పోడు చిచ్చులో సమిధలు

ABN , First Publish Date - 2022-11-24T01:23:41+05:30 IST

ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహించడం అటవీశాఖ సిబ్బందికి కత్తిమీద సాములా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయాలు అమలుచేసే క్రమంలో అటవీ ఉద్యోగులు అటు ప్రజాప్రతినిధులు ఇటు పోడుసాగుదారులనుంచి తీవ్రస్థాయిలో బెదిరింపులు, దాడులు ఎదుర్కొంటున్న దశలో ఏకంగా ఓ ఫారెస్టు రేంజర్‌ హత్యకుగురికావడం అటవీ ఉద్యోగుల్లో భయాందోళన కలిగిస్తోంది.

పోడు చిచ్చులో సమిధలు

ప్రభుత్వ రెండు నాల్కల ధోరణితో క్షేత్రస్థాయిలో వివాదాలు

అక్కడ అడ్డుకోమంటారు.. ఇక్కడ రెచ్చగొడతారు

ప్రజాప్రతినిఽధులు, పోడుసాగుదారుల బెదిరింపులతో అటవీ సిబ్బంది బెంబేలు

ఎఫ్‌ఆర్‌సీ కమిటీ నిబంధనలతో సాగురైతుల విలవిల

కేంద్ర సవరణలతో ముంచుకొస్తున్న ముప్పు

ఇల్లెందు/మణుగూరు, నవంబరు 23: ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహించడం అటవీశాఖ సిబ్బందికి కత్తిమీద సాములా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయాలు అమలుచేసే క్రమంలో అటవీ ఉద్యోగులు అటు ప్రజాప్రతినిధులు ఇటు పోడుసాగుదారులనుంచి తీవ్రస్థాయిలో బెదిరింపులు, దాడులు ఎదుర్కొంటున్న దశలో ఏకంగా ఓ ఫారెస్టు రేంజర్‌ హత్యకుగురికావడం అటవీ ఉద్యోగుల్లో భయాందోళన కలిగిస్తోంది. అడవుల రక్షణే కాకుండా నక్సలైట్‌ సంస్థలు, కమ్యూనిస్టు పార్టీల ప్రాభల్య ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్ధేశించిన ‘హరితహారం’ కార్యక్రమాన్ని అమలు చేసే క్రమంలో అటవీఉద్యోగుల కడగండ్లు చెప్పలేనివి.. ఏజెన్సీ ప్రాంతాల్లో ట్రెంచ్‌ పనులు, ప్లాంటేషన్లు చేస్తున్న ఉద్యోగులపై అనేకచోట్ల మూకుమ్మడిగా దాడులు చేయడం, యంత్రాలను అడ్డుకోవడం పరిపాటిగా మారింది. ఉన్నతాధికారుల టార్గెట్‌లు పూర్తి చేసేందుకు పలు గ్రా మాల్లో నాయకులను, పార్టీలను బతిమిలాడుకుంటూ సాగులో ఉన్న కొంతభూమిని తీసుకొని ‘హరితహారం’ మొక్కలు నాటుతూ అటవీ సిబ్బం ది తమ ఉద్యోగాలను కాపాకుంటున్నారనేది కాదనలేని సత్యం. కొన్ని ప్రాం తాల్లో గ్రామస్థులు పోడుభూమిని ఇచ్చేందుకు నిరాకరిస్తే అక్కడ పోడు అరికట్టేందుకు తీసుకునే చర్యలపై ప్రజాప్రతినిధులు కన్నెర్రజేస్తున్నారు. గ్రామాల్లో తమ ప్రాబల్యాన్ని కాపాడుకునేందుకు గతంలో జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే అటవీ అధికారులను తీవ్రస్థాయిలో బెదిరించారు.

