ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన పత్తి
ABN , First Publish Date - 2022-10-22T05:32:05+05:30 IST
ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన పత్తి
ఈ సీజనలో తొలిసారి 6వేల బస్తాల రాక
ఖమ్మం మార్కెట్ , అక్టోబరు 21: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు పత్తి పోటెత్తింది. శుక్రవారం మార్కెట్‌కు సుమారు 6వేల పత్తి బస్తాలు అమ్మకాని రాగా.. ఈ సీజనలో ఇంతమొత్తంలో పంట మార్కెట్‌కు రావడం ఇదే తొలిసారి. కొంత కాలంగా 500 నుంచి వెయ్యి బస్తాల వరకు వస్తుండగా శుక్రవారం ఆరు వేల పైచిలుకు బస్తాల అమ్మకానికి వచ్చాయి. దీపావళి పండుగ ఖర్చులకు గాను రైతులు తమ ఇళ్లలో నిల్వ ఉంచుకున్న పంటను విక్రయించడానికి మొగ్గు చూపుతున్నారు. కాగా శుక్రవారం క్వింటా పత్తిని గరిష్ఠంగా రూ.8,000, కనిష్ఠంగా రూ.4,000, నమూనా రకాలను రూ.7,000 వరకు ఆనలైన బిడ్డింగ్ ద్వారా వ్యాపారులు కొనుగోలు చేశారు. పత్తికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర (ఎంఎ్‌సపీ) క్వింటాకు రూ.6,380 కాగా అదనంగా రూ.1,000 నుంచి రూ.1,600 వరకు అదనంగా గిట్టుబాటు ధరలు దక్కడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పత్తి కొనుగోళ్లను మార్కెట్ కమిటీ చైర్‌పర్సన డౌలె లక్ష్మీప్రసన్న, సెక్రెటరీ రుద్రాక్షల మల్లేశం, అసిస్టెంట్ సెక్రెటరీ రాజేంద్రప్రసాద్, తదితరులు సమీక్షిస్తున్నారు.
మార్కెట్‌ను సందర్శించిన సీసీఐ ప్రతినిధులు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను శుక్రవారం కాటన కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్రతినిధులు సందర్శించారు.అమ్మకానికి వచ్చిన పత్తి నాణ్యత, తేమ శాతాన్ని పరిశీలించి పత్తికి లభిస్తున్న ధరలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ మద్దతుధర క్వింటా రూ.6,380కు తక్కువగా వ్యాపారులు కొనుగోలు చేస్తే వెంటనే సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మార్కెట్‌ను సందర్శించిన వారిలో సీసీఐ ప్రతినిధులు అజయ్, రవితేజ, మార్కెట్ సెక్రెటరీ మల్లేశం, ఏఎస్ రాజేంద్రప్రసాద్ ఉన్నారు.