నిరాడంబరంగా ప్లవోత్సవం

ABN , First Publish Date - 2022-01-13T05:49:33+05:30 IST

వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచల వైకుంఠ రామయ్యకు ప్లవోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో గతే

నిరాడంబరంగా ప్లవోత్సవం
రామయ్యకు తెప్పోత్సవం నిర్వహిస్తున్న వైదికులు

కరోనా నేపథ్యంలో అంతరంగికంగా వేడుక

వేదఘోషతో పులకించిన భద్రగిరి

ముక్కోటి ఏకాదశి సందర్భంగా నేడు ఉత్తరద్వార దర్శనం

భద్రాచలం, జనవరి 12: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచల వైకుంఠ రామయ్యకు ప్లవోత్సవాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో గతేడాది లాగానే వైదిక పరిపాలన సిబ్బంది సమక్షంలో నిత్యకల్యాణ వేదిక వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక కొలనులోని హంసాలంకృత గద్దెపై సీతారామచంద్రుడు, లక్షణస్వాములను ఆసీనులను చేశారు. ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించి.. ప్రత్యేక హారతులు, ప్రసాద నివేదన చేశారు. అయితే తొలుత గోదావరి నుంచి తీర్థబిందెలను తీసుకొచ్చి సాయంత్రం 5.58 గంటలకు స్వామివారిని అలంకరించి పల్లకీలో భాజాభజంత్రీలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిత్యకల్యాణ మండప వేదిక వద్దకు తీసుకొచ్చి ప్లవోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో  భద్రాచలం దేవస్థానం ఈవో బి.శివాజీ, ఇనచార్జ్‌ సబ్‌కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, ఏఎస్పీ అక్షాంశ యాదవ్‌, సీఐ టి.స్వామి, తహసీల్దార్‌ శ్రీనివాస యాదవ్‌, ఏఈవో శ్రావణ్‌కుమార్‌, పర్యవేక్షకులు కత్తి శ్రీనివాస్‌, నిరంజనకుమార్‌, లింగాల సాయిబాబా, డీఈ వి.రవీంద్రనాఽథ్‌, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాది విజయారాఘవన, ఉప ప్రధాన అర్చకులు అమరవాది శ్రీనివాస రామానుజం, ముఖ్య అర్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, అమరవాది మధుసూదనాచార్యులు పరిపాలన, వైదిక సిబ్బంది పాల్గొన్నారు.  

 నేడు ఉత్తర ద్వార దర్శనం

ముక్కోటి ఏకదాశి సందర్భంగా భద్రాచలంలో గురువారం తెల్లవారుజామున స్వామివారు ఉత్తరద్వారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జనవరి 3న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభం కాగా తొలి పదిరోజుల పాటు పగల్‌పత్తు ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల ముగింపును పురస్కరించుకొని బుధవారం రామాలయంలో తిరుమంగై ఆళ్వార్‌ పరమపదోత్సవం, వేద పఠనం చేశారు. సాయంసంధ్య వేళ ఆలయ ప్రాంగణంలో స్వామివారికి తెప్పోత్సవం నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున ఉత్తరద్వారంలో శ్రీరాముడు భక్తులకు దర్శనమివ్వనుండటంతో అందుకు అనుగుణంగా దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో ఉత్తరద్వార దర్శననానికి భక్తులను అనుమతించబోమని ప్రకటించిన అధికారులు ప్రసార మాధ్యమాల ద్వారానే కార్యక్రమాన్ని తిలకించాలని సూచించారు.

భక్తరామదాసు కాలంనుంచి..

భక్తరామదాసు పాల్వంచ పరగణాకు తహసీల్దారుగా ఉన్న కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి ముందుగా స్థానిక తహసీల్దార్‌ ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి స్వామివారిని ఉత్తర ద్వారం వైపు తీసుకొస్తారు. అనంతరం సరిగ్గా ఐదు గంటల సమయంలో ఉత్తరద్వారాన్ని తెరవడంతో స్వామివారు వైకుంఠ రాముడిగా భక్తులకు దర్శనమిస్తారు. 

భద్రాద్రి ఉత్సవాలకే ఎందుకిలా..?

ఇదిలా ఉండగా రెండేళ్లుగా భద్రాద్రి రామాలయంలో ప్రధాన ఉత్సవాలను అంతరంగికంగా నిర్వహించాల్సి రావడం పట్ల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రిలో జరిగే ఉత్సవాలకే ఎందుకిలా జరుగుతోందని, రూ.60లక్షలతో ఏర్పాట్లు చేసి ఉత్సవాలను అంతరంగికంగా నిర్వహించడమేంటోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో నిర్వహించే ఉత్సవాలు, రాజకీయ కార్యక్రమాలకు లేని ఆంక్షలు భద్రాద్రికే వర్తిస్తాయా? అని ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2022-01-13T05:49:33+05:30 IST