ధనుర్మాసం.. పూజలకు ప్రత్యేకం
ABN , First Publish Date - 2022-12-15T01:00:09+05:30 IST
ధనుర్మాసం అనగానే భద్రాద్రి దేవస్థానంలో పాశురాల పఠనం.. గోదాదేవికి ప్రత్యేక పూజలు.. ప్రసాద నివేదన గుర్తుకొస్తాయి. పవిత్రమైన ధనుర్మాసంలో భక్తులు ప్రతిరోజు తెల్లవారుజామున అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి పాశురాలను పఠిస్తారు.
పాశురాల పఠనం.. ప్రత్యేక ప్రసాద నివేదన
భద్రాద్రిలో రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభం
ముస్తాబైన దక్షిణ అయోధ్య
భద్రాచలం, డిసెంబరు 14: ధనుర్మాసం అనగానే భద్రాద్రి దేవస్థానంలో పాశురాల పఠనం.. గోదాదేవికి ప్రత్యేక పూజలు.. ప్రసాద నివేదన గుర్తుకొస్తాయి. పవిత్రమైన ధనుర్మాసంలో భక్తులు ప్రతిరోజు తెల్లవారుజామున అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి పాశురాలను పఠిస్తారు. ఈ నెలరోజుల పాటు చేసే విష్ణు ఆరాధన చాలా విశేషఫలితాలు ఇస్తుందని, ఈ రోజుల్లో స్వామి వారికి సమర్పించే నివేదనలను ప్రసాదంగా స్వీకరిస్తే సకల శుభాలు కలుగుతాయని ఆద్యాత్మికవేత్తలు పేర్కొంటున్నారు. గోదాదేవి ఈ నెలరోజులు శ్రీవ్రతాన్ని చేసి రంగనాధున్ని వివాహం చేసుకుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీ వైష్ణవ ఆలయాలన్నింటిలో ఈ ధనుర్మాస సేవ అచరిస్తారు. అలాగే ఆండాళ్ తల్లి అనుగ్రహించిన తిరుప్పావై ప్రబందం పఠిస్తారు. ఈ ఏడాది శుక్రవారం సాయంత్రం 6.12నిమిషాలకు ధనస్సులో సూర్యుడు ప్రవేశించిన అనంతరం ధనుర్మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు గోదావరినుంచి తీర్థ బిందెను తీసుకొచ్చి సీతారామచంద్రస్వామి మూలమూరులకు, ఉత్సవమూర్తులకు ఏకాంత తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఆరాధన, తిరుప్పావై సేవాకాలం, శాత్తుముర్రై నిర్వహిస్తారు. అలాగే ధనుర్మాసాన్ని పురస్కరించుకొని సీతారామనగర్ కాలనీలో వెంకటేశ్వరస్వామి ఆలయంలో, కల్యాణ మండపం రోడ్డులోని గోకుల కృష్ణసేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ దేవాలయం, రాజవీధిలోని జీయర్మఠంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.
గోదాదేవికి తిరుప్పావై వ్రతం
మధుర భక్తికి ప్రతీక గోదాదేవి అమ్మవారు. (ఆండాళ్లమ్మవారు) అమ్మవారు తిరుప్పావై వ్రతాన్ని ఈ కాలంలోనే ఆచరించి శ్రీరంగనాధుని భర్తగా పొందిందని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో భగవత్ ప్రీతిపాత్రంగా కీర్తించబడిన ధనుర్మాసంలో తిరుప్పావై వ్రతాన్ని ఎందరో భక్తులు ఆచరిస్తారు. ఈ సందర్భంగా ప్రతి రోజూ తెల్లవారుజామున బాలబోగం నిర్వహించిన అనంతరం ఆండాళ్లమ్మవారు అనుగ్రహించిన 30పాశురాల్లో ఒక్కొక్క పాశురాన్ని ప్రతిరోజు ప్రవచనం చేస్తారు. ఈ మాసంలోనే పార్వతీదేవి తపస్సు చేసి పరమేశ్వరుడిని భర్తగా పొందిందని, గోపికలందరూ ఈ మధ్య కాలంలోనే కాత్సాయని వ్రతాన్ని ఆచరించి శ్రీ కృష్ణుని సాంగత్యాన్ని పొందారని భక్తులు విశ్వసిస్తారు. ధనుర్మాసంలో 27వ రోజుకు ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజునే కూడారై ఉత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామి వారికి, తనకూ వివాహం జరిగితే 108 గంగాళాల పాయసంతో రంగనాఽథునికి నివేదన చేస్తానని అమ్మవారు మొక్కుకుని శ్రీరంగనాధున్ని తన నాథునిగా (భర్తగా) చేసుకుంటుంది. అందుకు ప్రతీకగా ప్రతి ఏటా ధనుర్మాసంలో 27వ రోజున కూడారై ఉత్సవం నిర్వహిస్తారు. గోదాదేవి అమ్మవారి చరిత్రను వర్ణిస్తూనే శ్రీకృష్ణ దేవరాయులు ఆముక్త మాల్యద అనే ప్రబందాన్ని (కావ్యం) రచించారు.