కొందరు నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మరింత ముప్పు

పోడు పట్టాలకోసం 2005కు ముందు సాగులో ఉన్న భూమికి మాత్రమే అర్హత ఉందని ప్రభుత్వం చెబుతున్నా ఈ విషయం అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు చేరడం లేదు. దీనికి తోడు ఏజెన్సీ ప్రాంతాల్లో కొందరు ప్రజాప్రతినిధులు కావాలనే పోడు సాగుపై గిరిజనులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యానాలు చేయడంతో వారు అటవీ అధికారులపై తిరగబడుతున్నారు. గతంలో పినపాక నియోవజర్గంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి ‘‘ఫారెస్టు అఽధికారుల బరతం పట్టండి’’, ‘‘ఊరిలోకి వచ్చిన వారిని తరమి కొట్టండి’’, ‘‘దాడులు చేయండి’’ అంటూ గిరిజనులను రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేయడం సంచలనం కలిగించింది. ఈ వ్యాఖ్యలపై అప్పుడే ఫారెస్టు శాఖ అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఆ సందర్భంలో అటవీ అధికారులు కొంతకాలం పోడు భూముల జోలికి వెళ్లేందుకు సంకోచించారు. విధులు నిర్వహించాలని చెప్పేది వారే, వాటిని అడ్డుకోండని ప్రజలను రెచ్చగొట్టెది వారే అయినప్పుడు తమకు ఏం చేయాలో పాలుపోవడం లేదని ఫారెస్టు అధికారులు, సిబ్బంది వాపోతున్నారు.

ఎఫ్‌ఆర్‌సీ కమిటీలతోనూ అవస్థలే..

రాష్ట్ర ప్రభుత్వం జీవో-140తో పోడుసాగుదార్లకు ఆర్‌వోఎ్‌ఫఆర్‌ హక్కులు కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఫారెస్ట్‌ రైట్స్‌ కమిటీల్లోనూ అటవీ ఉద్యోగులే కీలకం కావడంతో పోడుదార్ల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్రం నిర్ణయించిన 2005 కటాఫ్‌ తేదీ తరువాత సాగులోకి తెచ్చిన పోడు భూములకు ఆర్‌వోఎ్‌ఫఆర్‌ పట్టాలు ఇవ్వడానికి అవకాశం లేదు. అయితే తాజా దరఖాస్తుల్లో 75శాతం 2005 తరువాత అడవులను నరికినట్లు వెల్లడవుతుండడం అటవీ ఉద్యోగులకు ప్రాణసంకటంగా మారింది. కమిటీల్లో రెవెన్యూ అధికారులు, స్థానికులు ఉన్నా పోడు సాగు అంశం అటవీశాఖ జీపీఎ్‌సతో ముడిపడి ఉండటంతో పట్టా వచ్చినా.. రాకున్నా అటవీ అధికారులదే బాధ్యత అని ఏజెన్సీ గ్రామాల్లో తీవ్రస్థాయిలో హెచ్చరికలు ఎదుర్కొంటున్నారు. అర్జీలు తిరస్కరిస్తే బెదిరింపులు వస్తున్నాయని అటవీ అధికారులు వాపోతున్నారు. ఈ వ్యిహారంలో అధికార పార్టీ మొదలుకొని విపక్ష పార్టీల నాయకుల వరకు బెదిరింపులకు పాల్పడుతుండడంతో అటవీ ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు.

కేంద్ర సవరణలతో ఏజెన్సీలో ఉద్రిక్తతలు..

ఒకవైపు పోడుభూముల సాగు, పట్టాల వివాదాలు జఠిలంగా మరగా మరోవైపు కేంద్ర ప్రభుత్వం రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అటవీ హక్కుల చట్టాలకు సవరణలు చేసేందుకు ప్రతిపాదనలు చేయడంతో రానున్న రోజుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. కేంద్ర రికార్డుల్లో ఉన్న అటవీ భూములను ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు ఇచ్చేందుకు చేస్తున్న సవరణల మూలంగా ప్రస్తుతం సాగులోవున్న పోడుభూములకు కూడా ముప్పు కలుగుతుందని ఆదివాసీ సంఘాలు ఆంళోళన వ్యక్తం చేస్తున్నాయి. అటవీ సంరక్షణ నియమాల సవరణ పేరిట కేంద్రం చేస్తున్న మార్పుల్లో ఇప్పటి వరకు అటవీ హక్కులు కలిగిన ఆదివాసీలకు హాని కలుగుతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అటవీ సంరక్షణ చట్టం-1980, అటవీ హక్కుల గుర్తింపు చట్టం-2006, పెసా చట్టలా సవరణలతో సంపూర్ణ అధికారాలు కేంద్రం ఆధీనంలోకి వెళ్లడంతో గ్రామసభలతో నిమిత్తం లేకుండా వివిధ సంక్షేమ పధకాలకు అటవీ భూములను కేటాయించే అవకాశం ఉందని వాపోతున్నారు. ఈ చర్యలకు నిరసనగా ఇప్పటికే వివిధ పార్టీలు, నక్సటైల్‌ సంస్థలు ఆందోళనలు చేపడుతుండటంతో ఏజెన్సీలో ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి.

Updated Date - 2022-11-24T01:23:42+05:30 IST