భద్రాచలం ఏజెన్సీకి నేడు సీఎల్పీ బృందం

ABN , First Publish Date - 2022-08-16T06:04:08+05:30 IST

భద్రాచలం ఏజెన్సీకి నేడు సీఎల్పీ బృందం

భద్రాచలం ఏజెన్సీకి నేడు సీఎల్పీ బృందం

గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటన

సీతారామ ప్రాజెక్టు ముంపు ప్రాంత పరిశీలన

భద్రాచలం, ఆగస్టు 15: గోదావరి పరివాహక ప్రాంతమైన భద్రాచలం ఏజెన్సీలో మంగళవారం కాంగ్రెస్‌ శాసనసభాపక్ష బృందం(సీఎల్పీ) బృందం పర్యటించనుంది. జూలైలో వచ్చిన గోదావరి వరదలతో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతవాసుల జీవనం చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. గత 32 ఏళల్లో ఎన్నడూ లేని స్థాయిలో ఈ సారి గోదావరి వరద 71.3అడుగులు రావడంతో ఈ ప్రాంతం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో నదీ పరివాహకంలోని ముంపు ప్రాంతవాసులను పరామర్శించి, వారి సమస్యలను తెలుసుకునేందుకు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష బృందం(సీఎల్పీ) భద్రాచలం ఏజెన్సీలో పర్యటించనుంది. సీఎల్పీ నేత మల్లుభట్టివిక్రమార్క  నేతృత్వంలో ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ జీవనరెడ్డి తదితరులు పర్యటించనున్నారు. వీరంతా సోమవారం రాత్రి బూర్గంపాడు మండలంలోని ఐటీసీ అతిథి గృహానికి చేరుకున్నారు. మంగళవారం తొలుత భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం విస్తా కాంప్లెక్స్‌, చప్టా దిగువ పరిసరాల్లో ఇటీవల ముంపునకు గురై ఆర్థికంగా ఇబ్బందుల పాలైన వ్యాపారులను పరామర్శించనున్నారు. అలాగే విస్తా కాంప్లెక్స్‌ స్లూయిస్‌, కరకట్ట ప్రాంతాన్ని పరిశీలిస్తారు. అనంతరం సుభా్‌షనగర్‌ కాలనీలోని ముంపునకు గురైన కుటుంబాలను పరామర్శిస్తారు. అనంతరం దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామానికి వెళ్లి వరద బాధిత కుటుంబాలతో మాట్లాడనున్నారు. తిరిగి భద్రాచలం చేరుకొని భోజన విరామం అనంతరం బూర్గంపాడు మండలంలోని సారపాక సుందరయ్యనగర్‌ ప్రాంతంలో పర్యటిస్తారు. అనంతరం అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామాన్ని సందర్శించి సీతారామ ప్రాజెక్టు ముంపు ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించనున్నారు. భద్రాద్రి ఏజెన్సీలో పర్యటన ముగిసిన అనంతరం ములుగు జిల్లాలోని ఏటూరునాగారం వెళ్లనున్నారు. 


దేశాన్ని ‘కార్పొరేట్‌’కు తాకట్టు పెడుతున్న కేంద్రం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

మధిరటౌన్‌, ఆగస్టు 15: నాడు వ్యాపారం పేరుతో దేశాన్ని ఆక్రమించుకున్న ఈస్ట్‌ఇండియా కంపెనీ తరహలోనే నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని బహుళజాతి కంపెనీలకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టివ్రిమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా మధిరలోని ఎమ్మెల్యే క్యాంపుకార్యాలయంలో సోమవారం ఆయన జాతీయజెండాను ఎగురవేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. భూమి, నీరు కొద్దిమంది చేతుల్లో ఉండకూడదని, అందరికీ దేశ సంపద, ఫలాలు అందాలని భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్ర ఆ తరువాత ఇందిరాగాంధీ అనేక పథకాలకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. కానీ నేడు బీజేపీ ప్రభుత్వం విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెడుతోందని ఆరోపించారు. వజ్రోత్సవస్పూర్తితో ప్రజలందరూ ఏకమై దేశాన్ని కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైందన్నారు. 

Read more