పామాయిల్‌ సాగుతో ఆర్థికాభివృద్ధి

ABN , First Publish Date - 2022-12-07T00:30:22+05:30 IST

పామాయిల్‌ సాగుతో ఆర్థికాభివృద్ధి పొందొచ్చని, ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే తాను పామాయిల్‌ సాగు చేపట్టినట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన సుమారు 100మంది రైతులు దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తుమ్మల వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం సందర్శించి పామాయిల్‌ సాగు, అంతరపంటలైన పుచ్చ, వక్క సాగు

 పామాయిల్‌ సాగుతో ఆర్థికాభివృద్ధి
సిద్దిపేట ప్రాంతానకి చెందిన రైతులకు పామాయిల్‌ సాగుపై అవగాహన కల్పిస్తున్న మాజీమంత్రి తుమ్మల

ధైర్యంగా సాగు చేయండి

సిద్ధిపేట రైతులకు మాజీమంత్రి తుమ్మల భరోసా

గండుగులపాడు వ్యవసాయ క్షేత్రంలో పంటల పరిశీలన

దమ్మపేట, డిసెంబరు 6 : పామాయిల్‌ సాగుతో ఆర్థికాభివృద్ధి పొందొచ్చని, ఎన్టీఆర్‌ స్ఫూర్తితోనే తాను పామాయిల్‌ సాగు చేపట్టినట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన సుమారు 100మంది రైతులు దమ్మపేట మండలం గండుగులపల్లిలోని తుమ్మల వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం సందర్శించి పామాయిల్‌ సాగు, అంతరపంటలైన పుచ్చ, వక్క సాగును పరీశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ దేశంలో జనాభా కనుగుణంగా వంటనూనె అందించాలంటే అది పామాయిల్‌తోనే సాధ్యమని, అందువల్ల పామాయిల్‌ సాగును ధైర్యంగా చేపట్టవచ్చని వారికి భరోసా కల్పించారు. ఎన్టీఆరే ఇక్కడ తొలి పామాయిల్‌ మొక్కను నాటారని తుమ్మల గుర్తు చేశారు. పామాయిల్‌తో పాటు అంతరసాగుగా మొక్కజొన్న, వేరుశనగ, మిర్చి, ప్రత్తి, తదితర పంటలతో పాటు దీర్ఘకాలిక పంటలైన కోకో, వక్క, మిరియం, జాజికాయి తదితర పంటలను సాగు చేయవచ్చన్నారు. పామాయిల్‌ సాగుకు ప్రభుత్వం అనేక రాయితీలను ఇస్తోందని, సీఎం కేసీఆర్‌ ఈ పంటసాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. భవష్యత్తులో రాష్ట్రంలో వరిసాగు స్థానాన్ని పామాయిల్‌ భర్తీ చేస్తుందన్నారు. అప్పారావుపేట ఫ్యాక్టరీ ద్వారా వచ్చే ఆయిల్‌ రీకవరీ శాతాన్ని పరిగణనలోకి తీసుకొనే రైతులకు ధర నిర్ణయం జరుగుతుందన్నారు. అనంతరం అప్పారావుపేటలోని పామాయిల్‌ ఫ్యాక్టరీని రైతులు సందర్శించారు. ఈ క్షేత్ర పర్యటనలో సిద్ధిపేట జిల్లాకు చెందిన పలువురు యువ రైతులు తుమ్మల నాగేశ్వరరావుతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు. పలువురు రైతులు పామాయిల్‌ సాగులో తుమ్మలే తమకు ఆదర్శమని కొనియాడారు.

Updated Date - 2022-12-07T00:30:24+05:30 IST