కంప్యూటర్‌ ఆపరేటర్లతో ఆర్థికభారం

ABN , First Publish Date - 2022-01-13T05:31:51+05:30 IST

ఖమ్మం నగర పాలకసంస్థ కార్యాలయానికి కంప్యూటర్‌ ఆపరేటర్లు భారంగా మారారు. అర్హత లేని వారిని కంప్యూటర్‌ ఆపరేటర్ల కేటగిరీలో చేర్చటం వల్ల కార్యాలయానికి ఆర్థికభారం పడుతున్నది.

కంప్యూటర్‌ ఆపరేటర్లతో ఆర్థికభారం

 అవసరం లేకున్నా నియామకం

  ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇష్టారాజ్యం

 నెలకు అదనంగా రూ.1.80లక్షలు చెల్లింపులు

ఖమ్మంకార్పొరేషన్‌, జనవరి12: ఖమ్మం నగర పాలకసంస్థ కార్యాలయానికి కంప్యూటర్‌ ఆపరేటర్లు భారంగా మారారు. అర్హత లేని వారిని కంప్యూటర్‌ ఆపరేటర్ల కేటగిరీలో చేర్చటం వల్ల కార్యాలయానికి ఆర్థికభారం పడుతున్నది. నెలకు రూ.1.80లక్షలు అధికంగా వేతనాలు చెల్లించవలసి వస్తోంది. ప్రస్తుతం ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో 25మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు ఉండగా, అందులో కేవలం ఐదుగురు మాత్రమే అర్హత ఉన్నవారని అధికారులే అంటున్నారు. మిగిలిన వారు అర్హత లేకున్నా అధికంగా వేతనం పొందుతున్నారు. వివిధ విభాగాల్లో అర్హతలేని కంప్యూటర్‌ ఆపరేటర్లతో అధికారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. 

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా నియమించాలంటే..

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా నియమించాలంటే తప్పని సరిగా అర్హత పరీక్ష నిర్వహించాలి. కంప్యూటర్‌ ఆపరేటర్ల పోస్టులకు టెక్నికల్‌ వాళ్లనే తీసుకుంటారు. వాళ్లకు తెలుగు, ఇంగ్లీష్‌ టైపింగ్‌ రావాలి. ప్రస్తుతం ఉన్న ఆపరేటర్లలో 20 మందికి తెలుగు టైపింగ్‌ రాదంటే అతిశయోక్తి కాదు. తెలుగులో ఏదైనా టైప్‌ కావాలంటే అధికారులు తమ వద్ద ఉన్న ఆపరేటర్లకు రాదు కనుక తెలుగు టైపింగ్‌ వచ్చిన ఆపరేటర్ల వద్దకు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడింది. కేవలం వారి వద్ద ఉన్న ధృవ పత్రాలను చూసి, ఆపరేటర్ల కేటగిరీలో చేర్చటంతో నగరపాలక సంస్థ కార్యాలయంలో ఈ దుస్థితి ఏర్పడింది. 

వేతనాల్లో రూ.9వేల వ్యత్యాసం

వేతనాల్లో నెలకు రూ.9వేలు వ్యత్యాసముండటంతో కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు ఎగబడుతున్నారు. సాధారణంగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి నెలకు వేతనం రూ.13వేలు ఉండగా, కంప్యూటర్‌ కేటగిరీలోని వారికి నెలకు రూ.22వేలు చెల్లిస్తున్నారు. ఏకంగా రూ.9వేలు అధికంగా వేతనం రావటంతో పైరవీలు చేసుకొని, కంప్యూటర్‌ ఆపరేటర్లుగా చెలామణి అయ్యి, ఎంచక్కా వేతనాలు పొందుతున్నారు.

ఎలా నియమించారంటే..

కంప్యూటర్‌ ఆపరేటర్ల కేటగిరీలో చేర్చేందుకు భారీగా సొమ్ములు చెల్లించటంతో నియామకాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. వేరే విభాగంలో ఉద్యోగం చేస్తున్నా సొమ్ములు తీసుకొని, వారిని కంప్యూటర్‌ ఆపరేటర్ల కేటగిరీలోకి మార్చారు. వాస్తవంగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ కేటగిరీలో ఉండేవారు కంప్యూటర్‌ ముందు ఎప్పుడూ కనిపించరు. కొంతమంది వేరే విధుల్లో ఉంటారు. అయినా అధిక వేతనం పొందుతున్నారు. ఇటీవల కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్ల ఆపరేటర్ల లెక్క తీసినప్పుడు, 25 మంది ఆపరేటర్లు ఉండటం ఉన్నతాధికారులకే ఆశ్చర్యం కలిగించింది. కమిషనర్‌, మేయర్‌ కంప్యూటర్‌ ఆపరేటర్ల నియామకంపై విచారణ నిర్వహిస్తే పలు విషయాలు వెలుగులోకి వస్తాయి.

Updated Date - 2022-01-13T05:31:51+05:30 IST