Khammam: పోటాపోటీగా తల్లీ కూతుళ్ల ప్రిపరేషన్.. తెలుగు రాష్ట్రాల్లో వైరల్..

ABN , First Publish Date - 2022-12-15T12:11:36+05:30 IST

ఖమ్మం: అమ్మే అందరికీ ధైర్యం. అమ్మంటే కేవలం ప్రేమను పంచడమే కాదు. ధైర్యాన్ని నింపుతుంది. ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ఖమ్మం జిల్లాలో అటువంటి ఘటనే జరిగింది.

Khammam: పోటాపోటీగా తల్లీ కూతుళ్ల ప్రిపరేషన్.. తెలుగు రాష్ట్రాల్లో వైరల్..

ఖమ్మం: అమ్మే అందరికీ ధైర్యం. అమ్మంటే కేవలం ప్రేమను పంచడమే కాదు. ధైర్యాన్ని నింపుతుంది. ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. ఖమ్మం జిల్లాలో అటువంటి ఘటనే జరిగింది. ఇంతకీ ఆ తల్లీ కూతురు సాధించిన ఘనత ఏంటీ? తెలుగు రాష్ట్రాల్లో వాళ్లు ఎందుకు వైరల్ అయ్యారు? ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఘటనలు మనం అనేకం ఉన్నాయి. కూతురు ఉన్నతాధికారిగా వచ్చి తండ్రితో సెల్యూట్ చేయించుకున్న ఘటనలూ జరిగాయి. అలానే తండ్రీకొడుకులు, తల్లీకూతుళ్లు ఒకేసారి పరీక్షలు రాయడం వంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

తాజాగా ఓ యువతి కూడా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తల్లిని ఆదర్శంగా తీసుకుని ఎస్‌ఐ కావాలనుకుంది. అలానే తన కూతురు ఎస్‌ఐ అయితే తాను తక్కువ అవుతానని భావించినట్లుంది ఆ తల్లి. అందుకే ఆమె కూడా ఎస్‌ఐ జాబ్ కోసం ప్రయత్నించింది. ఇటీవల నిర్వహించిన ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఇద్దరూ అర్హత సాధించారు. అలానే తాజాగా జరిగిన ఎస్‌ఐ ఈవెంట్స్‌లో కూడా సత్తాచాటి ఇద్దరూ పాసయ్యారు. ఇక ఎస్‌ఐ సీట్లో కూర్చునేందుకు అడుగు దూరంలో ఆ తల్లీకూతుర్లు ఉన్నారు. ఇలా ఉద్యోగం కోసం పోటీపడే తల్లీ కూతుళ్లు చాలా అరుదుగా కనిపిస్తుంటారు.

ఖమ్మం జిల్లాలోని చెన్నారం గ్రామానికి చెందిన తోళ్ల నాగమణికి త్రిలోకిని అనే కుమార్తె ఉంది. నాగమణి ములుగు జిల్లాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. గతంలో నాగమణి పోలీస్ శాఖలో హోంగార్డుగా విధులు నిర్వహించారు. అయితే ఇంకా ఉన్నత స్థితికి వెళ్లాలనే కోరిక నాగమణిలో బలంగా ఉండేది. దీంతో గతంలో విడుదలైన నోటిఫికేషన్‌లో ఆమె కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. నాగమణి కుమార్తె త్రిలోకిని డిగ్రీ పూర్తి చేసింది. తల్లిని చూస్తూ పెరిగిన ఆ యువతికి.. తల్లీలాగానే పోలీస్ కావాలని బలంగా అనుకుంది. కూతురు పట్టుదల చూసిన నాగమణి కూడా బాగా ప్రోత్సహించింది. ఎస్‌ఐ ఉద్యోగానికి సిద్ధమయ్యేందుకు అవసరమైన మేలుకువలను నాగమణి కుమార్తె వివరించింది. కొన్ని నెలల క్రితం వెలువడిన ఎస్‌ఐ నోటిఫికేషన్లో తల్లీకూతుళ్లు ఇద్దరూ దరఖాస్తు చేశారు. అంతేకాక పోటాపోటీగా తల్లీ కూతుళ్లు పట్టుదలతో ప్రిపరేషన్ సాగించారు. దీంతో ఇటీవల జరిగిన ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్షలో ఇద్దరు చాలా ఈజీగా అర్హత సాధించారు.

మొదటి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసిన వారిద్దరు.. ఆ తరువాత జరిగే ఈవెంట్స్‌పై దృష్టి పెట్టారు. ఈ వెంట్స్‌లో అర్హత సాధించడమే లక్ష్యంగా ఇద్దరు కలిసి గ్రౌండ్‌లో కఠోర సాధనా చేశారు. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. ఇందులో మంచి ప్రతిభ చూపించి… ఇద్దరూ క్యాలిఫై అయ్యారు. దీంతో వారు రెండో ఘట్టాన్ని కూడా సక్సెస్‌గా పూర్తి చేసుకున్నారు. ఇక మిగిలింది చివరి ఘట్టమైన మెయిన్స్. ఈ పరీక్షల్లోనూ సత్తా చాటి చరిత్ర సృష్టించాలని ఆ తల్లీకూతుళ్లు ఎదురు చూస్తున్నారు. అంతేకాక కచ్చితంగా ఎస్సై జాబ్‌ను సాధిస్తామని ఇద్దరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతిమ ఫలితం పక్కనపెడితే ఈ తల్లీకూతుళ్లు పట్టుదల, శ్రమ ఎందరో మహిళలకు ఆదర్శం.

Updated Date - 2022-12-15T12:11:39+05:30 IST