సాధారణ కాన్పులో కవలల జననం
ABN , First Publish Date - 2022-06-18T05:28:14+05:30 IST
ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన సాధారణ కాన్పులో ఓ ఆదివాసీ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. పినపాక మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన సున్నం ప్రవళిక అనే వలస ఆదివాసీ మహిళకు గతంలో ఇద్దరుబిడ్డలుండగా..
పినపాక పీహెచ్సీలో ఆదివాసీ మహిళ సుఖ ప్రసవం
పినపాక, జూన్ 17: ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన సాధారణ కాన్పులో ఓ ఆదివాసీ మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చింది. పినపాక మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన సున్నం ప్రవళిక అనే వలస ఆదివాసీ మహిళకు గతంలో ఇద్దరుబిడ్డలుండగా.. ఆమె మూడోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో ఆమెకు శుక్రవారం తెల్లవారుజామున పురిటినొప్పులు రావడంతో భర్త ఉంగయ్య ప్రవళికను పినపాక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుడు శివకుమార్ సాధారణ కాన్పు జరిగే అవకాశం ఉందని ధైర్యం చెప్పి.. అందుకు తగిన వైద్యం అందించారు. ఈ క్రమంలో ఉదయం 10:58గంటలకు సాధారణ కాన్పు జరిగి కవలలు (ఒక ఆడ, ఒక మగ శిశువు)జన్మించారని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యుడు శివకుమార్ తెలిపారు. గతంలో ఒక కూతురు, కుమారుడున్నారని, ఆ రెండుసార్లు ఆమెకు జరిగినవి సాధారణ ప్రసవాలేనని పేర్కొన్నారు. ప్రభుత్వం సాధారణ కాన్పులు పట్ల గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తోందని, ఆర్థిక వెసులుబాటు ఉన్న వారు ప్రభుత్వాసుపత్రులను కాదని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి రూ.వేలకు వేలు ఖర్చు చేసుకోవడమేగాక, తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఇబ్బందులు తెచ్చే సీజేరియన్ల వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నాణ్యమైన వైద్య సౌకర్యాలు కల్పించడమేగాక, ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పు జరిగితే కేసీఆర్ కిట్‌తో పాటు, నగదు ప్రోత్సాహకాన్ని అందించి, తల్లిబిడ్డలను ప్రత్యేక వాహనంలో ఇంటి వద్దకు చేరుస్తున్నారని గుర్తు చేశారు. స్టాఫ్ నర్సు సరిత, ఆశా వర్కర్ సుమలత ఈ కాన్పునకుగాను సేవలు అందించారు.