ప్రశాంతంగా నీట్‌ పరీక్ష

ABN , First Publish Date - 2022-07-18T07:15:14+05:30 IST

ప్రశాంతంగా నీట్‌ పరీక్ష

ప్రశాంతంగా నీట్‌ పరీక్ష
పరీక్షా కేంద్రం విద్యార్థులు,

ఖమ్మం జిల్లాలో 2515మంది, భద్రాద్రి జిల్లాలో 747మంది విద్యార్థుల హాజరు

ఖమ్మం రూరల్‌లో ఓ విద్యార్థినికి అస్వస్థత

ఖమ్మం ఖానాపురం హవేలీ/కొత్తగూడెం కలెక్టరేట్‌/ఖమ్మం రూరల్‌, జూలై 17: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో వైద్య విద్య అభ్యసించడానికి ఎన్‌టీఏ (నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (యు.జి) నీట్‌ పరీక్ష జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా జరిగిందని నీట్‌ సిటీ కో-ఆర్డినేటర్‌ ఆర్‌.పార్వతీరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లాలోని నాలుగు పరీక్షా కేంద్రాల్లో 2,587 మంది విద్యార్థులు మెడికల్‌ ఎంట్రన్స్‌ పరీక్షకు హాజరవ్వాల్సి ఉండగా 2,515 మంది హాజరయ్యారని 72మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు.  పరీక్షా కేంద్రాల వద్ద సరైన ఏర్పాటు చేయకపోవ డంతో విద్యార్థుల తల్లిదండ్రులు వర్షంలో తడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


భద్రాద్రి జిల్లాలో 747మంది హాజరు 

డాక్టర్‌ కోర్సులో చేరేవారికి ఆదివారం నిర్వహించిన నీట్‌ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో రెండు పరీక్షా కేంద్రాల్లో 800మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 747మంది పరీక్షకు హాజరయ్యారు. 53మంది గైర్హాజరయ్యారు. పాల్వంచలలోని డీఏవీ కేటీపీఎ్‌సలో 576మందికి 546మంది పరీక్ష రాశారు. కొత్తగూడెం సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో 224మందికి 201మంది పరీక్ష రాశారని జిల్లా కో ఆర్డీనేటర్‌ ఎంవీ శ్రీనివాసరెడ్డి తెలిపారు.


అస్వస్థతకు గురైన విద్యార్థిని 

నీట్‌ పరీక్షా కేంద్రం వద్ద ఓ విద్యార్థిని చాతినొప్పితో స్పృహ కోల్పోయి అస్వస్థతకు గురైంది. వెంటనే స్పందించిన రూరల్‌ పోలీసులు పోలీస్‌ వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిపెడ బంగ్లాకు చెందిన తేజశ్విని ఖమ్మం రూరల్‌ మండలం, పోలేపల్లి పరిధిలోని కేంద్రీయ విద్యాలయంలో నీట్‌ పరీక్షకు హాజరైంది. అయితే పరీక్షా కేంద్రం ముందు విద్యార్థిని అకస్మాత్తుగా చాతినొప్పితో స్పృహ కోల్పోయి కిందపడిపోయింది. దీంతో రూరల్‌ ఎస్‌ఐ శంకర్‌రావు స్పందించి విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు.



Updated Date - 2022-07-18T07:15:14+05:30 IST