దళితబంధు దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-07-17T05:10:20+05:30 IST

రాష్ట్రంలో అమలు చేస్తున్న దళితబంధు దేశానికే ఆదర్శమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.

దళితబంధు దేశానికే ఆదర్శం
ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే సండ్ర

రానున్న కాలంలో అన్ని వర్గాలకు వర్తింపు

  సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి, జూలై 16: రాష్ట్రంలో అమలు చేస్తున్న దళితబంధు దేశానికే ఆదర్శమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామంలో లబ్ద్ధిదారులకు దళితబంధు యూనిట్లు అందజేశారు. సభలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలో 75మంది, సత్తుపల్లి మండ లం కిష్టాపురంలో 25 మంది లబ్ధిదారులను  ఎంపిక చేసినట్లు తెలిపారు.   100 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేసారని అన్నారు. లబ్దిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం లేదన్నారు. నిజమైన పేదలకు మాత్రమే పథకం అమలు చేసేవిధంగా అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. డెయిరీ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి హర్యానా నుంచి గేదెలు కొనుగోలు చేయనున్నట్లు చెప్పారు.  దళితబందు పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. దళిత బంధు పథకం రానున్న కాలంలో ప్రతి ఒక్కరికీ అందుతుందని, ఇదే రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇతర వర్గాలకు కూడా అమలు చేయనున్నారని చెప్పారు. కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి విపక్ష రాజకీయ పార్టీలకు మింగుడు పడటం లేదని అందుకు దిగజారి విమర్శలు చేస్తున్నారని అన్నారు. అంతకు ముందు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఆర్డీవో సూర్యనారాయణ, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకరరావు, జడ్పీటీసీ సభ్యుడు కూసంపూడి రామారావు, సత్తుపల్లి మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కొత్తూరు ఉమామహేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-17T05:10:20+05:30 IST