నల్గొండ, సూర్యాపేట జిల్లాల నుంచి కూడా క్షతగాత్రులు ఇతర శస్త్ర చికిత్సల కోసం ఈ ఆసుపత్రికి వస్తుంటారు. ఐసీయూ, డయాలసిస్‌ యూనిట్‌, హైరిస్క్‌ నవజాత శిశుకేంద్ర, రక్తనిధి కేంద్రం ఉండడంతో రోగులు అధికంగానే వస్తుంటారు. అయితే ఇంకాఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యంకోసం హైదరాబాద్‌, వరంగల్‌కు పంపిస్తున్నారు. అక్కడికి వెళ్లేసరికి పరిస్థితులు విషయమించి ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడే వైద్యకళాశాలను ఏర్పాటు చేస్తే 100మంది వైద్య విద్యార్థులు అందుబాటులో ఉంటారు. వారికి బోధించే ప్రొఫెసర్లు, నిపుణులైన వైద్యులూ అందుబాటులో ఉంటారు. అత్యాధునిక పరికరాల ఏర్పాటుతో సూపర్‌స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.  

Updated Date - 2022-08-07T06:41:42+05:30 IST